బుల్డోజర్ లపై బీజేపీ కార్యకర్తల సంబరాలు; యోగి వేషధారణలో చిన్నారుల ఫోటోలు వైరల్
ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఘన విజయానికి చేరువగా ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుల్డోజర్లను ఎక్కి సంబరాలు చేసుకున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల ప్రచార సమయంలో, యోగి ఆదిత్యనాథ్ ర్యాలీలకు హాజరైన బిజెపి కార్యకర్తలు "బుల్డోజర్ బాబా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఇక తాజాగా ఎన్నికల ఫలితాలలో బీజేపీ ప్రభంజనం సృష్టించడంతో పార్టీ విజయాన్ని సంబరాలు చేసుకోవడానికి బుల్డోజర్ లను ఎక్కి సందడి చేశారు.

బుల్డోజర్లు ఎక్కి బీజేపీ కార్యకర్తల హంగామా
లక్నోలో బిజెపి కార్యకర్తలు తమ చేతుల్లో బిజెపి జెండాలతో బుల్డోజర్ను ఎక్కి హంగామా సృష్టించారు. కొందరైతే బుల్డోజర్ పైన నిలబడి , మరికొందరు బుల్డోజర్ బ్లేడ్‌పై సగం కూర్చుని బుల్డోజర్ బాబా గెలిచాడని సంబరాలు జరుపుకున్నారు యుపి ఎన్నికల ప్రచారంలో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బుల్డోజర్ బాబా అని పిలిచారు.

అఖిలేష్ బుల్డోజర్ బాబా వ్యాఖ్యలు... ఆయనకే బూమరాంగ్
అయోధ్యలో జరిగిన ర్యాలీలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నింటికి పేరు మార్చారని పేర్కొన్నారు. తాము ఇంత కాలం ఆయనను " ముఖ్యమంత్రి బాబా" అని పిలిచేవాళ్ళం, కానీ ప్రఖ్యాత ఆంగ్ల పత్రికలలో ఒకటి బుల్డోజర్ బాబా అని యోగి ఆదిత్యనాథ్ కు పేరు పెట్టిందని ఈ ఎన్నికలలో ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుందని బుల్డోజర్ తో బుల్డోజర్ బాబాని బయటకు పంపిస్తామని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. కానీ ఊహించని విధంగా అఖిలేష్ కు షాక్ ఇచ్చారు యూపీ ప్రజలు.

బుల్డోజర్ లపైకి ఎక్కి సంబరాలు
యోగి ఆదిత్యనాథ్ రెండోసారి యూపీ సీఎం అవుతున్న తరుణంలో, యూపీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు పార్టీ మద్దతుదారులు బుల్డోజర్లతో సంబరాలు చేసుకున్నారు. బుల్డోజర్పై ఎక్కి పార్టీ జెండాలు పట్టుకుని హంగామా చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో బుల్డోజర్లతో ప్లకార్డులు పట్టుకొని బిజెపి సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ సమాజ్‌వాది పార్టీకి షాక్ ఇచ్చారు.

యోగీ వేషధారణలో చిన్నారులు.. ఫోటోలు వైరల్
ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అనేక చోట్ల కార్యకర్తలు మోడీ అభిమానులు కాషాయ రంగు దుస్తులు ధరించి, బీజేపీ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. యోగి తరహాలో కాషాయ దుస్తులతో చిన్న పిల్లలను అలంకరించి వేడుకలు చేసుకుంటున్నారు. ఇక యోగి కాస్ట్యూమ్ లతో చిన్నారుల ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.