పౌరసత్వ చట్టానికి సానుకులం!: గతంలో మన్మోహన్ సింగ్ ఏమన్నారంటే.?(వీడియో)
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో పార్లమెంటులో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 2003లో మన్మోహన్ సింగ్ రాజ్యభలో ఈ చట్టానికి అనుకూలంగా మాట్లాడిన వీడియో క్లిప్‌ను భారతీయ జనతా పార్టీ తన అధికారిక ట్విట్టర్లో ఖాతాలో షేర్ చేసింది.
మోడీ ఆరేళ్లలో ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప ఏమీ చేయలేదు: మన్మోహన్ సింగ్
ప్రస్తుత చట్టానికి సానుకూలంగా 2003లోనే మన్మోహన్..
ఈ వీడియోలో.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వచ్చిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించడానికి మద్దతుగా మన్మోహన్ మాట్లాడారు. ప్రస్తుతం బీజేపీ కూడా అదే చట్టం చేసిందని బీజేపీ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ‘2003లో రాజ్యసభలో నాటి ప్రతిపక్ష నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో మతపరమైన హింసకు గురైన మైనార్టీలకు పౌరసత్వం కల్పించే విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి' అని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రస్తుం కేంద్ర ప్రభుత్వం కూడా అదే చేసిందని బీజేపీ పేర్కొంది. అయితే ఇప్పుడు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఉదారంగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతూ..
‘నేను శరణార్థులకు సంబంధించి ఒక విషయం చెప్పదల్చుకున్నాను. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్ వంటి దేశాల్లోని మైనార్టీలు మతపరమైన హింసను, పీడనను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో పరిస్థితుల ప్రభావంతో వారంతా శరణార్థులుగా మనదేశానికి వస్తే పౌరసత్వం కల్పించడంపై మరింత ఉదారంగా వ్యవహరించాలి. ఉపప్రధానమంత్రి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో దానికనుగుణంగా పౌరసత్వ చట్టాన్ని రూపొందిస్తారని భావిస్తున్నా' అని మన్మోహన్ సింగ్ ఆ వీడియోలో ప్రభుత్వాన్ని కోరారు.

ఇప్పుడెందుకిలా?
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అప్పుడు మన్మోహన్ సింగ్ సమర్థించిన చట్టాన్నే తాము తెచ్చామని.. అప్పుడు సమర్థించి.. ఇప్పుడు వ్యతిరేకించడం ఏంటని బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో హింసను ఎదుర్కొని అక్కడ బతకలేని పరిస్థితుల్లో మనదేశానికి శరణార్థులుగా వచ్చే మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించే విధంగా తాజాగా పౌరసత్వ సవరణ చట్టం కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.