• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిట్ కాయిన్లు: అప్పుడు నిషేధించారు... ఇప్పుడు దూసుకుపోతున్నాయి...

By BBC News తెలుగు
|

ఈ ఏడాది స్టాక్ మార్కెట్లన్నీ ఓవైపు అనిశ్చితిలో ఉంటే, క్రిప్టో కరెన్సీలు మాత్రం అదరగొట్టాయి.

బిట్ కాయిన్ విలువ ఇప్పుడు మూడేళ్ల గరిష్ఠాన్ని, అంటే 22వేల డాలర్లను (16 లక్షల రూపాయాలను) తాకింది. గత మార్చిలో దాని విలువ 5900 డాలర్లే. 2021 చివరికల్లా బిట్ కాయిన్ విలువ లక్ష డాలర్లకు చేరవచ్చని, మూడు లక్షల డాలర్లు దాటినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ నగదు. ఆర్‌బీఐ లాంటి సెంట్రల్ బ్యాంకుల నియంత్రణలో ఇవి ఉండవు. రూపాయి, డాలర్ లాగా కాకపోయినా, ఆన్‌లైన్‌లో కొనుగోళ్లకు, చెల్లింపులకు వీటిని ఉపయోగించవచ్చు.

రితికా కర్‌కు 34 ఏళ్లు. దిల్లీలో ఆమె పబ్లిక్ రిలేషన్స్‌కు సంబంధించిన ఉద్యోగం చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీల విలువ పెరుగుతున్న తీరును గమనించి, ఆమె వాటిలో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు.

నాలుగు నెలల క్రితం ఆమె వెయ్యి రూపాయలతో బిట్ కాయిన్ కొన్నారు.

''క్రిప్టో కరెన్సీ గురించి వార్తా కథనాలు చూశా. ఆసక్తిగా అనిపించింది. ఇందులో ఎందుకు పెట్టుబడి పెట్టకూడదు అని అనుకున్నా. అలా మొదలుపెట్టి, నాలుగు నెలల్లో లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టా. ఫేస్‌బుక్, ట్విటర్, బ్లాగ్‌లు ఇలా చాలా వేదికల్లో వీటి గురించి సమాచారం అందించే గ్రూప్‌లు ఉంటాయి. వాళ్లు చేసిన పొరపాట్ల నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు'' అని ఆమె అన్నారు.

క్రిప్టో కరెన్సీ

క్రిప్టో కరెన్సీల్లో దీర్ఘకాలికంగా ఆలోచించి పెట్టుబడి పెట్టాలని రితికా అంటున్నారు.

''త్వరగా డబ్బు సంపాదించేయాలని నేను ఇందులోకి రాలేదు. భవిష్యత్తు కోసమని ఆలోచించా. నాకు ఇంకా పెళ్లి కాలేదు. వీలైనంత వైవిధ్యంగా పెట్టుబడులు పెట్టాలన్నది నా ఆలోచన'' అని ఆమె చెప్పారు.

చాలా వ్యాపార సంస్థలు తమ లావాదేవీల కోసం క్రిప్టో కరెన్సీలను వాడుతున్నాయి. ముంబయిలో రుచి పాల్ కన్‌స్ట్రక్షన్ వ్యాపారం నడుపుతున్నారు. ఆమె వయసు 25 ఏళ్లు.

తాము 2015 నుంచి క్రిప్టో కరెన్సీలు వాడుతున్నామని రుచి చెప్పారు. అంతర్జాతీయ క్లైంట్లు క్రిప్టో కరెన్సీ లావాదేవీలను కోరుకుంటున్నారని, వాటితో సౌలభ్యం ఎక్కువని ఆమె అన్నారు.

''ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్లను స్వీకరిస్తారు. సింగపూర్, మలేసియాల్లో మా క్లైంట్లు ఉన్నారు. వెస్టర్న్ యూనియన్ లాంటి మార్గాల్లో చెల్లింపులు చేయడం ఖర్చు, ప్రయాసలతో కూడుకున్న పని. క్రిప్టో కరెన్సీల ద్వారా చెల్లిస్తే చాలా తక్కువ వ్యయం అవుతుంది. సులభం కూడా. అందుకే బిట్ కాయిన్లతో చెల్లింపులు మొదలుపెట్టాం'' అని రుచి చెప్పారు.

