• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దళితులంతా మావోయిస్టులే అని బీజేపీ చూపించాలనుకుంటోంది: వరవరరావు అల్లుడు సత్యనారాయణ

|

మానవహక్కుల కార్యకర్తలు అరెస్టు అయిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది ఒక్క అరెస్టులతోనే ఆగిపోలేదు...వారి బంధువుల ఇళ్లపై కూడా సోదాలు చేసేవరకు వెళ్లింది. వారిని పోలీసులు విచారణ కూడా చేశారు. ఇలాంటి వారిలో ఒకరు ప్రొఫెసర్ సత్యనారాయణ. ప్రొఫెసర్ సత్యనారాయణ దళిత హక్కుల నేత. స్వయంగా మానవహక్కుల నేత వరవరరావుకు అల్లుడు. కేవలం వరవరరావుకు అల్లుడు కావడంతోనే ప్రొఫెసర్ సత్యనారాయణ ఇంటిపై సోదాలు నిర్వహించారు పూణే పోలీసులు.

హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ సత్యనారాయణ కల్చరల్ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 1990లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్టూడెంట్స్ మూవ్‌మెంట్‌లో క్రియాశీలకంగా వ్యవహరించారు. దాదాపు 9 గంటల పాటు పూణే పోలీసులు నిర్వహించిన సోదాల్లో ప్రొఫెసర్ సత్యనారాయణ అతని కుటుంబ సభ్యులను పలు ప్రశ్నలతో పోలీసులు వేధించడమే కాకుండా వారి వస్తువులను లాక్కొన్నారు. ఇఫ్లూ స్టాఫ్ క్వార్టర్స్‌లో వారిని పోలీసులు గృహనిర్భంధం చేశారు. పూణే నుంచి వచ్చిన పోలీసులు మరాఠా భాషలో ఉన్న డాక్యుమెంట్లు చూపించి ఇది కోర్టు ఆర్డర్ అంటూ చెప్పారని సత్యనారాయణ చెప్పారు. ఇందులో మొత్తం 20 మంది పోలీసులు ఉన్నారని చెప్పిన సత్యనారాయణ పది మంది పూణే పోలీసులు మరో 10 మంది ఆంధ్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీసులని చెప్పారు.

దేవుళ్లు, దేవతల ఫోటోల బదులు అంబేడ్కర్ ఫోటోలు ఎందుకు పెట్టుకున్నావ్..?

దేవుళ్లు, దేవతల ఫోటోల బదులు అంబేడ్కర్ ఫోటోలు ఎందుకు పెట్టుకున్నావ్..?

"ఇంటిలోకి చేరుకున్న పోలీసులు తమ వద్ద సెర్చ్ వారెంట్ ఉందని చెప్పారు. ఇంట్లో ఉన్న ఫోటో ఆల్బమ్స్, ఫోటోలను చూశారు. వరవరరావుతో నేను దిగిన ఫోటోలపైనే పోలీసులు దృష్టి సారించారు. ఈ ఫోటోలో వరవరరావుతో ఎందుకున్నావని ప్రశ్నించారు. తను మా మామగారు అని చెప్పాను. మామగారితో ఫోటో తీసుకోకూడదా అని ప్రశ్నించాను" అని ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. " కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు వేశారు. అసలు పుస్తకాల షెల్ఫ్‌లో దళితులకు సంబంధించిన పుస్తకాలే ఎందుకున్నాయని ప్రశ్నించారు. మావో, మార్క్స్, లెనిన్ పుస్తకాలు చాలా ఉన్నాయి. మార్క్స్ పుస్తకాలు ఎందుకు చదువుతున్నావ్ అని ప్రశ్నించారు. గద్దర్ రచించిన పాటలు ఎందుకున్నాయ్ అని అడిగారు. దేవతలు దేవుళ్ల ఫోటోల బదులు అంబేడ్కర్, ఫూలే ఫోటోలను ఎందుకు పెట్టుకున్నావ్ అని ప్రశ్నించారు. మేధావి కావాలని ఎందుకు తపిస్తున్నావ్ వచ్చే డబ్బుతో సంతోషంగా ఉండలేవా అని అడిగారు. అందుకు నేను పుస్తకాలు చదివేది నా విద్యార్థులకు బోధించేందుకు అని చెప్పాను. అంతేకాదు పెళ్లికి ముందు తన భార్యకు తాను రాసిన లేఖలను, తన భార్య తనకు రాసిన లేఖలను కూడా పోలీసులు చదివారు. ఇందుకు నేను అడ్డు చెప్పాను. ఆ లేఖలు ఎందుకు చదువుతున్నారని ప్రశ్నించాను. ఇందులో ఏదైనా సమాచారం దొరకొచ్చు అన్నారు. ప్రేమ లేఖలో మీరు వెతుకుతున్న సమాచారం ఏముంటుంది" అని తాను ప్రశ్నించినట్లు సత్యనారాయణ తెలిపారు.

