వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిహార్‌ ఎన్నికలు : కఠినమైన సవాళ్ల నడుమ ‘కమలం’ ఎలా వికసించింది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎన్నికల ప్రచారం

కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, వలస కార్మికుల ఇబ్బందులు, వీటికి తోడు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకత.. అయినా, వీటన్నింటి నడుమ బిహార్‌లో బీజేపీ మరోసారి అధికారపక్షంగా నిలబడగలిగింది.

కాకపోతే రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆ పార్టీ కోరిక మాత్రం నెరవేర లేదు.

అయితే 20 ఏళ్లుగా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తూ, సంకీర్ణంలో జూనియర్‌గా ఉంటూ వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు ఆధిపత్య స్థానంలోకి వచ్చింది. ముందే హామీ ఇచ్చినట్లు నితీశ్‌ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేసినా ప్రభుత్వంపై పట్టు మాత్రం తన చేతిలోనే పెట్టుకోగలుగుతుంది.

హిందీ బెల్ట్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌ తర్వాత రెండో పెద్ద రాష్ట్రమైన బిహార్‌ను కైవసం చేసుకోవడం బీజేపీకి మొదటి నుంచీ సవాలుగానే ఉంది.

2014 మోదీ వేవ్‌ తర్వాత జరిగిన 2015 ఎన్నికల్లో కూడా బిహార్‌లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

1990లలో మొదలైన రామ్‌ జన్మభూమి ఉద్యమం బిహార్‌లో బీజేపీకి ఏమాత్రం మేలు చేయలేదు.

అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లు ఆ పార్టీ నేతలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉన్నాయి.

ఈ విజయం బీజేపీకి అత్యంత కీలకంగా అభివర్ణించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ నీరజా చౌదరి కూడా ఈ ఫలితాలు ఆశ్చర్యపరిచాయని అన్నారు.

“ప్రజలు సమస్యల్లో ఉన్నారు. కానీ పాలక సంకీర్ణంలోని ఒక పార్టీయే దీనికి బాధ్యత వహించాలని వారు భావించారు. బిహార్ ప్రజలు తమ సమస్యలు ముఖ్యమంత్రి నితీశ్‌కు కాకుండా ప్రధానమంత్రి మోదీకి చెప్పుకోవాల్సి వచ్చినందుకు చాలా ఆగ్రహంగా ఉన్నారు" అని అన్నారామె.

ఈ ఎన్నికల్లో బీజేపీ పనితీరును అర్ధం చేసుకోవడానికి ప్రస్తుత ఎన్నికల గణాంకాలతోపాటు ఇప్పటి వరకు బిహార్‌లో సాగిన బీజేపీ ప్రస్థానాన్ని కూడా గమనించడం అవసరం.

మోదీ

కులమా? హిందుత్వమా?

1962.. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ యుగం సాగుతున్న రోజులవి. ఆ సమయంలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి జనసంఘ్‌ తొలిసారి మూడు సీట్లు గెలుచుకుంది.

1970-80లలో కాంగ్రెసేతర పార్టీల రాక మొదలైంది. జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆధ్వర్యంలోని సోషలిస్ట్‌ పార్టీ నుంచి లాలూ యాదవ్, నితీశ్‌ కుమార్‌, రామ్‌ విలాస్‌ పాసవాన్‌ అనే ముగ్గురు నాయకులు బిహార్‌ నుంచి ఉద్భవించారు.

1980లో జనసంఘ్‌ నుంచి బీజేపీగా మారిన తర్వాత ఆ పార్టీ బిహార్‌లో 21 స్థానాలను గెలుచుకుంది. కానీ అక్కడ బలమైన నాయకుడు దొరకలేదు. హిందుత్వ రాజకీయాలు, ఉన్నత కుల ఓటు బ్యాంకుపై ఆధారపడటం వల్ల బీజేపీ అక్కడ బలపడలేదు.

