• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిహార్: ‘‘మా అమ్మాయిని రాక్షసుల చేతిలో పెట్టేశాం. గర్భంతో ఉందని చూడకుండా ఆమెను ముక్కలు ముక్కలుగా కోశారు’’ - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

By BBC News తెలుగు
|

నలందాలోని హిల్సా డీఎస్పీ కార్యాలయంలో కూర్చుని ఉన్న మంజు దేవికి కన్నీళ్లు ఆగట్లేదు. ఆమె కుటుంబ సభ్యులు సుమారు మూడు గంటల పాటు పోలీసులతో మాట్లాడారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

మంజు దేవి కూతురు, గర్భవతిగా ఉన్న కాజల్‌ను ఆమె అత్తింటివారు కట్నం కోసం హత్య చేశారని, చంపిన తరువాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి, దహనం చేసి పూడ్చిపెట్టే ప్రయత్నం చేశారని మంజు దేవి కుటుంబం ఆరోపిస్తోంది.

bihar

కన్న కూతురి మృతదేహం అత్యంత దారుణమైన పరిస్థితిలో సమీపంలో ఉన్న పొలంలో దొరికిందని, ముక్కలు ముక్కలుగా పడి ఉన్న మృతదేహాన్ని సంచిలో పెట్టి తీసుకురావలసి వచ్చిందని వారు తెలిపారు.

జులై 20న కాజల్ హత్య కేసు నమోదైంది. కానీ, ఇంతవరకూ పోలీసులు నిందితులను పట్టుకోలేదు.

అసలేం జరిగింది?

పట్నాలోని భక్తియార్‌పూర్ బ్లాక్‌లో బిహ్తా గ్రామానికి చెందిన కాజల్‌కు, నలందా జిల్లా హిల్సాలోని నోనియా బిఘా గ్రామానికి చెందిన సంజీత్ కుమార్‌తో కిందటి ఏడాది వివాహం జరిగింది.

సంజీత్ రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగి. బెంగళూరులో పనిచేస్తున్నారు.

వివాహ సమయంలో కట్నం కింద 12 లక్షల రూపాయలు, నగలు, ఒక మోటారుసైకిల్ ఇచ్చామని కాజల్ కుటుంబం తెలిపింది.

ఏడాది తరువాత, గ్రూప్ డీ ఉద్యోగి అయిన సంజీత్‌కు ప్రమోషన్ వచ్చి టీటీఈ కావడంతో, దాన్ని సాకుగా చూపిస్తూ మరింత కట్నం గుంజాలని చూశారని కాజల్ కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో రాశారు.

అదనంగా ఆరు లక్షలు కట్నం కింద ఇవ్వాలని అబ్బాయి కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారని, కాజల్‌ను తిడుతూ, కొడుతూ చిత్రహింసలు పెట్టేవారని, అత్తింటి వేధింపుల గురించి తమ బిడ్డ తమకు ముందే చెప్పిందని తెలిపారు.

జులై 17న చివరిసారిగా తన కూతురితో ఫోన్‌లో మాట్లాడాడని మంజు దేవి చెప్పారు.

"ఫోన్‌లో మాట్లాడుతూ నాకు చాలా భయంగా ఉందని మా అమ్మాయి చెప్పింది. ఆరోజు తొమ్మిది గంటల తరువాత మా అమ్మాయి మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తరువాత తనతో మాట్లాడనేలేదు. మిగతా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మా అమ్మాయితో మాట్లాడించమని అడిగాం. కానీ, ఎవరూ సహకరించలేదు. అంతకుముందు కూడా వాళ్లెప్పుడూ మా అమ్మాయిని మా ఇంటికి పంపించేవారుకాదు. కాజల్ వాళ్ల నాన్న, అన్న వెళ్లి మా అమ్మాయిని తమతో పంపించమని అడిగినా ఫలితం లేకపోయింది" అని మంజు దేవి చెప్పారు.

మృతదేహాన్ని సంచిలో పెట్టి తీసుకొచ్చారు

జులై 17 తరువాత కాజల్‌ వివరాలు ఏమీ తెలియకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె గురించి వెతకడం ప్రారంభించారు. చుట్టుపక్కల పొలాల్లో వెతకమని కొందరు గ్రామస్థులు సూచించారు.

రోడ్డుకు 500 మీటర్లు లోపలికి ఉన్న పొలాల్లో కాజల్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఒక మృతదేహం ముక్కలు ముక్కలుగా దొరికింది.

అది కాజల్ శవమని గుర్తించారు. ఆ ముక్కలను ఒక సంచిలో వేసి తీసుకొచ్చారు.

