వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అణు యుద్ధం ముంగిట్లో ప్రపంచం, ఉత్తరకొరియాకు ఆ పరిజ్ఞానం ఎక్కడిది? ఈ పాపం.. పాకిస్తాన్ దా?

ఉత్తరకొరియా పదే పదే రెచ్చిపోతోంది. ఇప్పటికే అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబును పరీక్షించినట్లు వెల్లడించిన ఆ దేశం మరోమారు క్షిపణి పరీక్షలకు సిద్హమవుతోందంటూ దక్షిణ కొరియా గగ్గోలు పెడుతోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరకొరియా పదే పదే రెచ్చిపోతోంది. ఇప్పటికే అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబును పరీక్షించినట్లు వెల్లడించిన ఆ దేశం మరోమారు క్షిపణి పరీక్షలకు సిద్హమవుతోందంటూ దక్షిణ కొరియా గగ్గోలు పెడుతోంది.

ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఒక్కటే. ఆర్థికంగా, సాంకేతికంగా ముందున్న దేశాలకూ ఒక పట్టాన కొరుకుడుపడని అణు పరిజ్ఞానం.. అంతర్జాతీయ ఆంక్షలు, పేదరికం, ఆకలి కేకలు, నిరక్షరాస్యత, సాంకేతిక పరిజ్ఞానం కొరత వంటి రుగ్మతలతో పూర్తిగా కుదేలైన ఉత్తర కొరియా ఎలా హస్తగతం చేసుకుంది?

దీనికి జవాబు.. పాకిస్తాన్. అవును, భారత్ పై ఉన్న భయంతో తాను క్షిపణి పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలన్న తలంపుతో పాకిస్తాన్.. ఉత్తరకొరియాతో రహస్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఉత్తర కొరియాకు అవసరమైన అణు పరిజ్ఞానాన్ని సమకూర్చిపెట్టింది. ఇప్పడు ఉత్తర కొరియా ప్రపంచానికే ఒక సవాలుగా మారిందంటే, ఆ పాపం.. అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిన పాకిస్తాన్‌దే.

అసలు ఆరంభం ఇలా...

అసలు ఆరంభం ఇలా...

ఉత్తర కొరియా అణ్వస్త్ర సాధన ప్రయత్నాలు 1950ల చివర్లో.. 1960ల మొదట్లోనే ఆరంభమయ్యాయి. శాంతియుత అణుపరిజ్ఞాన వినియోగం కోసం ఉత్తర కొరియాలోని యాంగ్‌బ్యాన్‌-కున్‌లో తొలి ప్లుటోనియం రియాక్టర్‌ను ఏర్పాటు చేసేందుకు నాటి సోవియెట్‌ యూనియన్‌ అంగీకరించింది. ఆ తర్వాత ఉత్తర కొరియా మరిన్ని రియాక్టర్లను ఏర్పాటు చేసుకుంది. అధునాతన పరిజ్ఞానం కోసం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై సంతకం కూడా పెట్టింది. తన దేశంలోని అణు కేంద్రాలను అంతర్జాతీయ అణు ఇంధన సంఘం (ఐఏఈఏ) తనిఖీల కోసం తెరిచింది.

అసలు లక్ష్యం మాత్రం...

అసలు లక్ష్యం మాత్రం...

పైకి ఇన్ని చేసినా.. అంతర్గతంగా మాత్రం అణు బాంబు సముపార్జనే ఆ దేశ లక్ష్యంగా ఉంది. 1993లో ఇది బట్టబయలైంది. కనీసం మూడుసార్లు (1989, 1990, 1991లో) అణు ఇంధనాన్ని పునఃశుద్ధి చేసిందని అంతర్జాతీయ అణు ఇంధన సంఘం తనిఖీ బృందం పేర్కొంది. ఇలా రీప్రాసెస్‌ చేసిన ఇంధనం అణ్వస్త్రాల్లో వినియోగించడానికి పనికొస్తుంది. అయితే ఉత్తరకొరియా ఇలా అణు ఇంధనాన్ని రీప్రాసెస్‌ చేసినప్పటికీ.. అణు బాంబు సముపార్జనకు మాత్రం ఇంకా అల్లంత దూరానే ఉండిపోయింది.

