బీహార్ ఎన్నికలు .. ముంగేర్ కాల్పులు జలియన్ వాలాబాగ్ ఘటనలా .. గవర్నర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు
బీహార్ రాష్ట్రం ముంగేర్ జిల్లాలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పోలీసులకు ఉత్సవాల్లో పాల్గొన్న వారికి మధ్య ఘర్షణ జరగడం, కాల్పులు చోటుచేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారని తెలుస్తుంది. ప్రస్తుతం బీహార్ ఎన్నికల కొనసాగుతున్న నేపథ్యంలో ముంగేర్ ఘటన అధికార పార్టీని ఇరకాటంలో పెడుతుంది . అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరుగు తున్నాయి.
అటు కాంగ్రెస్ , ఆర్జేడీ , వామపక్ష పార్టీలు , శివసేన కూడా బీజేపీని టార్గెట్ చేస్తుంది.
బీహార్ ఎన్నికల్లో గెలిస్తే ఆ చట్టాల రద్దు, యువతకు ఉద్యోగాలు ... మహాకూటమి మ్యానిఫెస్టో విడుదల

బీహార్ గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం
తాజాగా ముంగేర్ కాల్పుల సంఘటన పై కాంగ్రెస్ పార్టీ సభ్యుడు రణదీప్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం బీహార్ గవర్నర్ ను కలిశారు. ముంగేర్ కాల్పులు సంఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను , ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముంగేర్ కాల్పుల సంఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

సీఎం , డిప్యూటీ సీఎం ల ఆదేశాలతోనే కాల్పులు .. వారికి పాలించే హక్కు లేదు
దుర్గా భక్తులపై కాల్పులు , లాఠీ ఛార్జ్ చేయడం సీఎం నితీష్ కుమార్ మరియు డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ల ఆదేశానుసారంగానే జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. వారు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. ముంగేర్ లో దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసిన అమాయక ప్రజలపై పోలీసులు దాడి చేసిన తీరు జలియన్ వాలా బాగ్ ఘటన ను గుర్తు చేసిందని ఆయన అన్నారు.

బ్రిటీష్ పాలనలా ఉందన్న రణదీప్ సింగ్ సుర్జేవాలా
జనరల్ డయ్యర్ నేతృత్వంలోని బ్రిటిష్ పాలనలో పోలీసులు ప్రభుత్వం కూడా ఇలాగే ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా ప్రధాని మూగ ప్రేక్షకుడిలాగా ఉన్నారని, ఆయన తన మౌనాన్ని భగ్నం చేసి ఈ ఘటనపై మాట్లాడాలని రణదీప్ సింగ్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. ఇదే సంఘటన ఎన్డీఏ పాలిత రాష్ట్రం కాకుండా వేరే చోటు చోటు చేసుకుంటే బిజెపి నేతలు ఇలాగే మౌనంగా ఉంటారా అంటూ విమర్శల వర్షం కురిపించారు.

బీహార్ ఎన్నికల్లో పేలుతున్న మాటల తూటాలు
బీహార్లో ఎన్నికలు మొదటి దశ పోలింగ్ ముగిసింది రెండో దశ పోలింగ్ నవంబర్ మూడవ తేదీన జరగనుండగా చివరి దశ పోలింగ్ నవంబరు 7వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో బీహార్లో రసవత్తర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.మహాకూటమి నేతలు ఎలాగైనా ఈసారి ఎన్డీయే ను గద్దె దింపాలని కృత నిశ్చయంతో ఉన్నారు .