“ఉత్తర్‌ప్రదేశ్‌కు భిన్నంగా బిహార్‌లో కేవలం కులం మాత్రమే పని చేస్తుంది. ఈసారి కూడా ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్ తమ ర్యాలీలలో రామమందిరాన్ని ప్రస్తావించారు. కానీ ప్రభావం పరిమితం” అన్నారు బిహార్‌ రాజకీయాలను దశాబ్దాలుగా కవర్‌ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్‌ మణికాంత్ ఠాకూర్‌.

1990ల వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను పక్కకునెట్టి రాష్ట్రీయ జనతాదళ్‌ వరసగా 15 సంవత్సరాలపాటు అధికారాన్ని అనుభవించింది. ఆ సమయంలో రామ మందిరం డిమాండ్‌ దేశంలో బలంగా వినిపిస్తోంది.

కానీ బిహార్‌లో మాత్రం దాని ప్రభావం లేదు. రథయాత్ర చేస్తున్న అడ్వాణీని బిహార్‌లో లాలూ యాదవ్‌ అడ్డుకుని అరెస్టు చేయించారు.

మోదీ

సంకీర్ణ రాజకీయాలు

కూటమి లేకుండా బిహార్‌లో అధికారంలోకి రావడం కష్టమని 2000 సంవత్సరంలో బీజేపీ గుర్తించింది. ఒంటరి పోరును వదిలి సమతా పార్టీతో చేతులు కలిపింది. ఆ సమయంలో 168 స్థానాల్లో పోటీ చేసి 67 స్థానాలు గెలుచుకుంది.

అయితే ఫలితాలు వచ్చిన కొన్నాళ్లకే బిహార్‌ను రెండుగా విభజించారు. దీంతో 32మంది ఎమ్మెల్యేలు జార్ఖండ్‌కు వెళ్లిపోగా, బిహార్‌‌లో బీజేపీకి 35మంది మిగిలారు.

2003లో సమతాపార్టీ, జనతాదళ్‌ కలిసిపోయి జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ)గా మారాయి. జంగిల్‌ రాజ్‌ను అంతం చేస్తామని, సుపరిపాలన అందిస్తామన్న నినాదంతో బీజేపీ, జేడీయూలు 2005లో అధికారంలోకి వచ్చాయి.

బీజేపీ అప్పట్లో 102 సీట్లలో పోటీ చేసి 55 సీట్లు, 16శాతం ఓట్లను సాధించింది. 88 సీట్లు సాధించిన జేడీయూ నుంచి నితీశ్‌ కుమార్‌ సీఎం అయ్యారు.

2010 నాటికి బీజేపీ, జేడీయూ కూటమి మరింత బలపడింది. బీజేపీ 91 సీట్లు, జేడీయూ 115 సీట్లు గెలుచుకున్నాయి. అయితే 2014లో బీజేపీ నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు, దాన్ని వ్యతిరేకించిన నితీశ్‌ కుమార్‌ బీజేపీతో సంబంధాలు తెంచుకున్నారు.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయగా, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌లు కలిసి లౌకిక నినాదంతో బీజేపీని ఎదుర్కొన్నాయి. నితీశ్‌ కుమార్‌ మరోసారి ముఖ్యమంత్రి కాగా, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

2014 లోక్‌సభ, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయాలు సాధించిన బీజేపీ, 2015లో బిహార్‌లో 157 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఈసారి బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్‌లో టపాసులు పేలుస్తారని ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

బిహార్‌కు ప్రధాని మోదీ అతి పెద్ద ఆర్ధిక ప్యాకేజ్‌ ప్రకటించినప్పటికీ బీజేపీ బలం 91 నుంచి 53కు పడిపోయింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా, రెండేళ్ల తర్వాత మళ్లీ నితీశ్‌ కుమార్‌తో చేతులు కలిపి అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది.

ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో నితీశ్‌కుమార్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ సహకారంతో మళ్లీ సీఎం అయ్యారు. దీంతో బిహార్‌లో కూటమి కట్టటం తప్ప మరో మార్గం లేదని మరోసారి అర్ధమైంది.

2020లో ఏం జరిగింది?