ఉత్తరకొరియా బాంబును.. పాకిస్తాన్ లో...

ఉత్తరకొరియా బాంబును.. పాకిస్తాన్ లో...

1998లో పాకిస్తాన్ తొలిసారి అణు పరీక్షలు నిర్వహించింది. దీంతో అమెరికా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఒక నిఘా విమానం పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహించిన స్థలంపై చక్కర్లు కొట్టి అక్కడి వాయు నమూనాలను రహస్యంగా సేకరించింది. అమెరికాలోని లాస్‌ అలామోస్‌లో ఉన్న అణు ప్రయోగశాలలో దీన్ని ఈ వాయు నమూనాలను విశ్లేషించగా.. ప్లుటోనియం ఇంధనంతో ఈ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడైంది. నిజానికి పాక్‌ ‘అణు పితామహుడు' ఏక్యూ ఖాన్‌.. 1975లో యూరోప్ నుంచి సెంట్రిఫ్యూగల్‌ పరిజ్ఞానాన్ని దొంగిలించి, తన స్వదేశానికి చేరవేశాక పాకిస్తాన్ తన ప్లుటోనియం అణు కార్యక్రమానికి మంగళం పలికింది. మరి 23 సంవత్సరాల క్రితమే అణ్వస్త్ర పరీక్షలకు స్వస్తి పలికిన పాకిస్తాన్ ఉన్నట్లుండి 1998లో ప్లుటోనియం బాంబును ఎందుకు పేల్చిందన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే పాకిస్తాన్ పేల్చింది ఉత్తర కొరియా బాంబు అని, ఉత్తరకొరియా తరఫున పాక్‌ ఈ పరీక్ష నిర్వహించి ఉండొచ్చని అమెరికా నిఘా సంస్థ (సీఐఏ) అప్పట్లోనే చెప్పింది.

అటు, ఇటు లాభపడింది చైనాయే...

అటు, ఇటు లాభపడింది చైనాయే...

మొత్తానికి ఈ వ్యవహారంలో చైనా బాగా లాభపడింది. ఎందుకంటే, ఉత్తర కొరియా, పాక్‌లకు స్ఫూర్తిదాతగా, ప్రధాన మద్దతుదారుగా ఉన్న చైనా.. 1990ల మొదట్లో.. తన ఎం-11 క్షిపణులను పాక్‌కు అందించడానికి నిరాకరించింది. అమెరికాతో సత్సంబంధాలు పెంచుకునే ఉద్దేశంతో అప్పట్లో ఆ నిర్ణయం తీసుకుంది. అయితే పరస్పర అవసరాలు తీర్చుకోకుండా ఉత్తర కొరియాను కానీ పాక్‌ను కానీ చైనా అడ్డుకోలేదు. దీంతో తప్పనిసరై.. పాక్‌కు క్షిపణి పరిజ్ఞానం, ఉత్తర కొరియా అణు సాంకేతికత అందేలా లోపాయికారీగా ‘డ్రాగన్‌' దోహదపడింది. నిజానికి లోగడ పాక్‌కు అణ్వస్త్ర డిజైన్‌ను అందించింది కూడా చైనాయే. ఈ పరస్పర లబ్ధి ద్వారా ఇటు ఉత్తర కొరియా తన బద్ధశత్రువైన అమెరికాను.. అటు పాకిస్తాన్ తన బద్ధశత్రువైన భారత్‌ ను లక్ష్యంగా చేసుకున్నాయి.

గుట్టు లాగిన జర్నలిస్టులు...

గుట్టు లాగిన జర్నలిస్టులు...

