• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిపిన్ రావత్ మరణం: చైనా విషయంలో భారత విధానంపై ప్రభావం పడుతుందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ బుధవారం హెలీకాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆ ఘటనలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మొత్తం 13 మంది మరణించారు.

జనరల్ బిపిన్ రావత్ మరణం భారత ఆర్మీకి పెద్ద దెబ్బ అని, ఆయన లోటును భర్తీ చేయడం అంత సులువు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత తొలి సీడీఎస్‌గా బిపిన్ రావత్‌ను ప్రధాని మోదీ ఎంపిక చేశారు. 2016లో మోదీ ప్రభుత్వమే బిపిన్ రావత్‌ను ఆర్మీ చీఫ్‌గా నియమించింది. ఇందుకోసం ఇద్దరు సీనియర్ అధికారులను కూడా పక్కన పెట్టింది.

చైనా దుందుడుకు విధానాల విషయంలో భారత్‌కు జనరల్ బిపిన్ రావత్ నాయకత్వం వహించారు. 2017 డోక్లామ్, 2020 గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణను ఎదుర్కొన్నారు.

''చాలా క్లిష్ట సమయంలో ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ బిపిన్ రావత్‌ను దేశం కోల్పోయింది. గత 20 నెలలుగా భారత సరిహద్దుల్లో చైనా దూకుడు వైఖరి కారణంగా హిమాలయాల్లో యుద్ధ తరహా వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కన్నుమూశారు'' అని భారత రక్షణ విశ్లేషకులు బ్రహ్మ చెలానీ ట్వీట్ చేశారు.

''నిక్కచ్చిగా, స్పష్టమైన దృక్పథంతో ఉండే జనరల్ రావత్, చైనా దూకుడుకు వ్యతిరేకంగా భారత్‌ రచించే వ్యూహాలకు చిరునామాగా నిలిచారు. రాజకీయ నాయకత్వం, చైనా పేరును ఉచ్ఛరించడానికి కూడా వెనుకంజ వేస్తోన్న సమయంలో జనరల్ రావత్ ధైర్యంగా చైనాను ఎదుర్కొన్నారు'' అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

https://twitter.com/Chellaney/status/1468824883492655105

2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని డోక్లామ్‌లో భారత్, చైనా సైన్యాలు ముఖాముఖీగా తలపడ్డాయి. అదేవిధంగా 2020 జూన్‌లో ఇరుదేశాల సైన్యం మధ్య లడక్‌లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మృతిచెందగా, చైనా సైనికులు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనల తర్వాత భారత్, చైనా దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగాయి. గత కొన్ని దశాబ్దాలలో మిలటరీ పరంగా చైనా బలంగా మారింది. భారత సరిహద్దుల్లోనూ చైనా ఉనికిని చాటుకుంటోంది. చైనా చర్యలకు ప్రతిస్పందనగా భారత్ కూడా పెద్ద సంఖ్యలో హిమాలయాల వద్ద బలగాలను మోహరించింది. చైనా సరిహద్దుల వరకు రహదారులను ఏర్పాటు చేసుకుంది.

చైనా కవ్వింపు చర్యలను సమర్థంగా ఎదుర్కొనేలా భారత సైన్యాన్ని జనరల్ బిపిన్ రావత్ ముందుండి నడిపించారు. చైనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండేలా సైన్యాన్ని తయారు చేశారు.

ఇప్పుడు ఆయన అకాల మరణంతో చైనా పట్ల భారత వ్యూహాలపై ప్రభావం పడుతుందేమోనని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

కానీ కొందరు విశ్లేషకులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ''జనరల్ బిపిన్ రావత్ మరణం, చైనా పట్ల భారత పాలసీపై గణనీయంగా ప్రభావం చూపుతుందని నేను అనుకోవట్లేదు. భారతదేశ వ్యూహాలు, ఒక అధికారి మరణంతో ప్రభావితం కాలేవు. కానీ ఎవరికి ఉండాల్సిన స్థానం వారికి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, జాతీయ భద్రతకు సంబంధించి అంశాలను భారత్ ఎలా డీల్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే భారత్ ఇంకా పరివర్తన దశలోనే ఉంది. ఇలాంటి దశలో ఏదైనా జరిగితే, కొంచమైనా దాని ప్రభావం ఉంటుంది'' అని రక్షణ విశ్లేషకులు ఉదయ్ భాస్కర్ అన్నారు.

