'నీ భార్యనో కూతురినో రేప్ చేస్తే తెలిసేది'
బులంద్ షహర్ : ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ హైవే మార్గంలో చోటు చేసుకున్న తల్లీకూతుళ్ల అత్యాచారంపై పెద్ద దుమారమే రేగుతోంది. పరామర్శల పేరుతో ప్రతిపక్షాలు, మీడియా తమ కుటుంబాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని బాధిత కుటుంబం ఆరోపిస్తోంటే.. ఘటనను ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించిన మంత్రి అజంఖాన్ పై విపక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయి.
అత్యాచార ఘటనను ప్రతిపక్షాల కుట్ర అభివర్ణించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినా రాష్ట్ర బీజేపీ ప్రతినిధి ఐపీ సింగ్.. మంత్రి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్న ఆయన, మంత్రి గారి కూతురిపైనో.. భార్యపైనో గ్యాంగ్ రేప్ జరిగుంటే తెలిసొచ్చేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ ఘోర అఘాయిత్యం జరిగి బాధితులు తీవ్ర బాధలో ఉంటే.. ఘటనను రాజకీయం చేయాలని చూడడం వాళ్ల నీచ స్థితికి నిదర్శనమని ఆరోపించారు ఐపీ సింగ్.
గ్యాంగ్ రేప్ తర్వాత ఘటనపై స్పందించిన మంత్రి అజంఖాన్.. అధికారం కోసం ప్రతిపక్షాలు ఎంతటి నీచానికి దిగజారుతాయని, అమాయక ప్రజలపై అఘాయిత్యాలకు ఏమాత్రం వెనుకాడవని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మమ్మల్ని ఇలా వదిలేయండి ప్లీజ్..
ఘటనపై రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటుంటే.. మరోవైపు మీడియా, రాజకీయ నేతల తాకిడితో బాధిత కుటుంబంలో గందరగోళం నెలకొంది. పరామర్శల పేరుతో ప్రతీ ఒక్కరు తమ ఇంటికి క్యూ కట్టడంతో.. వచ్చిన ప్రతీ ఒక్కరికి ఘటనపై వివరణ ఇచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అదీగాక కొంతమంది మీడియా ప్రతినిధులు.. బాధితురాలైన తండ్రి వివరాలు వెల్లడిస్తున్న క్రమంలో ముసుగు తొలగించాలని బలవంతం పెట్టడం.. తీరా ముసుగు తీశాక అనేక ప్రశ్నలతో ఇబ్బందులు పెట్టడం వారికి ఇప్పుడో పెద్ద సమస్యగా పరిణమించింది.
ఇదే విషయంపై స్పందిస్తూ.. 'నా కూతురు, భార్యకు జరిగిన విషాదం గురించి ఇంకెన్నిసార్లు వివరణ ఇచ్చుకోవాలి? ఇంకా ఏం మిగిలి ఉంది చెప్పడానికి? రాత్రి వరకు బాగానే ఉన్న నా కూతురు మీడియా తాకిడితో తీవ్ర ఒత్తిడికి లోనైంది. మరోసారి తను స్పృహ కోల్పోయింది.. విరామం లేకుండా ఏడుస్తూనే ఉంది. దయచేసి ఇకనైనా మమ్మల్ని వదిలి వెళ్లిపోండి. మేం ఇక మీ ముందుకు రాము' అంటూ ధీనంగా వేడుకున్నాడు బాధితురాలి తండ్రి.
ఆప్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మహిళలపై అత్యాచారాలకు తెగబడేవారిని బహిరంగంగా చంపే చట్టాలు తీసుకురావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆప్ మంత్రి కపిల్ మిశ్రా. బులంద్ షహార్ గ్యాంగ్ రేప్ ఘటనపై తన బ్లాగులో స్పందించిన మంత్రి కపిల్ మిశ్రా నిందితులను బహిరంగంగా హతమార్చాలంటూ కామెంట్ చేశారు.
ఉరిశిక్షకు తాను వ్యతిరేకమన్న మిశ్రా.. రేపిస్టులు తీవ్రవాదులతో సమానమని, అందుకే వారికి తగిన శిక్ష విధించాలన్నారు. రాజధాని ఢిల్లీలో గతేడాది 450 మంది మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగినట్లుగా తెలిపారు. ఇలాంటి ఘటనలు ఎదుర్కోవాలంటే మహిళలకు ఆయుధ శిక్షణ ఇచ్చి, అత్యాచారానికి యత్నించే నిందితులకు తగిన బుద్ది చెప్పాలని డిమాండ్ చేశారు.
నేరం జరిగిన తర్వాత నేరస్తులు భయపడాలి గానీ.. నిందితులు బాధితులను ప్రభావితం చేయరాదని వెల్లడించారు. అలాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాల ఘటనలను దాచాలని చూడడం సరికాదని, విషయాన్ని బహిర్గతం చేసి నిందితులను చంపడానికి ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని సూచించారు.