omicron virus : దుబాయ్ పారిపోయిన తొలి ఓమిక్రాన్ వైరస్ రోగి -అధికారుల షాక్
భారత్ లో ఇద్దరికి ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు కేంద్రం ఇవాళ ప్రకటించింది. ఆ వెంటనే వీరిలో ఒకరి నుంచి ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. ఆ లోపే మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓమిక్రాన్ వైరస్ సోకినట్లుగా నిర్దారించిన ఇద్దరిలో ఒకరు ఇప్పటికే భారత్ వదిలి దుబాయ్ వెళ్లిపోయినట్లు తేలింది. దీంతో అధికారులు షాకయ్యారు.
ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్ సోకిన భారతదేశంలోని మొదటి రెండు కేసులలో ఒకరైన 66 ఏళ్ల వ్యక్తి... నవంబర్ 20 న మన దేశంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఏడు రోజులకే మరో విమానంలో దుబాయ్‌కి వెళ్లిపోయినట్లు అధికారులు తాజాగా సేకరించిన ఆధారాల్లో తేలింది. బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ బృహత్ బెంగళూరు మహానగర పాలికే రికార్డుల ప్రకారం ఆ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి నవంబర్ 20 న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా నెగెటివ్ రిపోర్ట్ తో అడుగుపెట్టాడు. ఆ తర్వాత అతనికి రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్ వేశారు.

భారత్ లో అడుగుపెట్టగానే సదరు దక్షిణాఫ్రికా జాతీయుడు.. అదే రోజు బెంగళూరులోని ఓ హోటల్లో దిగాడు. ఆ తర్వాత వెంటనే అతనికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఓ ప్రభుత్వ వైద్యుడు అతన్ని హోటల్ కు వెళ్లి పరీక్షించగా.. అతనికి కరోనా లక్షణాలు లేవని తేలింది. అయితే పాజిటివ్ గా నిర్దారణ కావడంతో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించి వెళ్లిపోయాడు. అయితే ఆ తర్వాత అధికారులు ఓమిక్రాన్ సోకిన దేశాల్లో ఒకదాని నుంచి భారత్ కు రావడంతో కావడంతో, అతని నమూనాలను మళ్లీ సేకరించి నవంబర్ 22న జన్యు పరీక్షలకు పంపారు.
ఆ తర్వాత అతనితో కాంటాక్ట్ అయిన మొత్తం 24 మందిని పరీక్షించగా, కోవిడ్-19 నెగిటివ్ అని తేలింది. అధికారులు 240 ద్వితీయ కాంటాక్ట్ లను కూడా పరీక్షించారు. అయితే వీరంతా నెగెటివ్ గా తేలారు. ఆ తర్వాత సదరు దక్షిణాఫ్రికా జాతీయుడు విడిగా నవంబర్ 23న, ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో మరొక కోవిడ్ పరీక్ష చేయించుకున్నాడు. ఇందులో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.
దీంతో నవంబర్ 27వ తేదీ అర్ధరాత్రి హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు చేరుకుని దుబాయ్‌కి విమానం ఎక్కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతని శాంపిల్స్ పరీక్షించిన వైద్యులు.. ఓమిక్రాన్ వైరస్ పాజిటివ్ ఉన్నట్లు ఇవాళ తేల్చారు. దీంతో అధికారులు ఆయన రికార్డులు పరిశీలిస్తే అతను భారత్ వదిలి దుబాయ్ వెళ్లిపోయినట్లు తేలింది.