వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిహార్ ఎన్నికలు: ముస్లింలు లాలూను కాదని అసదుద్దీన్ ఒవైసీతో చేతులు కలుపుతారా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

బిహార్‌లో ముస్లింల జనాభా 16.87 శాతం. బిహార్ ఎన్నికల్లో వీరి ఓట్లకు ప్రత్యేక స్థానముంది.

అయితే, రాష్ట్రంలో ముస్లింలంతా ఒకేచోట లేరు. కానీ, కొన్నిచోట్ల వీరి ఓట్లే అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయిస్తాయి.

owaisi

భారత్‌లో జరిగే ఎన్నికల్లో కులాలు, మతాల పేరుతో పార్టీలు ఓట్లను రాబట్టుకుంటాయి. ఎన్నికల అస్త్రాల్లో కులాలు, మతాలు కూడా ఇక్కడ భాగమే.

అతివాద బీజేపీకి ముస్లింలు మొదట్నుంచీ వ్యతిరేకమేనని చెబుతుంటారు. వీరు తమ భద్రత, ప్రాతినిధ్యాలను దృష్టిలో పెట్టుకొని ఏదోఒక పార్టీకి ఓటువేస్తుంటారు.

ప్రస్తుతం జరుగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం కూడా బరిలోకి దిగుతోంది.

ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ జనతా దళ్(డెమోక్రటిక్), సుహేల్‌దేవ్‌కి చెందిన భారతీయ సమాజ్ పార్టీ, జనతా పార్టీ (సమాజ్‌వాదీ)లతో ఒవైసీ సెక్యులర్ మహాకూటమిని ఏర్పాటుచేశారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉపేంద్ర కుశ్వాహాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ కూటమి తెరపైకి తీసుకొచ్చింది.

ఇదివరకటి మోదీ ప్రభుత్వంలో కుశ్వాహా కేంద్ర మంత్రి. అంతేకాదు ఆయన ఇదివరకు బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు.

కుశ్వాహానే ఎందుకు?

మోదీ ప్రభుత్వంలో పనిచేసిన కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించారు? ఆయన సెక్యులర్ ఎలా అవుతారు? అని వస్తున్న ప్రశ్నలపై ఒవైసీ స్పందించారు.

''కుశ్వాహానే మా ముఖ్యమంత్రి అభ్యర్థని కూటమి నిర్ణయించింది. ఇక సెక్యులర్ విషయానికి వస్తే.. నిన్న మొన్నటివరకూ ఆయన ఆర్జేడీలో ఉన్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

''ఆయన ఆర్జేడీ తరఫు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసినప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నం కాలేదు. ఇప్పుడు మాత్రం అడుగుతున్నారు. ఆయన ఆర్జేడీలో ఉన్నప్పుడు పాలాభిషేకం చేసి.. మాతో చేతులు కలిపిన వెంటనే సెక్యులర్ ప్రశ్నలు అడుగుతున్నారు. మా సెక్యులరిజం ఎలాంటిదో మేమే నిర్ణయించుకుంటాం. ఆయనే మా ముఖ్యమంత్రి అభ్యర్థి’’

బిహార్‌లో యాదవులు 14 శాతం మంది ఉంటారు. కూర్మీలు 4 శాతం. లాలూ, ఆయన కుటుంబం కలిసి బిహార్‌ను 15ఏళ్లు పాలించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జేడీయూకు చెందిన నీతీశ్ కుమార్. ఆయన కూడా 15ఏళ్లు పాలించారు. ఆయన కూర్మీ కులానికి చెందినవారు.

14, నాలుగు శాతాలకు ప్రాతినిధ్యం వహించే నాయకులు బిహార్‌ను 30ఏళ్లు పాలించారు. అంతకుముందు ఉన్నత కులాలు ఇక్కడ రాజకీయాలను నడిపించాయి. ఇలాంటి సమయంలో 17 శాతంగా ఉన్న ముస్లింలు ఎందుకు సొంతంగా అభ్యర్థిని నిలపడం లేదు. 6 శాతం వర్గాలకు ప్రాతినిధ్యం వహించే కుశ్వాహాను ఎందుకు ముందుకు తీసుకువచ్చారు?