తర్వాతి కాలంలో.. పాశ్చాత్య దేశాల రహస్య పత్రాలు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఆడ్రియాన్‌ లెవీ, కేథరీన్‌ స్కాట్‌-క్లార్క్‌లు సాగించిన పరిశోధనలు నివ్వెరపరచే నిజాలను వెలుగులోకి తెచ్చాయి. 1980ల చివరి నుంచి ఉత్తర కొరియా, పాక్‌ల మధ్య అణు, క్షిపణి పరిజ్ఞాన రంగాల్లో బంధం కొనసాగుతోందని వెల్లడైంది. 2006లో ఆడ్రియాన్‌, కేథరీన్‌లు.. పాక్‌ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టోను దుబాయ్‌లో ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఆమె కొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించారు. వీటి ఆధారంగా తెరవెనుక లోగుట్టును సదరు పాత్రికేయులు ఆవిష్కరించారు.

సందేహం లేదు.. ఈ పాపం పాకిస్తాన్ దే...

సందేహం లేదు.. ఈ పాపం పాకిస్తాన్ దే...

అణు పరిజ్ఞానాన్ని విక్రయించాలన్న ఆలోచన చేసింది నాటి పాక్‌ సైన్యాధిపతి జనరల్‌ మీర్జా అస్లాం బేగ్‌. కశ్మీరులో వేర్పాటువాదాన్ని ఎగదోసేందుకు 1989 చివర్లో జరిగిన ఒక సమావేశంలో ఆయన.. నాటి పాక్‌ ప్రధాని బేనజీర్‌ భుట్టో ఎదుట ఒక ప్రతిపాదన చేశాడు. అయితే దిగజారిన ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఒత్తిళ్ల నేపథ్యంలో బేనజీర్‌ ఆయన ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. కనీస స్థాయిలో వేర్పాటువాదాన్ని కొనసాగించేందుకు మాత్రం అనుమతిచ్చారు. ఇక బేగ్‌ చేసిన రెండో ప్రతిపాదన చాలా ప్రమాదకరమైనది. ‘‘కశ్మీర్‌లో కనీస స్థాయి వేర్పాటువాదాన్ని కొనసాగించాలన్నా.. పాక్‌కు డబ్బు అవసరం. విదేశీ సాయం నుంచి కాకుండా విడిగా ఒక వనరును సృష్టించుకోవాలి. ఏ.క్యూ.ఖాన్‌ ద్వారా పోగేసుకున్న అణు పరిజ్ఞానాన్ని అమ్మకానికి పెడదాం'' అని సైన్యాధిపతి మీర్జా అస్లాం బేగ్‌ కోరారు. దీనికి భుట్టో నివ్వెరపోయారు. ‘‘ఈ అణు వ్యాప్తి గురించి అంతర్జాతీయ సమాజానికి తెలిస్తే ఏం జరుగుతోందో తెలుసా?'' అని ఆమె ప్రశ్నించారు. సైన్యాధిపతి ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని, అప్పట్నించి తనను దేశ అణు కార్యక్రమానికి సైన్యమే దూరంగా ఉంచేసిందని ఆ ఇంటర్వ్యూలో బేనజీర్ భుట్టో వెల్లడించారు.

బేనజీర్ భుట్టో వద్దన్నా సరే..

బేనజీర్ భుట్టో వద్దన్నా సరే..

ప్రధానిగా ఉన్న బేనజీర్ భుట్టోతో భేటీ తర్వాత పాక్ సైన్యాధిపతి జనరల్‌ బేగ్‌.. ఇరాన్‌ వెళ్లారు. కశ్మీర్‌లో తాము సాగిస్తున్న పరోక్ష యుద్ధానికి సహకరించాలని కోరారు. అందుకు ప్రతిగా ఇరాన్ కు అణు పరిజ్ఞానాన్ని ఇవ్వజూపారు. అయితే ఈ విషయాన్ని అమెరికా మాజీ రాయబారి రాబర్ట్‌ ఆక్లే పసిగట్టి.. వెంటనే అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అఫ్గానిస్తాన్‌లో జిహాద్‌ కొనసాగుతోంది. దాన్ని ఎదుర్కోవడంలో అమెరికాకి.. పాకిస్తాన్ అవసరం కాబట్టి అప్పటి అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్ చెడు తలంపులపై మౌనం వహించింది.