బిపిన్ రావత్

''జనరల్ బిపిన్ రావత్ మరణం భారత ఆర్మీకి తీరని లోటు. కానీ చైనా పట్ల భారత ఆర్మీ పాలసీలో, సన్నద్ధతపై దీని ప్రభావం ఉండబోదు'' అని భారత రక్షణ శాఖ పరిధిలోని మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్‌ రీసెర్చ్ స్కాలర్ కమల్ మాడిశెట్టి అన్నారు.

''భారతదేశానికి చైనా నుంచి ప్రమాదం పొంచి ఉంది అనే అంశంపై జనరల్ బిపిన్ రావత్ హయాంలోనే వ్యూహాత్మక స్పష్టత వచ్చింది. గడిచిన రెండేళ్లలో ఇది మరింత తేటతెల్లమైంది. ఇప్పుడు జనరల్ రావత్ తన వారసత్వాన్ని వదిలి వెళ్లారు. ఆయన స్థానంలో కొత్తగా సీడీఎస్‌గా నియమితులయ్యేవారు రావత్ వ్యూహాలను ముందుకు తీసుకెళ్తారు. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు.''

''భారత భద్రతకు చైనా ప్రమాదకారి అనే అంశంలో ఢిల్లీలోని వ్యూహకర్తలకు ఎలాంటి సందేహం లేదు. సమయం గడిచినకొద్దీ ఈ ముప్పు తీవ్రం కానుందనే సంగతి కూడా వారికి తెలుసు. భారత ఆర్మీకి కమాండ్ సిస్టమ్ ఉంది. జనరల్ రావత్ వెళ్లిపోయాక కూడా అది అలాగే ఉంటుంది. అందులో ఎలాంటి మార్పూ ఉండదు. చైనా విషయంలో భారత పాలసీ ముందులాగే కొనసాగుతుంది'' అని కమల్ వివరించారు.

అయితే భారత ఆర్మీకి జనరల్ రావత్ మరణం పెద్ద దెబ్బ అని కమల్ అన్నారు. '' దేశానికి, భారత సైన్యానికి ఆయన మరణం పూడ్చలేని నష్టం. దేశ భద్రతా విధానాన్ని రూపొందించే యంత్రాంగానికి కూడా ఇది పెద్ద దెబ్బ. భారత భద్రతా వ్యవస్థలో ఆయన సంస్కరణలు, మార్పులు తీసుకొస్తున్నారు. ఆ విషయంలో భారత్ కచ్చితంగా ఆయన నాయకత్వ సేవలను కోల్పోయినట్లే. కానీ భారత ఆర్మీ కమాండ్ సిస్టమ్‌ విషయానికొస్తే బిపిన్ రావత్ గైర్హాజరీలోనూ దాన్ని సమర్థంగా నడిపించేందుకు కావల్సిన నాయకత్వం భారత్ దగ్గర ఉంది'' అని ఆయన చెప్పుకొచ్చారు.

భారత్‌కు చైనా రూపంలో రోజురోజుకీ ముప్పు పెరుగుతోన్న సమయంలో జనరల్ బిపిన్ రావత్ మరణం సంభవించిందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

''గడిచిన ఏడాది భారత్‌కు అనేక సవాళ్లను విసిరిందన్నది నిజమే. అందులో చైనా నుంచి భారత్ కఠిన సవాలును ఎదుర్కొంది. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు కూడా భారత్‌లో ఆందోళనను పెంచాయి. అయితే ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, జనరల్ రావత్ మరణం, భారత భద్రతా వ్యవస్థకు పెద్దగా నష్టం కలిగించదు. ఎందుకంటే ఈ సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సమర్థవంతమైన నాయకత్వం భారత ఆర్మీలో ఉంది'' అని కమల్ తెలిపారు.

జనరల్ రావత్, భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. భారత సైన్యంలోని మూడు విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల మధ్య సమన్వయం చేయడం, సైన్యానికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం సీడీఎస్‌గా ఆయన ప్రధాన భాధ్యత. భారత భద్రతా ఒప్పందాలలో ఆయన కీలకంగా వ్యవహరించారు. భారత ఆర్మీని ఆధునీకరించే పనిలో ఉన్నారు.

