డిసెంబర్ 8న భారత్ బంద్ కు రైతుల పిలుపు.. ఉద్యమం ఉధృతం .. ఢిల్లీ అష్ట దిగ్బంధనానికి నిర్ణయం
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ లో భాగంగా ఆందోళన చేస్తున్న రైతులు ఇప్పటికే ఢిల్లీ బోర్డర్లో భారీగా మోహరించిన రైతులు పలు మార్గాలను బ్లాక్ చేశారు. కేంద్రంతో ఇప్పటికి రెండు సార్లు చర్చలలో పాల్గొన్నారు. అయినా కేంద్రం రైతుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించలేదు. మరోమారు చర్చలు జరుపుతామని చెప్పింది .
డిసెంబర్ 8న భారత్ బంద్ కు పిలుపు .. హైవే లపై టోల్ ట్యాక్స్ లను అడ్డుకోవాలని నిర్ణయం
ప్రభుత్వం ఏర్పాటు చేసిన లంచ్ కు నో .. మేం భోజనం తెచ్చుకున్నామంటూ స్వాభిమానం చాటుకున్న రైతులు

డిసెంబర్ 8న భారత్ బంద్ కు పిలుపు .. హైవే లపై టోల్ ట్యాక్స్ లను అడ్డుకోవాలని నిర్ణయం
కేంద్రం యొక్క నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బోర్డర్ లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు డిసెంబర్ 8 వ తేదీన మంగళవారం నాడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ కి వచ్చే అన్ని రహదారులను అడ్డుకుంటామని, కేంద్ర తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైవే టోల్ గేట్లను ఆక్రమిస్తామని , డిసెంబర్ 8 సమ్మెలో భాగంగా ప్రభుత్వం టోల్ వసూలు చేయడానికి కూడా అనుమతించేది లేదని రైతులు పేర్కొన్నారు .

రేపు దిష్టిబొమ్మల దహనానికి నిర్ణయం
వ్యవసాయ చట్టాల రద్దు కోసం చేస్తున్న రైతుల ఉద్యమంలో ఇక ముందు మరింత పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు చేరుతారని, మరింత ఉదృతంగా నిరసన తెలియజేస్తామని ప్రస్తుతం రైతు నిరసనలకు నాయకత్వం వహిస్తున్న హరీందర్ సింగ్ లఖోవాల్ పేర్కొన్నారు.
రైతు సంఘాలు ప్రభుత్వంతో జరిపిన చర్చలలో పెద్దగా పురోగతి లేకపోవడంతో , ప్రభుత్వం వ్యవసాయ చట్టాల రద్దుకు సుముఖంగా లేకపోవడంతో రైతులు ఆందోళన కొనసాగుతోంది. తమ నిరసన తీవ్రతరం చేస్తున్నట్లుగా ప్రకటించిన రైతులు శనివారం దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు .

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఢిల్లీ వదిలి వెళ్ళేది లేదు
కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బోర్డర్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు గత వారం హర్యానాలో పోలీసులు దాడిని ఎదుర్కొన్నారు. వాటర్ క్యానన్ లను ప్రయోగించినా, లాఠీ దెబ్బలు తిన్నా సరే తమ డిమాండ్ల పరిశాకరం అయ్యాకే తిరిగి వెళ్తామని చెప్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు హాని కలుగుతుందని, కనీస మద్దతు ధర విషయంలో కూడా ప్రభుత్వ తీరు సరిగా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఢిల్లీని వదిలేది లేదని తేల్చి చెప్పారు.

ఎనిమిది రోజులుగా తీవ్రమైన చలిలో రైతుల పోరాటం
ఇప్పటివరకు ఉన్న మార్కెట్ యార్డ్ ల ద్వారా కొనుగోలు విధానాలకు స్వస్తి చెప్పాలని మరియు రైతులను సంస్థాగత కొనుగోలుదారులకు మరియు పెద్ద అంతర్జాతీయ రిటైలర్లకు విక్రయించడానికి అనుమతించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా, కార్పొరేట్లకు లబ్ధి చేకూరుతుందని, తమకు నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. ఈ కారణంగానే ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులు గత ఎనిమిది రోజులుగా ఆందోళన బాట పట్టారు.

చట్టాలను రద్దు చేసేందుకు సుముఖంగాలేని కేంద్రం ... రద్దుకే రైతుల డిమాండ్
కేంద్ర వ్యవసాయ చట్టాల విషయంలో రద్దు చేయడానికి నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తాము వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాల నాయకులు తేల్చి చెబుతున్నారు. మరి ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల నిరసన మరింత ఉదృతం చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒక పక్క కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ఏ మాత్రం సుముఖంగా లేదు . రైతులు చట్టాల రద్దుకే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు .