ఓ ఎంపీ,ఓ ఎమ్మెల్యే... దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి పొలిటీషియన్లు వీరే...
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ,పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రవీంద్రనాథ్ చటర్జీ.. దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి పొలిటీషియన్లుగా నిలిచారు. యూపీలోని గౌతమ బుద్దనగర్‌కి చెందిన ఎంపీ మహేశ్ శర్మ(61) వృత్తి రీత్యా వైద్యుడు. తొలి దశలో హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇవ్వడంతో మహేశ్ శర్మ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.పేషెంట్స్ వెల్ఫేర్ కమిటీలో రవీంద్రనాథ్ సభ్యుడిగా ఉండటంతో టీఎంసీ ఎమ్మెల్యేకి కూడా అధికారులు వ్యాక్సిన్ ఇచ్చారు.

వ్యాక్సినేషన్‌పై స్పందించిన ఎంపీ...
నోయిడా సెక్టార్ 27లో ఉదయం 11గంటలకు డా.శర్మ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం 30 నిమిషాల పాటు వైద్యులు ఆయన్ను అబ్జర్వేషన్లో ఉంచారు. వ్యాక్సినేషన్‌పై ట్విట్టర్లో స్పందించిన శర్మ... దేశంలో కరోనా అంతానికి ఆరంభం ఇవాళే మొదలైందన్నారు. ఒక డాక్టర్‌గా తాను కూడా వ్యాక్సిన్ తీసుకున్నాక... అంతా బాగానే ఉందని చెప్పారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని... ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

తదుపరి విడతలో ఎవరికిస్తారు..?
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ చటర్జీ పేషెంట్స్ వెల్ఫేర్ కమిటీలో రవీంద్రనాథ్ సభ్యుడిగా ఉండటంతో ఆయనకు కూడా వ్యాక్సిన్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ తొలి విడతలో కోటి మంది హెల్త్ కేర్ సిబ్బంది,రెండు కోట్ల ఫ్రంట్ లైన్ వర్కర్స్కు కరోనా వ్యాక్సిన్ ఇస్తుండగా.. తదుపరి విడతలో ఎవరికి ప్రాధాన్యతనిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వ్యాక్సిన్ సప్లైకి మించి డిమాండ్ ఉండటంతో ప్రాధాన్యత క్రమంలో తదుపరిని ఎవరిని చేరుస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది.

తొలి టీకా తీసుకున్నది అతనే....
తెలంగాణలో మంత్రి ఈటల రాజేందర్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు మొదట ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తొలి విడతలో వ్యాక్సిన్ హెల్త్ కేర్ సిబ్బంది,పారిశుద్ధ్య కార్మికులకే ఇవ్వాలన్న ప్రధాని మోదీ ఆదేశాలతో చివరి నిమిషంలో ఈటల వెనక్కి తగ్గారు. . దేశంలో తొలి కరోనా టీకాను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు మనీష్ కుమార్‌కు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్య బృందంతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రెండో దశలో 30 కోట్ల మందికి...?
శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. తొలి రోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి పైగా టీకా పంపిణీ చేశారు. ప్రపంచంలోనే దీన్ని అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా చెప్తున్నారు. తొలి దశలో మూడు కోట్ల మంది వ్యాక్సిన్ ఇవ్వనుండగా.. రెండో దశలో ఈ సంఖ్యను 30 కోట్ల వరకూ తీసుకెళ్లనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మోదీ తన ప్రసంగంలో తెలుగు కవి గురజాడ అప్పారావు కవితను చదివి వినిపించడం విశేషం. 'సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయి.. దేశమంటే మట్టి కాదోయి.. దేశమంటే మనుషులోయి.'అని గురజాడ కవిత్వంలోని కొన్ని పంక్తులను ఈ సందర్భంగా గుర్తుచేశారు.