వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీమవరం: సంక్రాంతి సంబరాలకు ఈ పట్టణం ఎందుకు కేంద్రంగా మారింది, ఇక్కడ ప్రత్యేకత ఏముంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భీమవరం పట్టణం

సంక్రాంతి సమయంలో గోదావరి ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. ఏటా ఈ సీజన్‌లో బంధుమిత్రుల రాకతో ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి.

అందులోనూ సంక్రాంతి సంబరాలకు భీమవరం కేరాఫ్ అడ్రస్ అని చాలా మంది భావిస్తుంటారు.

తెలంగాణ, కర్ణాటకతోపాటూ దేశవిదేశాల్లో స్థిరపడిన తెలుగువారు కూడా సంక్రాంతికి భీమవరం వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కోస్తా తీరంలో ఒక పట్టణానికి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఏర్పడింది.

భీమవరం ఆలయం

సంక్రాంతికి నెల ముందే రిజర్వేషన్లు

సంక్రాంతి సంబరాలకు వచ్చేవారికోసం డిసెంబర్ మధ్య నుంచే భీమవరంలో హోటళ్లకు రిజర్వేషన్లు మొదలవుతాయి. పెద్ద పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు హోటల్ రూమ్స్, ఇతర సదుపాయాల కోసం ముందే బుకింగ్స్ చేసేస్తారు.

సంక్రాంతి సమయంలో సరదాగా గడపడానికి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. దానికి తగ్గట్టే హోటల్ రూములకు గిరాకీ ఎక్కువగా ఉంటుందని భీమవరం హోటల్ అసోసియేషన్స్ ప్రతినిధులు చెబుతున్నారు.

హోటల్ యజమాని మోహన్ వంశీ ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు.

"మాకు నెల, రెండు నెలల ముందే బుకింగ్స్ వస్తాయి. నగరాల్లో అవకాశం లేని ఎన్నో రకాల వినోదాలు భీమవరంలో దొరుకుతాయి. ముఖ్యంగా కోడిపందాలు చూడాలని ఎక్కువ మంది వస్తారు. దాంతో మాకు హోటల్ రూములన్నీ ముందే బుక్ అయిపోతూ ఉంటాయి. చివరి క్షణంలో హోటల్ రూముల కోసం వస్తే, మాపై ఒత్తిడి ఉంటుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఏటా ఇలాగే ఉంటుంది" అన్నారు.

భీమవరం పట్టణం

'ఆంధ్రా లాస్ వెగాస్

భీమవరం పట్టణాన్ని స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాంధీజీ రెండో బార్దోలిగా ప్రస్తావించారు. బార్దోలిలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించినట్టే భీమవరం సమీపంలో జరిగిన సత్యాగ్రహ ఉద్యమంతో గాంధీజీ ఇలా ప్రస్తావించారని స్థానికులు చెబుతారు.

కానీ, ప్రస్తుతం భీమవరం ఆంధ్రా లాస్ వెగాస్ గా మారిందని పలువురు చెబుతున్నారు.

రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాణీ రత్నకుమార్ బీబీసీతో మాట్లాడుతూ భీమవరం ఇప్పుడు ఆంధ్రా లాస్ వెగాస్‌గా గుర్తింపు పొందిందని, మూడు రోజుల పాటు సాగే కోడిపందాలే అందుకు కారణమని చెప్పారు.

"మూడు రోజుల్లో సుమారుగా 200 కోట్లకు పైనే ఈ ప్రాంతంలో పందాలు జరుగుతాయి. భారీగా శిబిరాలు ఏర్పాటు చేసి కోడిపందాలు నిర్వహిస్తారు. ఇవి రాత్రీపగలూ తేడా లేకుండా జరుగుతాయి. వాటి కోసం ఇతర ప్రాంతాల వాళ్లు ఎక్కువగా వస్తుంటారు. భీమవరంలో సంక్రాంతి చాలా ఉత్సాహం కలిగించేలా ఉంటుంది. పిల్లలు, మహిళలు అంతా ఆనందంగా గడిపేందుకు చాలా ఏర్పాట్లు ఉంటాయి" అన్నారు.