దళితులను మావోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు

దళితులను మావోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు

"భీమా కొరెగావ్ ఘటనతో నీకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు. నాకు సంబంధం లేదని చెప్పాను. భీమా కొరేగావ్ ఎక్కడుందో కూడా వాస్తవానికి నాకు తెలియదు. మంగళవారం సాయంత్రానికి కూడా నాపై ఉన్న ఆరోపణలు ఏమిటో తెలియరాలేదు. సంతకం చేయమన్నారు. అయితే డాక్యుమెంట్లలో ఏముందో అర్థం చేసుకోనిదే సంతకం చేయనని అందుకోసం తర్జుమా చేసేవారిని తీసుకురండి అంటూ చెప్పాను. ఇక ఆ డాక్యుమెంట్లలో ఏముందో తెలిసింది. వరవరరావు నా ఇంట్లో నివాసముంటున్నట్లు అందులో రాసి ఉంది. ఒకవేళ అదే నిజమైతే వారు ఇంటిని సోదా చేసి తమకు కావాల్సిన వ్యక్తి అక్కడ లేనప్పుడు ఇంటిని వదిలి వెళ్లిపోవాలి తప్ప తన వ్యక్తిగత వస్తువులను ముట్టుకునే అర్హత వారికి లేదు. పోలీసులు చేసినదంతా అన్యాయమే "అని సత్యనారాయణ చెప్పారు.

" పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. దళిత్ లిటరేచర్‌పై ఎంతో కృషిచేశాను. దళిత ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాను. నా ఇంట్లో పోలీసులకు దొరికిన డాక్యమెంట్లన్నీ దళిత కార్యక్రమాలకు సంబంధించినవే. నా జీవితమంతా దళితులకే ధార పోశాను.. కానీ పోలీసులు మాత్రం తనపై మావోయిస్టుల ముద్ర వేస్తారు. ఎరుపు రంగులో ఉన్న పుస్తకం కనిపిస్తే చాలు అది వారికి మావోయిస్టుల డాక్యుమెంట్‌లా కనిపిస్తుంది. ఇప్పుడు పోలీసులు చేస్తున్నది అదే. దళితులను మావోయిస్టుల చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు " అని ప్రొఫెసర్ సత్యనారాయణ నిప్పులు చెరిగారు.

దళిత ఉద్యమానికి కొత్త ఊపిరి పోసింది మోడీ సర్కారే

దళిత ఉద్యమానికి కొత్త ఊపిరి పోసింది మోడీ సర్కారే

దళితులకు కొన్ని సీట్లు ఇచ్చి దళితులు తమవైపే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తోందన్నారు సత్యనారాయణ. రోహిత్ వేముల ఆత్మహత్య, 2016లో ఉనాలో దళితులపై దాడి, దళిత నేత జిగ్నేష్ మెవానీ రాకతో దళితులపై జరుగుతున్న దాడులను ప్రశ్నించడం జరిగిందని దీంతో బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా పోయిందని చెప్పారు. దళితులు వారితో లేరనే సంకేతాలు స్పష్టంగా వెళ్లడంతోనే దళితులను బీజేపీ లక్ష్యంగా చేసుకొందని సత్యనారాయణ దుయ్యబట్టారు. తమలాంటి దళిత నేతలపై మావో ముద్ర వేసి దళితుల ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోందని చెప్పారు.

హిందూ కార్యకర్త సంభాజీ బీడే ప్రధానికి సన్నిహితుడు. మోడీ అప్రకటిత ఎమర్జెన్సీని నడుపుతున్నారు. ఆయన ఎలాంటి చట్టాన్ని అనుసరించరు, అదేసమయంలో ఎలాంటి ప్రజాస్వామ్య విలువలు లేవు. భీమా కోరెగావ్‌ ఘటనలో అసలైన దోషులను అరెస్టు చేయలేదని సత్యనారాయణ చెప్పారు. భీమా కోరెగావ్‌‌ ఘటనతో వరవరరావుతో పాటు ఇతర సామాజిక కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మహారాష్ట్రలో దళిత నేతలుగా ఎదుగుతున్న వారిని బీజేపీ సర్కార్ టార్గెట్ చేసిందని సత్యనారాయణ ఆరోపించారు. పోలీసులు పాల్పడిన దుశ్చర్యపై పలు ప్రజాల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇఫ్లూలోనే విద్యార్థులు విద్యార్థి సంఘాలు నిరసన తెలిపినట్లు సత్యనారాయణ చెప్పారు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా తరగతులు బహిష్కరించినట్లు చెప్పారు. విద్యార్థలు దీన్ని దేశవ్యాప్తంగా తీసుకెళుతున్నారు. ఒక ఉద్యమం చేయనున్నారని సత్యనారాయణ తెలిపారు. బీజేపీ కేవలం మీడియాను తన గుప్పిట్లో ఉంచుకుని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని సత్యనారాయణ మండిపడ్డారు.

దళిత ఉద్యమాన్ని బీజేపీనే బలపరుస్తోందని చెప్పిన సత్యనారాయణ... మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళిత ఉద్యమానికి కొత్త ఊపిరి పోశారని చెప్పారు. రోహిత్ వేముల ఘటనతో జిగ్నేష్ మెవానీలాంటి గొప్ప దళిత నాయకుడు ప్రపంచానికి పరిచయమయ్యాడని సత్యనారాయణ చెప్పారు. ఇక భీమా కొరెగావ్ ఘటనతో దళిత ఉద్యమం మరింత బలపడిందని చెప్పారు ప్రొఫెసర్ సత్యనారాయణ.

English summary
The arrests of five human rights activists on Tuesday triggered a media and political storm, but they were not the only ones who went through a gruelling time; several others saw police raids and were subjected to interrogation.One such activist who was subjected to a raid was professor K. Satyanarayana. Satyanarayana being a well-known dalit rights activist and the son-in-law of poet Varavara Rao, one of the five people arrested on Tuesday, was 'enough grounds' for the Pune Police to hound him in the name of arbitrary raids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X