నితీశ్ కుమార్ అనే నేను.. ఏడోసారి బీహార్ సీఎంగా ప్రమాణం -ఆమెకు జాక్పాట్ -ఇదీ ఎన్డీఏ కేబినెట్
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఏడోసారి ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం రాజ్ భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, కేబినెట్ మంత్రులతో ప్రమాణాలు చేయించారు. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ ఎలక్షన్ ఇంచార్జి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఎన్డీఏ అక్రమంగా గెలిచిందని ఆరోపిస్తోన్న ఆర్జేడీ.. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించింది.
ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేకు జాక్ పాట్..
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 12 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణాలు చేయించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ మహిళానేత రేణుదేవికి ఏకంగా డిప్యూటీ సీఎం పోస్టు దక్కడం గమనార్హం. ఈబీసీ వర్గానికి చెందిన రేణుతోపాటు వైశ్య వర్గానికి చెందిన తార్ కిషోర్ ప్రసాద్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. తార్ కిషోర్ ఇప్పటికే బీజేపీ శాసనసభాపక్ష నేతగా, రేణు ఉప నేతగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
త్వరలో కేబినెట్ విస్తరణ..
బీహార్ కేబినెట్ కు సంబంధించి మొత్తం 30 మంత్రిపదవులకు అవకాశం ఉన్నప్పటికీ.. ముందుగా సీఎం కాకుండా 14 మందికి మాత్రమే అవకాశం కల్పించడం గమనార్హం. ఎన్డీఏలో జూనియర్ భాగస్వామిగా దిగజారిన జేడీయూకు సీఎం పోస్టును కట్టబెట్టిన బీజేపీ.. రెండు డిప్యూటీ సీఎం, స్పీకర్ పోస్టులతను తనవద్దే అట్టిపెట్టుకుంది. కొత్తమంత్రివర్గంలో బీజేపీకి ఏడు బెర్తులు, హెచ్ఏఎమ్, వీఐపీ పార్టీలకు తలో మంత్రి పదవులు, జేడీయూకు ఐదు బెర్తులు దక్కాయి. మిగతా బెర్తులకు సంబంధించి వారం పదిరోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి.సోమవారం ప్రమాణం చేసిన కేబినెట్ మంత్రుల వివరాలివి..
ప్రస్తుతానికి ఇదే నితీశ్ టీమ్..
1. నితీష్ కుమార్ - ముఖ్యమంత్రి (జేడీయూ)
2. తార్కిషోర్ ప్రసాద్ - ఉప ముఖ్యమంత్రి (బీజేపీ)
3. రేణు దేవి - ఉప ముఖ్యమంత్రి (బీజేపీ)
4. విజయ్ చౌదరి -జేడీయూ
5. అశోక్ చౌదరి -జేడీయూ
6.విజేంద్ర యాదవ్ -జేడీయూ
7. షీలా కుమారి -జేడీయూ
8.మేవాలాల్ చౌదరి -జేడీయూ
9. ముఖేశ్ సాహ్ని -వీఐపీ
10.సంతోష్ సుమన్ -హెచ్ఏఎం
11. అమరేంద్ర ప్రతాప్ -బీజేపీ
12.మంగళ్ పాండే -బీజేపీ
13. జీవేశ్ మిశ్రా -బీజేపీ
14. రాంప్రీత్ పాశ్వాన్ -బీజేపీ
15. రామ్ సూరత్ రాయ్ -బీజేపీ