బీజేపీ రెండు ఇండియాలను కోరుకుంటోంది: రాహుల్ గాంధీ
దేశంలో ప్రజలను రెండుగా విభజించేందుకు కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీకానీ, ప్రధానమంత్రి మోడీకానీ రెండు హిందూస్థాన్లు ఉండాలని కోరుకుంటున్నారని, ఒకటి ధనవంతుల కోసమైతే, మరొకటి పేదల కోసమని వ్యాఖ్యానించారు. రాజస్తాన్లోని బాన్స్ వారా జిల్లాలో జరిగిన బహిరంగసభలో దేశ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగ సమస్యలను ప్రస్తావిస్తూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేవలం ఇద్దరు లేదా ముగ్గురు ఉండే వ్యాపారవేత్తలైన ధనికుల కోసం ఒక భారత్, దళితులు, రైతులు, పేదలతోపాటు అణగారిన వర్గాలుండేవారి కోసం మరొక భారత్ ఏర్పాటు చేయాలని కోరుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే హిందూస్థాన్ ఉండాలని కోరుకుంటోందని, బీజేపీ మాత్రం రెండు హిందూస్థాన్లను కోరుకుంటోందని, ప్రజలతో కలిసి పనిచేయాలని తామనుకుంటుంటే బీజేపీ మాత్రం ప్రజల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

మనదేశ ఆర్థిక వ్యవస్థపై బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా దాడి చేసిందని, నోట్ల రద్దు, జీఎస్టీని సరిగా అమలు చేయకపోవడంతో దేశం నార్థిక వ్యవస్థ నాశనమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి యూపీఏ కృషిచేస్తే నరేంద్రమోడీ హాని కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.