సిఎం అభ్యర్థిగా విజయకాంత్: వెనక్కి తగ్గిన జవదేకర్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్‌ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దించాలనే ప్రయత్నాలను కొనసాగించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న మరో తమిళ సినీ స్టార్, డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ అఖిర అస్త్రంగా మలుచుకునేందుకు సిద్ధమవుతోంది బిజెపి.
ఈ నేపథ్యంలో విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని బిజెపి స్పష్టం చేసింది. కేంద్రమంత్రి, తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్ జావడేకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ కూటమి సీఎం అభ్యర్థిగా విజయకాంత్‌ను ప్రకటించేందుకు సిద్ధమేనని తెలిపారు.

రాష్ట్ర బీజేపీలో తీవ్ర అసంతృప్తి చెలరేగడంతో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. సీఎం అభ్యర్థిగా విజయకాంత్‌ను ప్రకటిస్తే తమకు అభ్యంతరం లేదని, కూటమిలో పని చేసేందుకు తాము సానుకూలమేనని ఆయన భార్య ప్రేమలత చెప్పినట్లు జవదేకర్ తెలిపారు.
కాగా, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, డీపీఐలతో కూడిన ప్రజా సంక్షేమ కూటమిలో చీలిక తధ్యమని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించారు.
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి తిరిగి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి కూడా మే 16వ తేదీన ఎన్నికలు జరుగనున్నందున ఆ తేదీ కూడితే 7 వస్తుందని, అది జయకు శుభశూచకమని చెబుతున్నారు. అంతేగాక, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి జాతకం ప్రకారం ఈసారికి ద్వితీయస్థానంతో సర్దుకోవాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో సీట్లు సర్దుబాటు చేసుకోవడమే కాకుండా విజయ్‌కాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనున్నట్టు కేంద్రమంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నట్టు ఓ వెబ్సైట్లో వచ్చిన వార్తతో రాష్ట్ర బీజేపీలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తమిళిసాయి సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎండీకేతో పొత్తు వ్యవహారంపై పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నట్టు ఆయన చెప్పారు.
తాను అన్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన జవదేకర్ ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని, చానళ్లపై ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తెరవెనుక చర్చలు జరపాల్సిన పని బీజేపీకి లేదని పరోక్షంగా డీఎండీకేను ఉద్దేశిస్తూ సౌందరరాజన్ అన్నారు. తామో బలమైన కూటమిని ఏర్పాటు చేసుకుంటామని, ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఒకవేళ తాము కూటమిని ఏర్పాటు చేసుకోకపోయినా రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేసే సత్తా బీజేపీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు. డీడీఎంకే పూర్తిగా పండిపోయిన పండులా ఉందని, త్వరలోనే అది డీఎంకే నేతృత్వంలోని కూటమిలో పడిపోతుందని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి చేసిన వ్యాఖ్యలపై సౌందరరాజన్ స్పందిస్తూ.. అది(డీడీఎంకే) అది పాలల్లో పడుతుందో లేక ఎవరి పాదాలకిందైనా పడుతుందో ఎవరికి తెలుసని, దానిపై తమకు చింత లేదని అన్నారు.