"హైదరాబాద్ డిక్లరేషన్" పేరుతో బీజేపీ రాజకీయ తీర్మానం?
రెండురోజులపాటు జరిగే భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ''హైదరాబాద్ డిక్లరేషన్'' పేరుతో కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ఆమోదించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాలు, అధికారంలోకి రావాల్సిన రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులు, అధికారంలోకి రావాలంటే అనుసరించాల్సిన వ్యూహాలు, తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడానికి అనుసరించాల్సిన అజెండా, కుటుంబ పాలనకు చరమగీతం పాడటంలాంటి అంశాలన్నీ కలిసివున్నదే హైదరాబాద్ డిక్లరేషన్. హెచ్ఐసీసీ వేదికగా కాషాయ దళం దీన్ని ఆమోదించబోతోంది.
2వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు, 3వ తేదీ ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు కార్యవర్గ సమావేశాలు నిర్వహించబోతున్నారు. దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులపై లోతైన చర్చ జరగనుంది. తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలంటే రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో పర్యటించిన నాయకుల అభిప్రాయాలను కార్యవర్గం తెలుసుకుంటుంది.

ఎనిమిది సంవత్సరాలుగా దేశంలో మోడీ అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు, సుపరిపాలన, రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ముఖ్యమంత్రులు, 348 ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. 3వ తేదీ సాయంత్రం విజయ సంకల్పసభ పేరుతో బహిరంగసభ నిర్వహించబోతోంది. బహిరంగసభలో తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న విమర్శలను బీజేపీ నేతలు తిప్పికొడతారు