పాక్ అణుపితామహుడి ప్రతిపాదన...

పాక్ అణుపితామహుడి ప్రతిపాదన...

1993లో అప్పటి పాక్ ప్రధాని బేనజీర్ భుట్టో చైనా పర్యటనకు సిద్ధమవుతుండగా పాకిస్తాన్ అణు పితామహుడైన ఏక్యూ ఖాన్ వచ్చి.. పనిలో పనిగా ఉత్తర కొరియాను కూడా సందర్శించాల్సిందిగా ఆమెను కోరారు. పాక్‌ స్వల్పశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేస్తోందని, భారత్‌లోని సుదూర ప్రాంతాలను తాకే సామర్థ్యం వాటికి లేదని ఆయన చెప్పారు. ‘‘మన వద్ద అణుబాంబు ఉంది కానీ దాన్ని చేరవేసే క్షిపణలు లేవు'' అని అన్నారు. దీంతో చైనా నుంచి తిరిగొచ్చే క్రమంలో ఉత్తర కొరియాను కూడా సందర్శించడానికి బేనజీర్‌ అంగీకరించారు. ఎందుకంటే, సైన్యం మాటను మరోసారి కాదనడానికి భుట్టో ఇష్టపడలేదు. మొదట కాదన్నందుకు ఆమె ప్రభుత్వాన్ని వారు రద్దు చేశారు. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని ఆమె నిర్ణయించుకున్నారు. డబ్బు చెల్లించి ఉత్తర కొరియా నుంచి ఈ క్షిపణి పరిజ్ఞానాన్ని పొందాలని భావించారు. అయితే డబ్బుకు బదులుగా ఉత్తరకొరియాకు అణు పరిజ్ఞానాన్ని అందజేసి, ఆ దేశం నుంచి క్షిపణి సాంకేతికతను పొందాలన్న సైన్యం, ఖాన్‌ ఆలోచనల గురించి ఆమెకు ఏమాత్రం తెలియదు.

ఉత్తర కొరియా సమ్మతి..

ఉత్తర కొరియా సమ్మతి..

ఈ నేపథ్యంలో భుట్టో.. 1993 డిసెంబర్‌ 23న ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కాలు మోపారు. ఆమె గౌరవార్థం ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌.. విందు ఇచ్చారు. అందులో తన పక్కనే కూర్చున్న కిమ్‌ వైపునకు ఒరిగిన బేనజీర్‌.. ‘‘నోడాంగ్‌ క్షిపణి బ్లూ ప్రింట్లను మా దేశానికి ఇవ్వండి..'' అని గుసగుసగా అడిగారు. కిమ్‌ ఆశ్చర్యంతో ఆమె వైపు తేరిపార చూశారు. బేనజీర్‌ మరోసారి అదే విషయాన్ని అడగడంతో కొన్ని నిమిషాల మౌనం తర్వాత కిమ్‌ అంగీకరించారు. అలా బేనజీర్ భుట్టో.. దీర్ఘశ్రేణి క్షిపణులకు సంబంధించిన సాంకేతిక పత్రాలు, డిస్క్‌లతో కూడిన ఒక బ్యాగ్‌తో ఉత్తర కొరియా నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ తరువాత పాకిస్తాన్ కు క్షిపణికి సంబంధించిన కీలక భాగాలనూ ఉత్తర కొరియా అందించింది.

హడావుడిగా ‘ఘోరీ’ క్షిపణి పరీక్ష...

హడావుడిగా ‘ఘోరీ’ క్షిపణి పరీక్ష...

