బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం- బిగ్ రిలీఫ్
Bay of Bengal: ఏపీలో ఎండలు మండిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పొరుగునే ఉన్న తమిళనాడుకు మాత్రం వరుణుడు కరుణించాడు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయక్కడ. దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురుస్తోన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావమే ఈ వర్షాలకు కారణం.
నేడు, రేపు తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ అంచనాలకు అనుగుణంగా దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి కుండపోతగా వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో రాత్రంతా దంచి కొట్టాయి.

తూత్తుకుడి జిల్లాలో వర్షాల తీవ్రత అధికంగా కనిపించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. జనం అంధకారంలో గడిపారు. భారీ వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తమిళనాడులో దక్షిణ ప్రాంతంలో 10 జిల్లాలకు ఇదివరకే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్ కాశి, తూత్తుకూడి, విరుధునగర్, రామనాథపురం, పుదుక్కోట్టై, శివగంగ, తంజావూరు, మధురై జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. తిరుచ్చి, ఈరోడ్, సేలం, తిరువారూర్, నాగపట్నం, మైలాడుథురై, థేని, దిండిగల్, కోయంబత్తూరు.. వంటి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 13వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేసింది.
వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తూత్తుకుడి జిల్లా కలెక్టర్ కే ఇళాంబవత్.. రెవెన్యూ అధికారులతో సమావేశం అయ్యారు. తీర ప్రాంత గ్రామాలను అప్రమత్తం చేశారు. ఆరెంజ్ అలెర్ట్ జారీ అయినందున ఆయా మండలాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రత స్వల్పంగా తగ్గినట్టే కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గుదల నమోదైంది. తమిళనాడు దక్షిణ ప్రాంత జిల్లాలు, పుదుచ్చేరి, కారైకల్‌లల్లో 28 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత రికార్డయింది.












Click it and Unblock the Notifications