భీమవరం పట్టణం

ఆర్థిక స్థిరత్వంతోనే జూదాలు..

గోదావరి డెల్టా ప్రాంతంలో అభివృద్ధి చెందిన కొన్ని పట్టణాల్లో భీమవరం ఒకటి. ముఖ్యంగా సముద్ర తీరానికి చేరువలో ఉండడం, గోదావరి జలాలు పుష్కలంగా అందడం భీమవరం ప్రత్యేకత.

తొలుత వ్యవసాయరంగం, దానికి అనుబంధంగా రైసుమిల్లులు భీమవరం ప్రాంతంలో అభివృద్ధి చెందాయి. కానీ, గత మూడు దశాబ్దాలుగా భీమవరం ఆక్వా హబ్ గా మారిపోయింది.

వేల ఎకరాల్లో రొయ్యలు, చేపలు సాగు చేస్తున్నారు. ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా, రాష్ట్రంలో భీమవరం ఈ రంగంలో ముందంజలో ఉంది.

ఆక్వా అనుబంధ పరిశ్రమలు, ఇతర కార్యకలాపాలతో భీమవరం ప్రస్తుతం కళకళలాడుతూ ఉంటుంది. వ్యవసాయం, ఆక్వా రంగాలతో లభించిన ఆర్థిక పరిపుష్టి వల్ల ప్రజల్లో జూదం వంటివీ ఇక్కడ కనిపిస్తాయని స్థానిక న్యాయవాది పాకా వెంకట సత్యన్నారాయణ బీబీసీతో అన్నారు.

"ఆర్థిక స్థిరత్వం సాధించిన సమాజంలో సహజంగానే ఇతర వ్యాపకాల మీద మోజు పెరుగుతుంది. అందులో కొన్ని సంప్రదాయాల ముసుగులో జూదాల వైపు మళ్లుతాయి. అంతేగాకుండా భీమవరంలో ఉన్న కుల పొందిక వల్ల కూడా కోడిపందాలకు ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది. ఒకప్పుడు చట్టపరంగా ఆంక్షలు లేనప్పుడు ఇవి బాహాటంగానే సాగేవి. కానీ, ఇప్పుడు చట్టపరమైన అభ్యంతరాలు ఎదురుకావడంతో కొందరు రహస్యంగా పోలీసుల అడ్డంకులు లేని రోజుల్లో కోడిపందాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు పౌరుషాలకు కోళ్లను బరిలో దింపితే, ఇప్పుడు పెద్ద మొత్తంలో పందాలు చేతులు మారుతున్నాయి. సరదాగా మొదలైన అవి ఇప్పుడు వందల కోట్ల వ్యవహారంగా, పెద్ద వ్యసనంగా మారింది" అన్నారు.

భీమవరం పట్టణం

గోదావరి జలాల రాకతో దశ మారింది..

భీమవరం గురించి చెప్పే చరిత్రకారులు తూర్పు చాళుక్య రాజైన భీమ పేరుతో ఇది ఏర్పడినట్లు చెబుతారు.

ప్రస్తుతం ఇది దాదాపు 1.5లక్షల జనాభాతో, స్పెషల్ క్లాస్ మునిసిపాలిటీగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలకు భీమవరం కేంద్రంగా ఉంటుందని చెప్పవచ్చు.

నిజానికి, ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణానికి పూర్వం సమీపంలోని నర్సాపురం పట్టణం బ్రిటిష్ వారి కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది.

అప్పట్లో సముద్రతీరం కావడంతో నర్సాపురానికి ప్రాధాన్యం ఉండగా, తర్వాత గోదావరి జలాలతో భీమవరం దశ మారింది. సారవంతమైన నేల, భారీ దిగుబడులతో భీమవరం వరి ఉత్పాదనలో ముందంజ వేసింది

గత కొన్ని దశాబ్దాలుగా ఆక్వారంగంలో అడుగుపెట్టిన తర్వాత భీమవరం వేగంగా అభివృద్ధి చెందింది. అయితే ఆక్వా సాగు కారణంగా పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి.

కానీ భారీగా లాభాలు వస్తుండడంతో భీమవరం పరిసరాల్లో దాదాపుగా వరి పొలాలను మించి రొయ్యల చెరువులు కనిపిస్తున్నాయి.

కోడిపందాలే ఉపాధిగా మారినవారూ ఉన్నారు..

భీమవరం ప్రాంతంలో ఏటా సంక్రాంతి సందర్భంగా కోడిపందాల నిర్వహణే వృత్తిగా మార్చుకున్న వారు కూడా కొందరున్నారు.

పందాలకు అనుగుణంగా కోళ్లను సిద్ధం చేయడం, వాటికి శిక్షణ, పందాల్లో కాళ్లకు కట్టే కత్తుల తయారీ లాంటి పనులనే ఉపాధిగా మార్చుకున్న కుటుంబాలు వందల్లో ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

కోడిపందాల నిర్వహణను చట్టవిరుద్ధమని చెబుతున్న కోర్టులు దీనిపై సీరియస్‌గా ఉన్నాయి. పోలీసులు కూడా సంక్రాంతి ముందు వరకూ కోడిపందాల నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ప్రచారం చేస్తారు. కానీ, ఆ మూడు రోజుల పాటు యథేచ్ఛగా పందేలు కొనసాగడం ప్రతి ఏటా కనిపిస్తుంది.

పోలీసుల వైఫల్యమే దీనికి కారణంమని, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోలీసులు చేతులు కట్టుకుని కూర్చుంటున్నారని, పట్టణాన్ని కోడి పందాలకు చిరునామాగా మార్చేశారని కొందరు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"కోడిపందాల నిర్వాహకులను అడ్డుకునే ప్రయత్నాలు కేవలం ప్రచారానికే పరిమితం అవుతాయి. దాంతో కోర్టుల ఆదేశాలు , ఎంతోమంది సామాన్యులను ఆవేదన ఎవరికీ పట్టడం లేదు. వాస్తవానికి భీమవరానికి సాంస్కృతికంగా ఎంతో పేరుంది. ఎంతోమంది సినీ ప్రముఖులు ఇక్కడివారే. గోదావరి వాసులు ఆతిథ్యానికి ప్రసిద్ధి. భీమవరం గ్రామ దేవత మావుళ్లమ్మ సంబరాలు కూడా సంక్రాంతి సమయంలో ఉత్సాహంగా జరుగుతాయి. అలాంటి సంక్రాంతి వేడుకలను ఇప్పుడు జూదాలతో నింపేశారు. భీమవరం పట్టణాన్ని పందెం రాయుళ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా తయారుచేశారు. దీనిని అడ్డుకోవాలి" అని అల్లూరి అరుణ్ బీబీసీతో అన్నారు.

కోడి పందాలు

కోడిపందాలపై కరోనా ప్రబావం తప్పదా..

కరోనా వల్ల ప్రస్తుతం భీమవరంలో ప్రతి ఏటా ఉండే సందడి కనిపించడం లేదని కొందరు చెబుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల బరులు సిద్ధం చేసి, పుంజులను రంగంలో దింపే పనిలో కొందరున్నారు.

కోర్టుల నిషేధాజ్ఞలు, పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ ఎప్పటిలా సాగుతాయని స్థానికులు అంటున్నారు.

అయితే కరోనా వల్ల గతంలో ఉన్నంత సందడి కనిపించకపోవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. హోటళ్లలో రిజర్వేషన్లు, ట్రాన్స్ పోర్టు బుకింగ్స్ దానికి నిదర్శనం అంటున్నారు.

"గతంలో డిసెంబర్ నెలాఖరు అన్నీ బుక్ అయిపోయేవి, ఈసారి సగం మాత్రమే రిజర్వ్ చేసుకున్నారు" అని స్టార్ ట్రావెల్స్ యజమాని రవిరాజు అంటున్నారు.

దీంతో సంక్రాంతి మూడు రోజుల పాటు సందడి ఎలా ఉంటుందనేది భీమవరం అంతటా చర్చనీయంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bhimavaram has become a hub for Sankranti celebrations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X