క్రిప్టో కరెన్సీ

క్రిప్టో కరెన్సీ ఉంటుందా?

భారత్‌లోని ప్రముఖ క్రిప్టో కరెన్సీ వేదికల్లో వాజిర్‌ఎక్స్ ఒకటి. తమ వేదికలో కొత్తగా చేరే యూజర్లు గత ఆరు నెలల్లో 130 శాతం పెరిగారని ఆ సంస్థ ప్రకటించింది.

''క్రిప్టో కరెన్సీ, వర్చువల్ కరెన్సీలను ట్రేడింగ్ చేయకుండా ఫైనాన్షియల్ సంస్థలపై ఆర్‌బీఐ విధించిన నిషేధాన్ని గత మార్చిలో సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత లాక్‌డౌన్ వచ్చింది. జనాలు ఇళ్ల నుంచి పనిచేయడం మొదలుపెట్టారు. వారికి క్రిప్టో కరెన్సీల గురించి తెలుసుకునేందుకు సమయం దొరికింది. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు డబ్బు సంపాదించే కొత్త మార్గాల కోసం వెతికారు. ఈ సంక్షోభం చాలా మందిని క్రిప్టో కరెన్సీల వైపు వచ్చేలా చేసింది. మైక్రోస్ట్రాటజీ, పేస్కేల్, పేపాల్ లాంటి అంతర్జాతీయ సంస్థాగత పెట్టుబడిదారి సంస్థలు క్రిప్టో కరెన్సీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి'' అని వాజిర్‌ఎక్స్ సీఈఓ నిశ్చల్ శెట్టి చెప్పారు.

2017 తర్వాత వచ్చిన మార్పుల గురించి చెబుతూ... ''మదుపరులు ముందు కన్నా ఎక్కువ పరిణతితో కనిపిస్తున్నారు. 2017 నుంచి వాళ్లు ఎత్తుపల్లాలన్నీ చూశారు. ఏం జరగొచ్చనేది వారికి తెలుసు'' అని ఆయన అన్నారు.

జెబ్‌పే, కాయిన్‌డీసీఎక్స్, కాయిన్‌స్విచ్ లాంటి సంస్థలు కూడా భారత్‌లో క్రిప్టో కరెన్సీ సేవలు అందిస్తున్నాయి.

తమ వేదికను వినియోగిస్తున్నవారిలో ఎక్కువ మంది 24 నుంచి 40 ఏళ్ల మధ్య వయసువారేనని... ఎక్కువగా ఇంజినీరింగ్, టెక్నాలజీ నేపథ్యం ఉన్నవారు ఉంటున్నారని వాజిర్‌ఎక్స్ తెలిపింది. నగరాల్లో ఉండే పురుషులే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొంది.

క్రిప్టో కరెన్సీ

గత మార్చి 1 వరకూ భారత్‌లోని నాలుగు ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్చేంజీల్లో 4.5 మిలియన్ డాలర్ల మేర ట్రేడింగ్ జరగ్గా, డిసెంబర్ 16 వరకు ఇది 22.4 మిలియన్ డాలర్లకు పెరిగిందని కాయిన్‌గెకో అనే మేధో సంస్థ తెలిపింది. మార్చి తర్వాత ఈ ఎక్చేంజీల్లో ట్రేడింగ్ దాదాపు 500 శాతం పెరిగిందని పేర్కొంది.

ఆసియాలో చైనా తర్వాత భారత్‌లోనే అత్యధికంగా బిట్ కాయిన్‌ల్లో పెట్టుబడులు ఉన్నాయని పాక్స్‌పుల్ అనే క్రిప్టో కరెన్సీ ఎక్చేంజీ తెలిపింది. అంతర్జాతీయంగా బిట్ కాయిన్ పెట్టుబడుల్లో అమెరికా తొలి స్థానంలో ఉందని... నైజీరియా, చైనా, కెనడా, బ్రిటన్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది.

''క్రిప్టో కరెన్సీ వెనుకున్న సాంకేతికత గురించి తెలిసినవారు ఇందులో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే, 2017లో కనిపించిన వృద్ధి జనం అత్యాశతో పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చింది. ప్రస్తుతం కనిపిస్తుంది మాత్రం సహజ వృద్ధే'' అని కాయిన్‌డీసీఎక్స్ సహవ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా బీబీసీతో అన్నారు.

