భారత్ సర్జికల్ స్ట్రైక్ 2.o ఒక్కరు కూడా చనిపోలేదన్నపాక్ ఆర్మీ చీఫ్ షాకింగ్ ట్వీట్
పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దేశం మొత్తం ఆగ్రహావేశాలతో రగిలిపోయిన ఉగ్రదాడి ఘటనకు సమాధానం చెప్పింది. ఉగ్రవాదాన్ని అణచివేయటం కోసం భారత్ నడుం బిగించింది. అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన దళాలు సర్జికల్ స్ట్రైక్స్ చేశాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది.ఈ దాడిలో పెద్ద ఎత్తున జైషే మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రకటించారు.దాదాపు 300 మంది చనిపోయివుంటారని అంచనా . అయితే అధికారికంగా ఎంతమంది చనిపోయారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ క్యాంప్‌పై దాడి కారణంగా సామాన్యులకు ఎలాంటి నష్టం కలగలేదని విజయ్ గోఖలే స్పష్టం చేశారు.
అయితే భారత్ జరిపిన సర్జికల్ ఎటాక్ పై పాక్ సైన్యాధికారి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ స్పందించారు. దాదాపు 300 మంది మరణించారని భావిస్తుంటే ఒక్కరు కూడా మరణించలేదని ఆయన ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
భారత యుద్ధ విమానాలు పీఓకే ప్రాంతంలో దాడులు జరిపి..భారీ ప్రాణనష్టానికి కారణమైనట్టు వచ్చిన వార్తలను మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తీవ్రంగా ఖండించారు.

"ముజఫరాబాద్ సెక్టార్ లో భారత విమానాలు సరిహద్దులను దాటి మూడు నుంచి నాలుగు మైళ్ల దూరం వచ్చాయనీ.. అవి కొన్ని బాంబులను జారవిడిచాయి. అయితే అవి ఖాళీగా ఉన్న ప్రాంతంలో పడ్డాయి తప్ప..మాకు ఎటువంటి నష్టాన్నికలిగించలేదనీ..ఒక్కరు కూడా మరణించలేదు. మరిన్ని వివరాలు కాసేపట్లో వెల్లడిస్తాం" అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ చేసిన ట్వీట్ అవాస్తవమని, ఎటాక్ లో భారీగానే ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తుంది.భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ లో భారీగా ప్రాణ నష్టం జరిగిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రకటిస్తే అలాంటిదేమీ లేదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చెప్పడం గమనార్హం.