పశ్చిమ బెంగాల్ పోలీసులతో బూట్లు నాకిస్తాం .. బీజేపీ నేత సంచలనం
పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు రాజు బెనర్జీ బెంగాల్ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు . రాష్ట్రంలో గూండా రాజ్యం కొనసాగుతుందని, కానీ పోలీసు బలగాలు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్న ఆయన రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తాం అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో సంచలనంగా మారింది.

పశ్చిమ బెంగాల్ లో గూండాల రాజ్యం .. పట్టనట్టు పోలీసుల వ్యవహారం
దుర్గాపూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాజు బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో ఈ రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి.. రాష్ట్రంలో గుండాల రాజ్యం కొనసాగుతోంది . పోలీసులు ఎటువంటి సహాయ సహకారాలను సామాన్య ప్రజలకు అందించడం లేదన్నారు . అలాంటి పోలీస్ సిబ్బంది ని ఏం చేయాలి. మేమైతే బిజెపి అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం హయాంలో పశ్చిమ బెంగాల్లో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని బిజెపి నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మహిళా సీఎం ఉన్న రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
మహిళా సీఎంగా ఉన్న రాష్ట్రంలో, మహిళలకు భద్రత కరువైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా పేర్కొన్నారు.
బిజెపి పార్టీ తరఫున పశ్చిమ బెంగాల్ ఇన్‌ఛార్జిగా ఉన్న విజయవర్గియా, మొత్తం దేశంలో ఒక్క పశ్చిమ బెంగాల్ లోనే టిఎంసి నియమాలు ప్రబలంగా ఉన్నాయి అని, మిగతా అన్ని చోట్ల చట్టాలు ఒకలా ఉంటే, పశ్చిమ బెంగాల్ లో మాత్రం వేరే చట్టాలు వర్తిస్తాయని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలు సురక్షితంగా లేరన్న ఆయన, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమబెంగాల్లో మహిళల భద్రత దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా విఫలమైందని, పోలీసుల పని తీరు సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేపీ నేత వ్యాఖ్యలపై పోలీస్ యంత్రాంగం రియాక్షన్ ఏంటో ?
బీజేపీ నేత రాజు బెనర్జీ తాజా వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ? బీజేపీ నేత చేసిన దారుణ వ్యాఖ్యలకు పోలీసు యంత్రాంగం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి . తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ సీఎం గా ఉన్న పశ్చిమ బెంగాల్ లో 2021 జనవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్ లో పాగా వెయ్యాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో బీజేపీకి చెక్ పెట్టాలని మమతా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది.