
బూస్టర్ డోస్ ప్రయోగాలకు అనుమతి కోరిన భారత్ బయోటెక్-కోవిషీల్ట్, కోవాగ్జిన్ రెండు డోసుల తర్వాత
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో ఓమిక్రాన్ ప్రభావం పెరుగుతోంది. భారత్ లోనూ ఓమిక్రాన్ భయాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో బూస్టర్ డోస్ కోసం డిమాండ్ కూడా పెరుగుతోంది.ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు బూస్టర్ డోస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ల తయారీ సంస్ధలు బూస్టర్ డోస్ ప్రయోగాలు చేసేందుకు కేంద్రాన్ని అనుమతి కోరుతున్నాయి.
హైదరబాదీ వ్యాక్సిన్ తయారీ సంస్ధ భారత్ బయోటెక్ కూడా ఇవాళ బూస్టర్ డోస్ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. తమ వ్యాక్సిన్ కోవాగ్జిన్ లేదా సీరం ఇన్ స్టిట్యూట్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారికి తమ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు వీలుగా ప్రయోగాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని భారత్ బయోటెక్ కోరింది. అయితే ఈ బూస్టర్ డోస్ ఇప్పటివరకూ ఇచ్చిన టీకాల తరహాలో కాకుండా ముక్కు ద్వారా ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపింది.

నాసికా వ్యాక్సిన్ కోసం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారత్ బయోటెక్ డీజీసీఐ నుంచి అనుమతి కోరింది. 5 వేల సబ్జెక్టులతో ట్రయల్స్‌ను 3 నెలల్లో ముగించేందుకు కంపెనీ అనుమతి కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు కోవిడ్-19 వ్యాక్సిన్లను వైరస్ యొక్క కొత్త రకాల నుంచి రక్షణ కల్పించడానికి వ్యాక్సిన్ల సర్దుబాటు చేసుకోవచ్చని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. అంటే ఒక్కో డోస్ వ్యాక్సిన్ చొప్పున రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవచ్చన్న మాట. కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పై ఆందోళనల నేపథ్యంలో గులేరియా ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కొత్త వేరియంట్ అయినా ఇది తేలికపాటి వ్యాధిగా అనిపిస్తుందని, వ్యాక్సిన్‌కు సంబంధించినంతవరకు మనకు రక్షణ ఉండాలని ఆయన సూచించారు.