కరోనా హీరోలకు డిఫెన్స్ చీఫ్ కృతజ్ఞతలు.. ఊహించని రీతిలో సంఘీభావానికి ప్లాన్..
ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాడుతోందని.. అన్ని దేశాల్లాగే భారత్ కూడా వైరస్‌కు ప్రభావితమైందని త్రివిధ దళాల మహా దళపతి బిపిన్ రావత్ అన్నారు. కరోనా కష్ట కాలంలో ముందుండి పోరాడిన ప్రతీ ఒక్కరికీ డిఫెన్స్ తరుపున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. వైద్యులు,నర్సులు,పారిశుద్ధ్య కార్మికులు,మెడికల్ ప్రొఫెషన్స్,పోలీస్,మీడియా,డెలివరీ బాయ్స్.. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.లాక్ డౌన్ 2.0 తుది దశకు చేరుకుంటున్న తరుణంలో భారత సైనిక దళాల మహా దళపతి బిపిన్ రావత్ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

కోవిడ్-19 ఆసుపత్రులపై పూల వర్షం..
కరోనా వారియర్స్‌కు తమ సంఘీభావాన్ని తెలిపేందుకు మే 3వ తేదీ త్రివిధ దళాలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఎయిర్ ఫోర్స్ నేత్రుత్వంలో శ్రీనగర్ నుంచి తిరువనంతపురం వరకు,దిబ్రుఘర్ నుంచి గుజరాత్‌లోని కచ్ వరకు వైమానిక దళాల ఫ్లై పాస్ ఉంటుందన్నారు. ఆ సమయంలో విమానాల నుంచి కోవిడ్-19 ఆసుపత్రులపై పూలను వెదజల్లుతారని చెప్పారు. అలాగే నేవీ కూడా ఆరోజు తీర ప్రాంతాల్లోని యుద్దనౌకలను పూర్తిగా లైటింగ్‌తో అలంకరించి కరోనా వారియర్స్‌కు సంఘీభావం తెలుపుతుందన్నారు. అంతేకాదు,నేవి చాపర్స్ నుంచి కోవిడ్-19 ఆసుపత్రులపై పూల వర్షం కురిపిస్తామన్నారు. ఇక తనవంతు సంఘీభావంగా ఆర్మీ మౌంటైన్ బ్యాండ్ ప్రదర్శనలు ఇస్తుందన్నారు.

కష్టకాలంలో ఐక్యతను చాటామని..
లాక్ డౌన్ పీరియడ్‌లో మీడియా ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తోందని.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయడంతో పాటు.. ప్రజలను అప్రమత్తం చేసిందని పేర్కొన్నారు. అలాగే ప్రజలు ప్రభుత్వ పిలుపు మేరకు సోషల్ డిస్టెన్స్,మాస్కులు ధరించడం వంటి నిబంధనలను పాటించారని అన్నారు. ఈ కష్ట కాలంలో దేశమంతా ఐక్యంగా ఉందని దీపాలు వెలిగించి చాటి చెప్పారన్నారు.

ఆర్మీలో కరోనాపై..
కరోనా వైరస్‌ను డీల్ చేయడంలో ఆర్మీ ఎలాంటి సమస్యలను ఎదుర్కోవట్లేదన్నారు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నవరనే. కరోనా పాజిటివ్‌గా తేలిన మొదటి ఆర్మీ వ్యక్తి కోలుకున్నాడని.. ఇప్పటికే విధుల్లో కూడా చేరిపోయాడని తెలిపారు. ఆర్మీ మొత్తంలో కేవలం 14 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని.. ఇందులో ఐదుగురు ఇప్పటికే కోలుకుని విధుల్లో చేరిపోయారని చెప్పారు.బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత త్రివిధ దళపతులతో కలిసి మీడియా కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.కరోనాపై భారత్ పోరు సాగిస్తున్న వేళ ప్రభుత్వానికి, ప్రజలకు తమ వంతు సేవలు అందించడానికి సిద్దంగా ఉన్నామని గతవారం బిపిన్ రావత్ పేర్కొన్నారు. క్రమశిక్షణ, సహనంతో కూడిన పకడ్బందీ చర్యల వల్లే ఆర్మీపై కరోనా ప్రభావం అంతగా లేదన్నారు.