"ఇంకెలా తీసుకురావాలి! జులై 17న అదృశ్యమైన మా అమ్మాయి నాలుగు రోజుల తరువాత శవమై కనిపించింది. మా అమ్మాయిని కాల్చి తగలబెట్టారు. చేతులు, కాళ్లు నరికేసి ముక్కలు ముక్కలుగా విసిరేశారు. అన్నీ ఏరుకుని సంచిలో వేసి తెచ్చాం. పోలీసులు అక్కడే ఉన్నారు. కానీ వారు శవాన్ని తాకలేదు. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ, ఏం చేస్తాం!" అని కాజల్ తండ్రి అరవింద్ కుమార్ అన్నారు.

మృతదేహం దొరకడానికి ఒకరోజు ముందు వరకూ కూడా నిందితులు ఆ గ్రామంలోనే ఉన్నారని ఆయన చెప్పారు.

శవం ముక్కలుగా దొరికిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే తగులబెట్టిన కర్రలు, గడ్డి కనిపించాయని, అక్కడ చెట్ల ఆకులు కూడా కాలిపోయి ఉన్నాయని చెప్పారు.

అక్కడే పొలాల్లో పనిచేస్తున్న ఒక మహిళ తమ బిడ్డ మృతదేహన్ని చూసినట్లు చెప్పారని కాజల్ కుటుంబ సభ్యులు తెలిపారు.

హత్య కేసు నమోదు చేశారు

జులై 20న పోలీసులు ఈ హత్య కేసు నమోదు చేశారు. శవ పరీక్ష, డీఎన్ఏ పరీక్షల కోసం మృతదేహం భాగాలను పట్నా పంపారు. ఆ నివేదిక కోసం కాజల్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.

జూలై 23న కాజల్ మృతదేహాన్ని పోలీసులు ఆమె కుటుంబానికి తిరిగి అప్పగించారు. పట్నాలో గంగానది ఒడ్డున ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఇది హత్యా లేక ఆత్మహత్య చేసుకున్న తరువాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి కాల్చేశారా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు చెబుతున్నారు.

"సెక్షన్ 304బీ కింద కేసు నమోదు చేశాం. బాగా హింసకు గురి కావడంతో ఆమె మృతి చెందారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనేది ఇంకా నిర్ధారించవలసి ఉంది. ఏడుగురిపై కేసు పెట్టాం. ఆ అబ్బాయి, తన సోదరుడు, అక్కాచెల్లెళ్లు, వాళ్ల భర్తలపై కేసులు పెట్టాం" అని హిల్సా డీఎస్పీ కృష్ణ మురారి ప్రసాద్ తెలిపారు.

ఈ వార్త రాసిన సమయం వరకూ ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

నిందితుల వివరాలు

మృతదేహం లభించిన ప్రదేశానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే నిందితుల ఇల్లు ఉంది. అక్కడ రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు ఉన్నాయి. అది బాగా జనం ఎక్కువగా ఉండే ప్రదేశం. అయితే, ఈ సంఘటన గురించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని ఇరుగు పొరుగు చెబుతున్నారు.

ఆ ఇంటితో తమకు పెద్దగా సంబంధాలు లేవని ఇరుగుపొరుగు మహిళలు కొందరు చెప్పారు.

అంతకుముందు ఆ ఇంటి నుంచి పెద్ద శబ్దాలు రావడంగానీ, గొడవలు జరుగుతున్నట్లుగానీ తాము గమనించలేదని చెప్పారు.

నిందితుడి కుటుంబ సభ్యులంతా పరారీలో ఉన్నారు. ఆ విషయం కూడా తమకు తెలీదని చుట్టుపక్కలవాళ్లు చెప్పారు.

న్యాయం కోసం నిరీక్షణ, జీవితకాలపు వేదన

త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. తమకు న్యాయం జరుగుతుందని కాజల్ కుటుంబ సభ్యులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

తమ కుమార్తెను ముందే ఇంటికి తీసుకొచ్చి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని వారు విలపిస్తున్నారు.

"మా అమ్మాయిని రాక్షసుల చేతిలో పెట్టాం. మా అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు మళ్లీ వెనక్కు పంపించాలని అనుకోలేదు. కాన్పు అయిన తరువాతే పంపించాలని అనుకున్నాం. కానీ, వాళ్లు రమ్మని పిలిచారు. పంపించకపోతే వాళ్లకు కోపం వస్తుందని పంపించేశాం. పున్నమి నాడు మళ్లీ తీసుకొద్దామని అనుకున్నాం. ఇంతలోనే ఇలా జరిగింది" అని కాజల్ తండ్రి దుఃఖంతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
We put our girl in the hands of demons. She was cut to pieces without being seen to be pregnant
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X