ఈ ప్రశ్నలపై ఒవైసీ స్పందిస్తూ.. ''ఆ రోజు కూడా వస్తుంది. మేం సొంతంగా అభ్యర్థిని నిలబెడతాం. అయితే నేడు ఇక్కడ నాయకత్వ లేమి కనిపిస్తోంది. మా పార్టీ నాయకులు గెలిస్తే.. మాకు ఒక వేదిక దొరుకుతుంది. అక్కడి నుంచే మా యాత్ర మొదలవుతుంది. ఇప్పుడు మేం అదే చేస్తున్నాం. క్షేత్రస్థాయి నుంచి నాయకుల కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాం. అందుకే కుశ్వాహాకు ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఇచ్చాం’’

యాదవులు, ముస్లింలు కలిసి...

కుశ్వాహాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒవైసీ ఎందుకు ఒప్పుకున్నారు? ఆయన వ్యూహం ఏమిటి? ఈ అంశాలపై ప్రభాత్ ఖబర్ పత్రిక ఎడిటర్ అజయ్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.

''మొదట ముస్లింలు, యాదవుల మధ్య బంధాన్ని విడదీయాలని వారు భావిస్తున్నారు. ఇలా చేయకపోతే మూడో పార్టీకి ఇక్కడ చోటు దొరకదు. అప్పుడు లాలూ రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ ఆయన ఖాతాలోకే వెళ్తాయి’’

''బీజేపీకి వ్యతిరేకంగా లాలూ చేసే రాజకీయాలకు ఎవరూ ఎదురు నిలవలేరు. ఒవైసీకి కూడా ఆ విషయం తెలుసు. ముస్లింలు, యాదవుల మధ్య చీలిక తేకపోతే తమకు ప్రాతినిధ్యం కూడా దొరకదని ఆయన కూడా భావిస్తున్నారు. అయితే, బిహార్ ముస్లింలు.. ఒవైసీ వెంట నిలబడతారా? ఇదే అసలైన ప్రశ్న. ఎందుకంటే ఇదివరకటి ముస్లిం లీగ్ రాజకీయాలను ఇక్కడి ముస్లింలు తిరస్కరించారు. అందుకే ఒవైసీ రాజకీయాలను ఇక్కడి ముస్లింలు ఆదరించే అవకాశం చాలా తక్కువ’’

బిహార్‌లో రాజకీయాలు రెండు ప్రధాన వర్గాలుగా చీలిపోయాయి. వీటిలో మొదటిది లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ. రెండోది నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్‌డీఏ. నీతీశ్ లేకుండా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం చాలా కష్టం. 2015లో లాలూతో నీతీశ్ చేతులు కలిపినప్పుడు.. బీజేపీ సంకీర్ణానికి 243 స్థానాల్లో కేవలం 58 సీట్లు మాత్రమే వచ్చాయి.

మరోవైపు ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి 178 సీట్లు దక్కించుకున్నాయి. వీరి ఓటింగ్ శాతం 41.9 వరకూ ఉంది. బీజేపీ సంకీర్ణం మాత్రం 34.1 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించిన ఏడాదిలోపే ఆ ఫలితాలు వచ్చాయి.

ఆ సమయంలో మోదీకి విశేషమైన ప్రజాదరణ కూడా ఉండేది. నీతీశ్ కుమార్ లేకపోతే తమ విజయ అవకాశాలకు గండి పడుతుందని అప్పుడు బీజేపీకి స్పష్టంగా అర్థమైంది.

ఒవైసీకి చోటు దొరుకుతుందా?

బిహార్ రాజకీయాల్లో ఒవైసీకి చోటు లభిస్తుందా? ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు ఫైజాన్ అహ్మద్ మాట్లాడారు. ''మతం పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను ఒవైసీ కూడగట్టలేరు. సెక్యులర్ ఓట్లు కూడా వారికి పడవు. ఎందుకంటే వారిది సెక్యులర్ కూటమి కూడా కాదు’’.

''ముస్లిం యువతలో ఒవైసీపై సానుకూలత ఉన్న మాట వాస్తవమే. కానీ ఒవైసీని వారు ఒక ముస్లింలా మాత్రమే చూస్తారు. సెక్యులర్ నాయకుడిలా కాదు. కుశ్వాహాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం వల్ల వారికి పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. ముస్లిం, యాదవుల సమీకరణాలు అంత బలహీనంగా లేవు. ఒవైసీ వాటిపై ప్రభావం చూపలేకపోవచ్చు’’.

ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే జిల్లాలపై ఒవైసీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అందుకే ఆయన సీమాంచల్‌పై ఎక్కువ దృష్టిపెడుతున్నారు.

మరోవైపు గత ఏడాది అక్టోబరులో జరిగిన కిషణ్‌గంజ్ ఉప ఎన్నికలో ఒవైసీ పార్టీ గెలవడానికి సురాజ్‌పురి ముస్లింల జనాభా అక్కడ ఎక్కువగా ఉండటమే కారణం.