ఉత్తర కొరియా అందించిన క్షిపణి పరిజ్ఞానంతో మొత్తంమీద పాకిస్తాన్ సైన్యం, అణుపితామహుడు ఏక్యూ ఖాన్ ల కోరిక నెరవేరింది. అలా నోడాంగ్‌ క్షిపణి వారి చేతికి దక్కింది. దానికి ‘ఘోరీ' అని పేరు పెట్టారు. 1500 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ అస్త్రాన్ని హడావుడిగా పరీక్షించారు. ‘‘నాడు అందరిలోనూ ఉత్సాహం వెల్లివిరిసింది. ఆ క్షిపణికి వేసిన రంగు ఇంకా తడిగానే ఉన్న విషయాన్ని కూడా ఎవరూ గమనించలేదు..'' అని ఖాన్‌ పరిశోధన కేంద్రం వద్ద సౌకర్యాల కల్పన అధికారిగా పనిచేసిన బ్రిగేడియర్‌ సజావాల్‌ కుమారుడు డాక్టర్‌ షాఫిక్‌ తెలిపారు. అది రంగు మారిన ఉత్తర కొరియా క్షిపణి అని యూనియన్‌ ఆఫ్‌ కన్‌సర్న్డ్‌ సైంటిస్ట్స్‌ సంస్థ సహ సంచాలకుడు డేవిడ్‌ రైట్‌ అప్పట్లోనే పేర్కొన్నారు.

చెడు ఒప్పందానికి అదే బీజం...

చెడు ఒప్పందానికి అదే బీజం...

అలా ఉత్తర కొరియా-పాక్‌ల మధ్య ఒక చెడు ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగా భాగంగా పాక్‌ నుంచి యురేనియం శుద్ధి పరిజ్ఞానం ఉత్తర కొరియాకు వెళ్లింది. ఉత్తర కొరియా నుంచి క్షిపణి పరిజ్ఞానం, కొంత నగదు పాక్‌కు అందాయి. ఆ సొమ్ములో ఎక్కువ భాగం పాక్‌ ఖజానాకు వెళ్లగా.. కొంత మేర వ్యక్తుల జేబుల్లోకీ చేరింది. పాక్‌ మాజీ సైన్యాధికారి జహంగీర్‌ కరామత్‌కు 30 లక్షల డాలర్లు, మరో అధికారి జుల్ఫీకర్‌ ఖాన్‌కు 5 లక్షల డాలర్లు, కొన్ని ఆభరణాలను ఉత్తర కొరియా అందించినట్లు 2011లో ఏక్యూ ఖాన్‌ విడుదల చేసిన ఒక లేఖ ప్రకారం తెలుస్తోంది.

గుట్టురట్టు చేసిన అమెరికా...

గుట్టురట్టు చేసిన అమెరికా...

1995లో అమెరికా మాజీ రాయబారి రాబర్ట్‌ ఒక్లే.. పాక్‌ సీనియర్‌ పాత్రికేయులు, మాజీ సైనికాధికారిని వాషింగ్టన్‌కు పిలిచి.. ఉత్తర కొరియా-పాక్‌ ఒప్పందంపై కొన్ని ఆధారాలు చూపెట్టి నిలదీశారు. వారు బుకాయించడంతో పాక్‌ వైమానిక దళానికి చెందిన సి-130 రవాణా విమానాలు సెంట్రిఫ్యూజులు దించుతున్న ఫొటోలు, అలాగే నోడాంగ్‌ క్షిపణి విడిభాగాలను లోడ్‌ చేస్తున్న ఫొటోలను చూపెట్టారు. దీంతో వారు నీళ్లు నమిలారు. ఆ తర్వాత మరిన్ని ఆధారాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఖాన్‌, పాక్‌ వైమానిక దళ విమానాలు తరచూ ఉత్తర కొరియాను సందర్శిస్తున్నట్లు తేలింది. బ్లూప్రింట్లు, సెంట్రిఫ్యూజులు, సాంకేతిక తోడ్పాటు, బాంబు డిజైన్‌, ట్రిగర్‌ యంత్రాంగం ఇలా ఏది కావాలంటే అది ఉత్తర కొరియా, ఇరాన్‌, లిబియాలకు పాక్‌ అందిస్తున్న తీరుపై అమెరికా విదేశాంగ శాఖ, నిఘా సంస్థలు తమ ప్రభుత్వానికి పుంఖాను పుంఖాలుగా ఆధారాలను సమర్పించాయి. మొదట్లో మౌనం వహించినా చివరికి అమెరికా ప్రభుత్వం.. పాకిస్తాన్ పై చర్యలకు ఉపక్రమించింది.

