బెంగళూరులో రౌడీ ఈవెంట్ కు బీజేపీ నేతల హాజరు- చిక్కుల్లో బొమ్మై సర్కార్, పోలీసులు
బెంగళూరులో ఓ రౌడీ ఏర్పాటు చేసిన రక్తదానశిబిరానికి బీజేపీ నేతలు హాజరుకావడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం కాస్తా చినికి చినికి గాలివానగా మారి చివరికి బీజేపీ వర్సెస్ పోలీసులుగా మారిపోయింది. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇరుకునపడింది.
బెంగళూరులోని చామరాజ్ పేట్ లో ఉన్న బీఎస్ వెంకటరామ్ కళాభవనలో ఆదివారం నగరంలో పెద్ద రౌడీషీటర్ గా పేరున్న సైలెంట్ సునీల్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి బీజేపీకి చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యారు. ఇందులో ఎంపీలతో పాటు రాష్ట్రంలో కీలక నేతలున్నారు. అదీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో వీరి హాజరు ప్రభుత్వాని ఇరకాటంలో నెట్టింది. ఈ ఈవెంట్ కు హాజరైన వారిలో బీజేపీ ఎంపీలు పీసీ మోహన్, తేజస్వీ సూర్య, చిక్ పేట ఎమ్మెల్యే ఉదయ్ గరుడాచార్, బెంగళూరు సౌత్ బీజేపీ అధ్యక్షుడు ఎన్నార్ రమేష్ వంటి వారు ఉన్నారు.

ఈ రక్తదాన శిబిరం మామూలుగా జరిగిదే దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఒకప్పుడు కాంట్రాక్ట్ కిల్లర్ గా నగరాన్ని గడగడలాడించిన సునీల్.. ఇప్పుడు బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో అతను ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి బీజేపీ నేతలు హాజరుకావడం, సునీల్ కూడా కాషాయ కండువాతో దర్శనమివ్వడంతో వివాదం చెలరేగింది. దీంతో కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగారు.
బీజేపీ నేతలు కరడుగట్టిన క్రిమినల్స్ తో తిరుగుతుంటే నగరంలో క్రైమ్ రేట్ తగ్గుతుందా అంటూ కాంగ్రెస్ నేతలు హోంమంత్రి అరగ జ్ఞానేంద్రను ప్రశ్నించారు. నగర పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న సునీల్ వంటివారు ఏర్పాటు చేసిన ఈవెంట్ లో బీజేపీ నేతలు పాల్గొనడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందని వారు ప్రశ్నించారు. పోలీసులకు దొరకని మోస్ట్ వాంటెడ్ సునీల్.. బీజేపీ నేతలకు మాత్రం దొరికాడంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా ఇరుకునపడ్డారు.

ఈ ఈవెంట్ పై స్పందించిన నగర పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డి క్రైమ్ బ్రాంచ్ వివరణ కోరారు. అయితే సునీల్ పై ఎలాంటి కేసులు పెండింగ్ లో లేవని, వారంట్లు, సమన్లు కూడా లేవని, కాబట్టి ఈవెంట్ విషయంలో అతనిపై చర్యలు తీసుకునే పరిస్దితులు లేవని వారు నివేదించారు.