Bihar: నక్కతోక కాదు ఏకంగా నక్కనే తొక్కేశాడు, 12 ఓట్ల తేడాతో ఎమ్మెల్యే, సీఎం ఇంటి ఫోన్ ?, సీన్ !
పాట్నా/ బీహార్/ హిల్సా: ఎవరైనా అదృష్టంతో ఊగిపోతుంటే వీడు నక్కతోక తొక్కాడు అంటుంటారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అధికార పార్టీ అభ్యర్థి ఏకంగా నక్కనే తొక్కేసి కేవలం 12 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యాడు. అంతే ఆ ఎమ్మెల్యే ఇప్పుడు కొండెక్కి కుర్చున్నాడు. అయితే ముందుగా ఆర్ జేడీ అభ్యర్థి 547 ఓట్ల మెజారిటీతో గెలిచాడని ప్రకటించిన ఎన్నికల అధికారులు సీఎం ఇంటి నుంచి ఫోన్ వచ్చిన తరువాత రాత్రి అకస్మాత్తుగా జేడీయూ అభ్యర్థి గెలిచాడని మాటమార్చి అధికార దుర్వినియోగం చేశారని ఆర్ జేడీ నేతలు ఆరోపిస్తున్నారు. జేడీయూ అభ్యర్థి 12 ఓట్ల మెజారిటీతో గెలవడం వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది.
Bihar: MGB అంటే మహాఘట్ బంధన్ కాదు 'మర్ గయా భయ్యా': మీరు ఫినిష్, కేంద్ర మంత్రి జోకులు !

జేడీయూ, ఆర్ జేడీ పోటాపోటి
బీహార్ లోని హిల్సా శాసన సభ నియోజక వర్గం నుంచి ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ జేడీయూ నుంచి కృష్ణమురారి శరణ్ అలియాస్ ప్రేమ్ ముఖియా పోటీ చేశారు. ఆర్ జేడీ పార్టీ నుంచి అత్రి ముని అలియాస్ శక్తిసింగ్ పోటీ చేశారు. హిల్సా నియోజక వర్గంలో రెండు పార్టీలకు బలమైన పట్టుఉండటంతో హోరాహోరిగా ఎన్నికల ప్రచారం జరిగింది.

సీఎం VS తేజస్వీ యాదవ్
సీఎం నితీశ్ కుమార్, ఆర్ జేడీ నేత తేజస్వీ యాదవ్ స్వయంగా హిల్సా నియోజక వర్గంలో ప్రచారం చేశారంటే అక్కడ పోటీ ఏ విధంగా ఉందో అర్థం అవుతోంది. ఎన్నికల ప్రచారం నుంచి కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు హిల్సా నియోజక వర్గ ప్రజలకు గంటగంటకు బీపీ పెరిగిపోయింది. ఎన్నికల పోలింగ్ ఫలితాలు కూడా థ్రిల్లర్ సినిమాను తలతన్నేలాగా వెలువడ్డాయి.

12 ఓట్ల విజయంతో ఎమ్మెల్యే
మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో హిల్సా శాసన సభ నియోజక వర్గం ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. జేడీయూ నుంచి పోటీ చేసిన కృష్ణమురారి శరణ్ అలియాస్ ప్రేమ్ ముఖియాకు 61, 848 ఓట్లు, ఆర్ జేడీ పార్టీ నుంచి పోటీ చేసిన అత్రి ముని అలియాస్ శక్తిసింగ్ కు 61, 836 ఓట్లు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. జేడీయూ పార్టీ అభ్యర్థి కృష్ణమురారి శరణ్ అలియాస్ ప్రేమ్ ముఖియా 12 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

సీఎం ఫోన్ తో సీన్ రివర్స్ ?
మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఆర్ జేడీ పార్టీ అభ్యర్థి శక్తిసింగ్ 547 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని, ఎమ్మెల్యేగా విజయం సాధించారని మేము ఇచ్చే దృవీకరణ ప్రతం తీసుకుని వెళ్లడానికి ఇక్కడే వేచి ఉండాలని ఆయనకు చెప్పారని ఆర్ జేడీ నాయకులు అంటున్నారు. అయితే రాత్రి సీఎం నితీశ్ కుమార్ ఇంటి నుంచి ఎన్నికల అధికారులకు ఫోన్ వచ్చిందని, తరువాత ఎన్నికల అధికారులు మాటమార్చి జేడీయూ పార్టీ అభ్యర్థి కృష్ణమురారి శరణ్ 12 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని తప్పుడు ప్రకటన చేశారని ఆరోపిస్తూ ఆర్ జేడీ నాయకులు ట్వీట్ చేశారు.

ఎన్నికల కమిషన్ క్లారిటీ
తాము ఏ పార్టీకి వత్తాసు పలకడం లేదని, ఎన్నికల పోలింగ్ దగ్గర నుంచి వాటి ఫలితాలు ప్రకటించే వరకు సిన్సియర్ గా పని చేశామని, తమ మీద లేనిపోని నిందలు వెయ్యడం మంచిదికాదని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. మొత్తం మీద 12 ఓట్ల మెజారిటీ విజయం సాధించిన కృష్ణమురారి శరణ్ పండగ చేసుకుంటున్నారు. డజను ఓట్లతో గెలవడం ఓ గెలుపేనా అని ఆర్ జేడీ నాయకులు అంటుంటే ఒక్క ఓటు ఎక్కువ అయినా గెలుపు గెలుపే అని జేడీయూ నాయకులు అంటున్నారు.