అసెంబ్లీ స్పీకర్‌గా మాజీ ముఖ్యమంత్రి? కేబినెట్ బెర్తుల కోసం డిమాండ్: బొటాబొటి మెజారటీతో
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొలి మెజారిటీ గట్టెక్కిన జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమికి తిప్పలు తప్పేలా లేవు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 122 కంటే కేవలం మూడు సీట్లను మాత్రమే అధికంగా గెలుచుకుంది ఆ కూటమి. ఫలితంగా- పొత్తు పార్టీల డిమాండ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల మధ్య అప్పుడే డిమాండ్ల గళం వినిపిస్తోంది ఎన్డీఏ కూటమిలో. తమకు కేబినెట్లో బెర్త్‌ను ఖాయం చేయాలని ఎన్డీఏ మిత్రపక్షాలు గళమెత్తుతున్నాయి.
స్థానిక సంస్థల పోరుపైనా కన్నేసిన ఒవైసీ: అసద్‌తో బిహార్ మజ్లిస్ ఎమ్మెల్యేలు భేటీ: రోడ్ మ్యాప్

బొటాబొటి మెజారిటీతో తిప్పలే..
అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)-115, భారతీయ జనతా పార్టీ-110, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ-11, జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-7 స్థానాలకు పోటీ చేశాయి. ఇందులో హిందుస్తాన్ ఆవామీ మోర్చా, వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ నాలుగు చొప్పున స్థానాలను గెలుచుకున్నాయి. ఈ ఎనిమిది మందీ జేడీయూకు గానీ, బీజేపీకి గానీ చెందని ఎమ్మెల్యేలు. ఒకరకంగా చెప్పాలంటే- వారి మద్దతుతోనే జేడీయూ-బీజేపీ సంకీర్ణ కూటమి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందనే అనుకోవచ్చు. ఈ ఎనిమిది మందీ ఎన్డీఏ నుంచి బయటికి వస్తే.. ఇబ్బందులు తప్పవు.

కేబినెట్ బెర్తుల కోసం మిత్రపక్షాల డిమాండ్..
అందుకే- తమకు ఉన్న ప్రాధాన్యతను గమనించడం వల్లే కేబినెట్ బెర్తుల కోసం పట్టుబడుతున్నాయి ఆ రెండు పార్టీలు. హిందుస్తానీ ఆవామ్ మోర్చా చీఫ్ జీతన్ రామ్ మాంఝీ ఇదివరకే ముఖ్యమంత్రిగా పని చేశారు. కేబినెట్లో అత్యున్నత స్థానంలో పనిచేసిన ఆయన నితీష్ కుమార్ సారథ్యంలోని మంత్రివర్గంలో కొనసాగడానికి ఇష్టపడకపోవచ్చు. అందుకే- ఆయనను అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నుకోవచ్చని అంటున్నారు. రాజకీయాల్లో సీనియర్ కావడం వల్ల మాంఝీకి స్పీకర్ పదవిలో కూర్చోబెట్టడమే సరైనదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

స్పీకర్‌గా ఛాన్స్?
మొన్నటి ఎన్నికల్లో ఆయన ఇమామ్‌గంజ్ నియోజకవర్గం నుంచి హిందుస్తానీ ఆవామ్ మోర్చా అభ్యర్థిగా గెలుపొందారు. మాజీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ సింగ్‌ను ఓడించారు. మావోయిస్టులకు గట్టిపట్టు ఉన్న ఈ నియోజవర్గం ఇది. దళిత నేతగా మాంఝీకీ మంచి గుర్తింపు ఉంది. అందుకే కేబినెట్లో నితీష్ కుమార్ కింద పనిచేయడం కంటే స్పీకర్‌గా నియమిస్తేనే బాగుంటుందని చెబుతున్నారు. ఒకరిద్దరు ఎన్డీఏ కీలక నేతలు, హిందుస్తానీ ఆవామ్ మోర్చా నాయకులు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. దీనిపై తుది నిర్ణయం ఏమిటనేది జేడీయూ-బీజేపీ అగ్ర నేతల మీదే ఆధారపడి ఉంది.

కాంగ్రెస్ టు జేడీయూ వయా ఆర్జేడీ..
తాము కేబినెట్ బెర్త్ కావాలని కోరుతామని మాంఝీ ఇదివరకే స్పష్టం చేశారు. ఇదివరకు నితీష్ కుమార్‌తో కలిసి ఉన్నామని, ఇక ముందు కూడా కలిసే ఉంటామని చెప్పారు. తమ డిమాండ్లకు ఆయన అంగీకరిస్తారనే నమ్మకం ఉందని మాంఝీ పేర్కొన్నారు. 1980లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మాంఝీ. తొలుత కాంగ్రెస్‌లో చేరారు. అక్కడి నుంచి రాష్ట్రీయ జనతా దళ్‌లో చేరారు. అక్కడా ఇమడలేకపోయారు. జేడీయూ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేశారు. నితీష్ కుమార్ కోసం తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం సొంతంగా హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీని నెలకొల్పారు.