ఒవైసీ పార్టీ బిహార్ ప్రదేశ్ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ కూడా ఈ వర్గానికి చెందినవారే. కిషణ్‌గంజ్‌లో వీరి జనాభా 45 శాతం వరకూ ఉంటుంది. అయితే ఈ విశ్లేషణలను ఒవైసీ ఖండించారు. అన్ని వర్గాల ముస్లింలు తమ వెంటే ఉన్నారని ఆయన చెబుతున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం కిషణ్‌గంజ్‌లో ముస్లింల వాటా 67.98 శాతం, పూర్ణియాలో 38.46, కథియార్‌లో 44.47, అరారియాలో 42.95 శాతం ముస్లింలున్నారు. ఒవైసీ దృష్టి ప్రస్తుతం ఈ జిల్లాలపైనే ఎక్కువ ఉంది.

అయితే, సీమాంచల్ వెలుపలి నియోజకవర్గాలపైనా దృష్టి పెడుతున్నట్లు ఒవైసీ చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం ఈ ప్రాంతంపైనే ఉంది.

బిహారీ ముస్లింలు..

బిహారీ ముస్లింలలో లాలూకు ఉండే ప్రాధాన్యం ఒవైసీకి ఉంటుందా? ''ఒవైసీ అభ్యర్థి ఉప ఎన్నికలో గెలిచినప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. ఇక్కడ మైనారిటీ ఓట్లన్నీ.. బీజేపీ వ్యతిరేక ఓట్ల పేరుతో ఒకరికే పడతాయి. గెలుపులో ఇవికీలకంగా మారతాయి. అలాంటప్పుడు ఒవైసీకి వారు ఎలా ఓట్లు వేస్తారు?’’అని ఎన్‌ఎన్ సిన్హా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ మాజీ డైరెక్టర్ డీఎం దివాకర్ వ్యాఖ్యానించారు.

''ఎన్‌డీఏ లేదా లాలూ కూటమిలో సీట్లు దక్కలేనివారు ఒవైసీ కూటమిలో చేరతారు. దేవేంద్ర యాదవ్ ఇప్పటికీ సమాజ్ వాదీ పార్టీలోనే ఉన్నారు. కుశ్వాహా మినహా చాలా మంది ఆ వర్గం నాయకులు ఎన్‌డీఏలోనే ఉన్నారు. యాదవ్ అంటే అందరికీ లాలూ ప్రసాద్ యాదవే. ముస్లింలు కూడా లాలూ తప్పితే మరే నాయకుణ్నీ తమ నాయకుడిగా ఊహించుకోరు. ఎందుకంటే బాబ్రీ మసీదు, సీఏఏ బిల్లులపై నీతీశ్ కుమార్ వారిపైపు మాట్లాడలేదు. ఉత్తర భారత దేశంలో బీజేపీ వ్యతిరేక నాయకుల్లో ఇప్పటికీ లాలూను మించిన నాయకుడు లేరు’’.

''ప్రస్తుతం ఒవైసీ పార్టీ తరఫున బరిలోకి దిగి, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా గెలిచిన తర్వాత ఎటు వెళ్తారో చెప్పలేం’’.

మరోవైపు సెక్యులర్ కూటమిలోని కుశ్వాహా, ముఖేశ్ షైనీల విషయానికి వస్తే.. వీరిలో ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండదని ఒక ఆర్జేడీ నాయకుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, వామపక్షాలు, తమ పార్టీ మధ్య బీజేపీ చీలిక తీసుకురాలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఎన్నికల ముందు కంటే, ఎన్నికల తర్వాత కూటమికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.

గతేడాది నవంబరులో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒవైసీ పార్టీ ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. 14 చోట్ల ఒవైసీ తమ అభ్యర్థులను నిలిపారు. అయితే దుమ్రి అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా తమకు 24,132 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ గెలిచింది బీజేపీ కాదు. జేఎంఎంకు చెందిన జగన్నాథ్ మహతో విజయం సాధించారు.

ఒవైసీ పార్టీ వల్ల జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థి ఓడిపోయిన స్థానం ఇక్కడ ఒకటి కూడా లేదు. జార్ఖండ్‌లోనూ ముస్లింలు 15 శాతం వరకూ ఉంటారు. అయితే, వీరిని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల నుంచి వేరు చేయడంలో ఒవైసీ విఫలం అయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Will Muslims leave Lalu and join hands with Asaduddin Owaisi in Bihar elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X