‘తప్పంతా నాదే’అన్న ఏక్యూ ఖాన్...

‘తప్పంతా నాదే’అన్న ఏక్యూ ఖాన్...

ఉత్తర కొరియాకు సెంట్రిఫ్యూగల్‌ పరిజ్ఞానాన్ని పాక్‌ అందించిందనడానికి ఆధారాలు ఉన్నాయని 2002లో అమెరికా అధికారికంగా ప్రకటించింది. దర్యాప్తు కోసం ఖాన్‌ను తమ దేశానికి అప్పగించాలని డిమాండ్‌ చేసింది. అయితే నాటి పాక్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ దీనికి ఒప్పుకోలేదు. అమెరికా ఒత్తిడి పెంచింది. దీంతో ‘జాతీయ ప్రయోజనాల' దృష్ట్యా.. జరిగిన ఉదంతం మొత్తానికీ తానే బాధ్యుడినని ఒప్పుకోవాలని ఏక్యూ ఖాన్‌కు పాక్‌ సైన్యం నచ్చజెప్పింది. ఇలా చేస్తే ఆయనపై ఎలాంటి విచారణ ఉండబోదని, ఆయనను ప్రశ్నించేందుకు ఎవర్నీ అనుమతించబోమని, హీనపక్షంలో గృహ నిర్బంధంలో మాత్రమే ఉంచుతామని హామీ ఇచ్చింది. గత్యంతరం లేకపోవడంతో ఏక్యూ ఖాన్‌ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చర్యలకు తూట్లు పొడుస్తూ.. ఉత్తర కొరియా, ఇరాన్‌, లిబియాలకు అణు పరిజ్ఞానం, పరికరాలను అందజేసినట్లు 2004లో టీవీ చానెళ్ల ద్వారా అంగీకరించాడు. విచిత్రంగా ఈ నేరాంగీకార ప్రకటనను ఆయన ఉర్దూలో కాకుండా ఇంగ్లిష్‌లో చేశారు. ఉర్దూలో చెబితే.. పాకిస్తాన్ లో ఎక్కువ మందికి అర్థమవుతుందన్న ఉద్దేశంతోనే ఆయన చేత అలా చెప్పించారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఈ ప్రసారం మొత్తం అమెరికాను సంతృప్తి పరచడానికే. ఈ అణువ్యాప్తి నెట్‌వర్క్‌ పూర్తిగా తనదేనని, పాక్‌ ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ ఎలాంటి పాత్ర లేదని ఆయన చెప్పారు.

అయినా ఆగని ‘సహకారం’..

అయినా ఆగని ‘సహకారం’..

ఇంత జరిగినా సరే.. ఉత్తర కొరియా-పాకిస్తాన్ ల నడుమ సహకారం మాత్రం ఆగలేదు. 2006 నుంచి ఉత్తర కొరియా పలుమార్లు అణుపరీక్షలు నిర్వహించింది. వీటిలో కొన్ని.. పాక్‌ తరఫున నిర్వహించినవి కూడా ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. యుద్ధ సమయంలో తన భూభాగంలోకి చొచ్చుకొచ్చే భారత బలగాలపై ప్రయోగించడానికి చిన్నపాటి అణ్వస్త్రాలను పాకిస్తాన్ రూపొందిస్తోంది. తాను నేరుగా క్షిపణి పరీక్షలు చేయకుండా.. ఉత్తర కొరియా ద్వారా వాటిని నిర్వహింపచేసి.. ఆ అణు పరీక్షల్లో వెలువడిన డేటాను.. పాక్‌ తన తరువాతి అణ్వస్త్రాల రూపకల్పనలో ఉపయోగించుకున్నట్లు విశ్లేషిస్తున్నారు.

English summary
A Billion Dollar Question is.. How North Korea captured Nuclear Technology? Is there Pakistan's Hand?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X