2015 ఎన్నికలలో నితీశ్‌, లాలూ కూటమి వెనకబడిన కులాలు, ముస్లింలను ఏకం చేసి విజయం సాధించింది. ఇదే ఫార్ములాను ఈసారి బీజేపీ ప్రయోగించింది.

“బాగా వెనకబడిన వర్గాలను దగ్గర చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. బలహీనవర్గాలను మోదీ మాత్రమే రక్షించగలరు అన్న భావనను సృష్టించింది” అన్నారు మణికాంత్‌ ఠాకూర్‌.

ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలలో పదే పదే వెనకబడిన కులాలను ప్రస్తావించారు.

గత దశాబ్ద కాలంగా బిహార్‌లో బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతూ వస్తోంది. 2015లో తక్కువ సీట్లు వచ్చినప్పటికీ 24శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతం పరంగా బీజేపీ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అపూర్వమైన విజయాన్ని సాధించింది. బిహార్‌లోని 40 స్థానాలకు 39 స్థానాల్లో గెలిచింది.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో కలిసి పోరాడితే నష్టం ఉంటుందని బీజేపీ గ్రహించింది. అయితే కూటమిని మాత్రం విచ్ఛిన్నం చేయలేదు.

“లోక్‌ జనశక్తి పార్టీకి చెందిన చిరాగ్ పాసవాన్‌ నితీశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఉద్దేశపూర్వకంగా బీజేపీ అనుమతించింది" అన్నారు మణికాంత్‌ ఠాకూర్‌.

“తనకు అందిన ఫీడ్‌బ్యాక్‌ ప్రకారం నితీశ్ నుంచి వేరు కావడం మంచిదని బీజేపీ తెలిసినా, అతని పెద్దన్న హోదా ఇస్తూనే అతని ఇమేజ్‌పై దాడిని ప్రోత్సహించింది’’ అని వ్యాఖ్యానించారు మణికాంత్‌ ఠాకూర్‌.

తేజస్వి

'క్రౌన్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ జంగిల్‌ రాజ్‌'

ఈ ఎన్నికల్లో కూటమిని మేనేజ్‌ చేయడం ఒక ఎత్తైతే, ప్రతిపక్షం నుంచి తీవ్రమైన దాడికి దిగుతున్న తేజస్వీ యాదవ్‌ను నిలువరించడం మరో పెద్ద సవాలు. ఎందుకంటే ఆయన ఈసారి కులం, మతం వదిలేసి ప్రజా సమస్యలను ఏకరువు పెడుతూ ప్రచారం సాగించారు.

మిలియన్‌ ఉద్యోగాలంటూ తేజస్వీ యాదవ్‌ ఇచ్చిన వాగ్దానానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఉద్యోగాల కల్పనను ఎన్డీయే కూటమి కూడా తన అజెండాగా మార్చుకోవాల్సి వచ్చింది. దాంతోపాటు లాలూ యాదవ్‌ కాలంలో బిహార్‌లో 'జంగిల్ రాజ్' కొనసాగిందంటూ బీజేపీ ప్రచారం చేసింది.

ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ర్యాలీలలో పదేపదే 'జంగిల్‌రాజ్‌ యువరాజ్‌’ ప్రస్తావన చేశారు. “ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీని నితీశ్‌ కుమార్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించారు’’ అన్నారు నీరజా చౌదరి.

ఫలితం ఏదైనా ముఖ్యమంత్రి అభ్యర్ధి నితీశ్‌ కుమారేనని బీజేపీ ఎన్నికలకు ముందు స్పష్టం చేసింది. మరి ఫలితాల తర్వాత అది తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా?

“నితీశ్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి చేయకపోతే అది బీజేపీ నమ్మక ద్రోహంగా ప్రజలు అర్ధం చేసుకుంటారు. తర్వాత నితీశ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వొచ్చు. కానీ రెండోది జరుగుతుందో లేదో ఎవరు చూశారు’’ అన్నారు మణికాంత్‌ ఠాకూర్‌.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
BJP won in Bihar elections despite the Challenges the state faces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X