వణికిస్తున్న బర్డ్ ఫ్లూ... బాధిత రాష్ట్రాల జాబితాలో ఉత్తరాఖండ్ , జార్ఖండ్
ఇప్పుడు భారతదేశాన్ని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది . బర్డ్ ఫ్లూ కారణంగా పక్షులు చనిపోవడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఆందోళన నెలకొంది. బర్డ్ ఫ్లూ పక్షుల నుండి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర సర్కార్ అన్ని రాష్ట్రాలకు అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రోజుకో రాష్ట్రం బర్డ్ ఫ్లూ బాధిత రాష్ట్రాల జాబితాలో చేరటం ఆందోళనగా మారింది .
ఢిల్లీ, మహారాష్ట్రలలో బర్డ్ ఫ్లూ భయం ..పర్బానీలో 9 వేల పక్షులను చంపెయ్యాలని ఆదేశం

బర్డ్ ఫ్లూ కేసుల నమోదుతో 10 వ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం
గత రెండు వారాలుగా భారతదేశంలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న బర్డ్ ఫ్లూ కేసులు కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ మరియు మహారాష్ట్రలలో నమోదయ్యాయి. 10 వ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం చేరింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో పౌల్ట్రీ కోళ్ల దిగుమతిని ఢిల్లీ నిషేధించగా, రాజస్థాన్‌లోని జైపూర్ జంతుప్రదర్శనశాల పక్షుల విభాగం మూసివేయబడింది. బర్డ్ ఫ్లూ కారణంగా అక్కడ కొన్ని పక్షులు చనిపోయినట్లు గుర్తించారు. ఏవియన్ ఫ్లూజూలోని పక్షుల మరణానికి కారణమా అనేది తెలుసుకోవడం కోసం అక్కడి పక్షుల నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్‌కు పంపారు.

జార్ఖండ్ లోనూ బర్డ్ ఫ్లూ ... పక్షుల మృతి ధృవీకరించిన అధికారులు
మరోపక్క తెలుగు రాష్ట్రాల్లోనూ బర్డ్ ఫ్లూ భయం బాగా పెరిగిపోతోంది.
ఇక తాజాగా జార్ఖండ్‌లోని డుమ్కా జిల్లాలోని ఒక గ్రామంలో పెద్ద సంఖ్యలో కాకులు, మైనాలు మరియు హెరాన్లు చనిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటన ఈ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భయాందోళనలకు కారణమైందని అధికారులు మంగళవారం తెలిపారు. షికారిపాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహుల్‌పహారి సమీపంలోని పోఖారియా గ్రామంలో సోమవారం 40-50 పక్షులు చనిపోయినట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి అవధేష్ కుమార్ సింగ్ తెలిపారు.

ముంబై లో పక్షుల మృతిపై బిఎంసి క్లారిటీ
ఇదిలా ఉంటే ముంబై నుండి రెండు కాకుల నమూనాలను బర్డ్ ఫ్లూ కోసం పరీక్షించిన నేపథ్యంలో, పక్షుల మరణాన్ని నివేదించడం మరియు వాటి అవశేషాలను సురక్షితంగా పూడ్చిపెట్టటంపై మార్గదర్శకాలను రూపొందించింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) సోమవారం మార్గదర్శకాలను జారీ చేసింది, ఎక్కడైనా పక్షుల మరణాలను గమనించినట్లయితే ప్రజలు హెల్ప్‌లైన్ నంబర్ 1916 ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిన నేపధ్యంలో కేంద్రం అలెర్ట్
ఇప్పటికి 10 రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిన నేపధ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. పౌల్ట్రీ ఫారాలు, చెరువులు, జంతుప్రదర్శనశాలలు ఉన్నచోట్ల నిఘా పెంచాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. అయితే బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈ దేశంలో ఎవరికీ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించలేదని, ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర స్పష్టం చేసింది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కేంద్రం సూచనల మేరకు అప్రమత్తమైన రాష్ట్రాలు రోజువారీ సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పరిస్థితుల్లో తెలుసుకుంటున్నారు.