''బంగారం చట్టపరంగా లావాదేవీలకు ఉపయోగించేది కాదు. కానీ, జనం దాన్ని కొంటారు. అమ్ముతారు. అంతమాత్రాన అది చట్టవిరుద్ధం కాదు. క్రిప్టో కరెన్సీల అమ్మకాలను, కొనుగోళ్లను సుప్రీం కోర్టు అనుమతించింది. ఇదంతా అవగాహనకు సంబంధించిన విషయం. ఇందులో పెట్టుబడులు పెట్టే ముందు బ్లాక్ చెయిన్ అంటే ఏంటి? బిట్ కాయిన్ అంటే ఏంటి? అనేవి జనం అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా ఇందులోకి రావాలి. తీవ్ర హెచ్చుతగ్గులు ఉండే కరెన్సీ ఇది'' అని ఆయన చెప్పారు.

క్రిప్టో కరెన్సీ

చట్టబద్ధమేనా?

''భవిష్యతులో డబ్బుకు బిట్ కాయిన్ కేంద్రం కాబోతుంది. భారత ప్రభుత్వం ఈ కరెన్సీని గుర్తించి, ఇది చట్ట విరుద్ధం కాదన్నది స్పష్టం చేయాలి. దీనిపై స్పష్టమైన పన్ను విధానం తేవాలి. వివిధ దేశాలు క్రిప్టో కరెన్సీల గురించి నిబంధనలు తెస్తున్నాయి. భారత్ కూడా వాటిని తమకు అనుగుణంగా మార్చుకుని అమల్లోకి తీసుకురావొచ్చు. ఇందుకోసం ఈ రంగంలో ఉన్నవారితో చర్చలు జరపాలి. ఆర్థిక సాంకేతిక రంగాల్లో మనం అగ్రగామిగా ఉన్నాం. ఈ పరిస్థితిని వాడుకుని మార్పుకు నేతృత్వం వహించాలి'' అని బిట్ కాయిన్ పెట్టుబడిదారుడు సందీప్ గోయెంకా అన్నారు.

పూర్తిగా ఆన్‌లైన్ కరెన్సీ కావడంతో సైబర్ నేరగాళ్లు క్రిప్టో కరెన్సీని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కారణంతోనే 2018లో ఆర్‌బీఐ క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించింది. అయితే, సుప్రీం కోర్టు ఈ నిషేధాన్ని ఈ ఏడాది ఎత్తేసింది.

''అన్ని రంగాల్లో ఉన్నట్లే క్రిప్టో కరెన్సీని దుర్వినియోగం చేసేవాళ్లు కూడా ఉంటారు. అలా అని దీన్ని మనం అడ్డుకోకూడదు. బంగారం లాగే బిట్ కాయిన్లు కూడా ప్రత్యేకమైన, అరుదైన, విలువైన వస్తువులే'' అని గోయెంకా అన్నారు.

క్రిప్టో కరెన్సీ

పన్నులు ఎలా వేస్తారు?

క్రిప్టో కరెన్సీలపై వచ్చే ఆదాయం విషయంలో ఎలా వ్యవహరించాలన్నదానిపై ఇంకా అయోమయం ఉంది. ప్రభుత్వం దీని గురించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదు.

క్రిప్టో కరెన్సీని ఆర్‌బీఐ కరెన్సీగా అంగీకరించలేదు కాబట్టి పన్ను వేసే విషయంలో దీన్ని ఆస్తిగానే పరిగణిస్తారు.

''క్రిప్టో కరెన్సీపై వచ్చిన ఆదాయాన్ని 'ఇతర వనరుల నుంచి' వచ్చినట్లుగా చూపించాల్సి ఉంటుంది. దీన్ని స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా పెట్టుకున్నారా అన్నదాన్ని బట్టి పన్ను ఉంటుంది. అందుకు అనుగుణంగా కాపిటల్ గెయిన్స్ పన్ను కట్టాలి'' అని మనీఎడ్యుస్కూల్ వ్యవస్థాపకుడు అర్నవ్ పాండ్య బీబీసీతో చెప్పారు.

''కరెన్సీపై వచ్చిన ఆదాయం గురించి ఆదాయపు పన్ను విభాగం పట్టించుకోదని అనుకోకూడదు. వారి దగ్గర అన్ని రికార్డులూ ఉంటాయి'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bitcoins that were Banned then,but now this has become a world for few
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X