సీడీఎస్ పాత్ర గురించి ఉదయ్ భాస్కర్ వివరించారు. ''భారత సీడీఎస్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అనే రెండు పదవులు సమానం కావు. సీడీఎస్, ఆపరేషనల్ కమాండ్‌కు నాయకత్వం వహించలేరు, కానీ ఆర్మీలోని వివిధ భాగాలను సమన్వయం చేస్తారు. నిజానికి సీడీఎస్, భారత ప్రభుత్వానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారు. సీడీఎస్‌కు ప్రత్యక్ష కమాండ్, కంట్రోల్ అధికారాలు ఉండవు. కాబట్టి ఆయన మరణం, భారత ఆర్మీ సామర్థ్యాన్ని, సన్నద్ధతను ప్రభావితం చేయలేదు'' అని ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు.

బిపిన్ రావత్ నాయకత్వంలోనే భారతదేశం ఎస్-400 క్షిపణుల రక్షణ వ్యవస్థ కోసం రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఈ క్షిపణులు భారత్‌కు దిగుమతి అవుతున్నాయి.

భారతదేశ భద్రతా ఒప్పందాలపై కూడా జనరల్ రావత్ మరణం ప్రభావం చూపుతుందా?

ఈ ప్రశ్నకు సమాధానంగా కమల్ మాడిశెట్టి ''భారత ఆర్మీ ఆధునీకరణంలో రావత్ కీలక పాత్ర పోషించారు. ఆయన వెళ్లిపోవడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు పడతాయి. కానీ భారత రక్షణ వ్యవస్థ ఒప్పందాలపై ఇది ప్రభావం చూపదు. రక్షణ పరికరాల విషయంలో ఏళ్లుగా భారత్ ఒక ఎజెండాతో ముందుకు వెళ్తోంది. భవిష్యత్‌లో కూడా ఇది ఇలాగే కొనసాగుతుంది'' అని అన్నారు.

''చైనాతో భారత్‌కు ముప్పు పొంచి ఉన్న సమయంలో బిపిన్ రావత్ మరణం రూపంలో భారత్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయన మరణంతో భారత యుద్ధవ్యూహాలపై ప్రభావం ఉండకపోవచ్చు, కానీ రక్షణ రంగంపై మాత్రం కచ్చితంగా ఉంటుంది'' అని ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం భారత్‌లో ఆర్మీ కమాండ్‌కు చెందిన సీడీఎస్ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. కానీ ఇప్పుడు అది పూర్తిగా అభివృద్ధి చెందడానికి మరింత సమయం తీసుకుంటుందని ఉదయ్ భాస్కర్ అన్నారు.

''భారత్ తొలిసారిగా సీడీఎస్‌ను నియమించింది. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కొత్త సీడీఎస్‌ను నియమించేంత వరకు... ఇంతకాలం రావత్ తర్వాత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి తాత్కాలికంగా ఈ బాధ్యతలను చూస్తుంటారు. సీడీఎస్ వ్యవస్థకు సంబంధించిన విధివిధానాలను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది'' అని అన్నారు.

వచ్చే వారంలోగా కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ ప్రభుత్వం, త్వరగా కొత్త సీడీఎస్‌ను ప్రకటించకపోతే, వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని రక్షణశాఖ విశ్లేషకులు ఉదయ్ భాస్కర్ భావిస్తున్నారు.

''భారత ఆర్మీ, సైనికులు ఇంకా జనరల్ రావత్ మరణాన్ని మరచిపోలేదు. వారు అదే దు:ఖంలో ఉన్నారు. అయితే వారి ఆత్మస్థయిర్యం మాత్రం క్షీణించలేదు. ఒకవేళ ప్రభుత్వం, కొత్త సీడీఎస్‌ను నియమించలేకపోతే మాత్రం అది కచ్చితంగా సైన్యానికి ప్రతికూల సందేశాన్ని పంపుతుంది'' అని ఉదయ్ భాస్కర్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bipin Rawat's death: Will it affect Indian policy towards China
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X