• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెంగాల్ డ్రగ్స్ కేసు : బీజేపీ కీలక నేత రాకేశ్ సింగ్,అతని కుమారులు అరెస్ట్...

|

పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నేత రాకేశ్ సింగ్‌ను మంగళవారం(ఫిబ్రవరి 23) అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతని ఇద్దరు కుమారులు సువమ్ సింగ్(25),సాహెబ్ సింగ్(21)లను కూడా అరెస్ట్ చేశారు. ఇటీవల డ్రగ్స్‌తో పట్టుబడ్డ బీజేపీ యువమోర్చా నేత పమేలా గోస్వామి... ఈ వ్యవహారంలో రాకేశ్ సింగ్ పేరును బయటపెట్టిన సంగతి తెలిసిందే. రాకేశే ఇందులో తనను ఇరికించాడని ఆమె ఆరోపించారు. తనపై కుట్ర జరిగిందని... దీనిపై సీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తాజాగా రాకేశ్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.పర్బా బర్దమాన్ జిల్లాలోని గాల్సి పట్టణంలో అతన్ని పట్టుకున్నట్లు చెప్పారు. రాకేశ్ బెంగాల్‌ను విడిచి పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం గాల్సి పోలీస్ స్టేషన్‌లో కోల్‌కతా పోలీస్ బృందం అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Bengal BJP Leader rakesh singh Arrested in pamela goswami cocaine case

రాకేశ్ సింగ్ అరెస్టుకు ముందు కోల్‌కతా పోలీసులు అతని నివాసంలో తనిఖీలు చేశారు. పోలీసులతో పాటు యాంటీ నార్కోటిక్స్,యాంటీ రౌడీ సెక్షన్ టీమ్స్ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేశ్ ఇద్దరు కుమారులను సువమ్ సింగ్(25),సాహెబ్ సింగ్(21)లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోలీసుల తనిఖీలపై రాకేశ్ సింగ్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సెర్చ్ వారెంట్ కూడా లేకుండానే వారు తమ ఇంట్లోకి చొరబడ్డారని రాకేశ్ కుమార్తె ఆరోపించారు. తనిఖీల సమయంలో వారు తనపై దాడికి పాల్పడ్డారని,తన సోదరులను పట్టుకెళ్లారని చెప్పారు. అసలు వాళ్లను ఎందుకు తీసుకెళ్లారో కూడా చెప్పట్లేదని... తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

తమ తండ్రి రాజకీయ నాయకుడు అయినందుకు గతంలోనూ వేధింపులు ఎదుర్కొన్నామని... కానీ ఇంతలా ఎవరూ వేధించలేదని రాకేశ్ సింగ్ కుమార్తె అన్నారు. దాదాపు 20 మంది అధికారులు తమ ఇంట్లో సోదాలు నిర్వహించారని... ఎక్కడా,ఏమీ దొరకలేదని చెప్పారు. ప్రస్తుత పరిణామాలపై స్పందించేందుకు రాకేశ్ సింగ్ తరుపు న్యాయవాది విముఖత వ్యక్తం చేశారు.

నిజానికి ఈ నెల 26 లోగా పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందిగా రాకేశ్ సింగ్‌కు నోటీసులు జారీ అయ్యాయి. కానీ పార్టీ కార్యక్రమాల రీత్యా తాను పోలీసుల ఎదుట హాజరుకాలేనని అతను చెప్పాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు ప్రత్యేక బృందాలతో అతని కోసం గాలించి ఎట్టకేలకు పట్టుకన్నారు.

కాగా,ఇటీవల భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం)కు చెందిన పమేలా గోస్వామి, ఆమె స్నేహితుడు ప్రదీప్‌ కుమార్‌ కొకైన్‌తో పట్టుబడిన సంగతి తెలిసిందే. లక్షలాది రూపాయల విలువైన డ్రగ్స్‌ను కారులో తరలిస్తుండగా ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బీజేపీ నేత రాకేశ్ సింగ్ తనపై కుట్ర చేశారని... తన కారులో ఆయనే డ్రగ్స్ పెట్టించారని పమేలా గోస్వామి ఆరోపించారు. దీనిపై సీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇన్‌చార్జి కైలాష్ విజయ్ వర్గియాకు రాకేశ్ సింగ్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. దీంతో బెంగాల్ రాజకీయాల్లో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీ నేతల నిజస్వరూపం ఇదేనని అధికార తృణమూల్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు రాకేశ్ సింగ్ మాత్రం.. తృణమూల్‌ కాంగ్రెస్‌, కోల్‌కతా పోలీసులు కలిసి ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. పమేలా గోస్వామి చేత బలవంతంగా తన పేరు చెప్పించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు మున్ముందు ఏ మలుపు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

English summary
West Bengal Police has arrested BJP leader Rakesh Singh from Galsi in Purba Bardhaman district in connection with the Pamela Goswami drugs case. The arrest was made by the Detective Department as Rakesh Singh was apparently trying to flee West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X