• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నెలసరి సమయంలో కంటి నుంచి రక్తం - ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

శానిటరీ ప్యాడ్స్

చండీగఢ్‌లో ఓ మహిళకు నెలసరి సమయంలో కంటి నుంచి కూడా రక్తం కారుతున్నట్లు వైద్యులు గుర్తించారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ప్రచురించింది.

''చండీగఢ్‌కు చెందిన ఓ మహిళ కంటి నుంచి రక్తం కారుతోందంటూ ఆస్పత్రికి వెళ్లారు. అయితే రక్తం వస్తున్నా తనకు ఎటువంటి ఇబ్బంది కానీ, బాధ కానీ లేదని, అంతకు మునుపు కూడా ఓ మారు ఇలాగే జరిగిందని ఆమె డాక్టర్లకు తెలిపారు.

అనేక పరీక్షలు చేసినా, కంటిలో ఎలాంటి సమస్యా డాక్టర్లకు కనిపించ లేదు. ఈ సమస్యపై వారు లోతైన అధ్యయనం చేయగా కంటి వెంట రక్తం కారిన రెండు సందర్భాల్లోనూ మహిళ బహిస్టులో ఉన్నట్టు గుర్తించారు.

ఈ సమస్యను వైద్య పరిభాషలో ఓక్యులార్ వికేరియస్ మెనుస్ట్రుయేషన్ అంటారని, ఇది అరుదైన సమస్య అని, ఈ సమస్య ఉన్న మహిళల్లో బహిష్టు సమయంలో కంట్లోంచి కూడా రక్తం కారే అవకాశం ఉందని డాక్టర్లు వెల్లడించారు.

బహిష్టు సందర్భంగా శరీరంలోని హార్మోన్లలో మార్పులు జరగడంతో ఇలాంటి పరిస్థితి వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు బ్రిటీష్ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

కాగా వైద్య చికిత్స అనంతరం మహిళకు ఉపశమనం లభించింద’’ని ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది.

ఆరోగ్య బీమా

వ్యాక్సీన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌కూ ఇన్సూరెన్స్‌ వర్తింపు-ఐఆర్‌డీఏఐ స్పష్టీకరణ

టీకా దుష్ప్రభావాలకూ ఇన్సూరెన్స్‌ వర్తింపజేయాల్సిందేనని, పాలసీదార్లపై అదనపు భారాన్ని మోపేలా,ఇప్పటికే అమల్లో ఉన్న పాలసీల్లో మార్పులు చేయవద్దని భారత బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) బీమా కంపెనీలకు సూచించినట్లు ఈనాడు పత్రిక ఒక కథనం ప్రచురించింది.

టీకా వేసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయేమో అన్న అనుమానం ఎంతో మందికి ఉంది. టీకా వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యలకు బీమా కవర్‌ ఉంటుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. టీకా వల్ల ఎదురైన ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితే, బీమా పాలసీ కింద కవరేజీ ఉంటుందనే భరోసా ఉంటే ఎక్కువ మంది ధైర్యంగా టీకా తీసుకోడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) దీనిపై స్పష్టత ఇచ్చిందని ఈనాడు కథనం పేర్కొంది. కొవిడ్‌-19 టీకా తీసుకున్న తర్వాత దానివల్ల ఏమైనా తేడా వచ్చి ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. అందుకయ్యే ఖర్చులు ఆరోగ్య బీమా పాలసీల కింద కవర్‌ అవుతాయని ఐఆర్‌డీఏఐ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

తీసుకున్న పాలసీలోని నియమ నిబంధనలకు లోబడి కవరేజీ ఉంటుందని 'పాలసీల్లో చేసే మార్పుల వల్ల చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాలు పెరిగేటట్లయితే, అటువంటి మార్పులు చేయొద్దు' అని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసినట్లు ఈ కథనం వెల్లడించింది. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలకు, ప్రయాణ బీమా పాలసీలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.

ఈ మేరకు సాధారణ బీమా కంపెనీలు, ఆరోగ్య బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రస్తుత పాలసీల్లో చిన్నచిన్న మార్పులు చేసేందుకు ఐఆర్‌డీఏఐ గత ఏడాది జులైలో అనుమతి ఇచ్చింది.

ఆ మార్పులను పాలసీదార్లకు తెలియజేయాలని, అటువంటి మార్పులకు అదనపు ప్రీమియం వసూలు చేయరాదని తాజాగా నిర్దేశించింది. ఈ ప్రకటనతో పాలసీదారుల్లో వ్యక్తం అవుతున్న సందేహాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు అయిందని ఈనాడు కథనం పేర్కొంది.

కరీంనగర్‌

అంతర్జాతీయ నివేదికలో కరీంనగర్‌

పునరుత్పాదక ఇంధనాన్ని (రెన్యూవెబుల్‌ ఎనర్జీ) ప్రోత్సహించే నగరాలలో కరీంనగర్‌ పేరు కూడా ఉందని, ఒక అంతర్జాతీయ సంస్థ కరీంనగర్‌ను ఈ జాబితాలో పేర్కొందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.

పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే నగరాలలో భారత్‌ నుంచి 13 నగరాలు మాత్రమే విధానాలను రూపకల్పన చేయగా వాటిలో కరీంనగర్‌ కూడా ఉందని గ్రీన్‌ ఎనర్జీ పాలసీ నెట్‌వర్క్‌ అనే అంతర్జాతీయ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

కొత్తగా నిర్మించే భవనాల వైశాల్యం 2,700 చదరపు అడుగులు దాటితే ఇళ్ల పైకప్పుపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ అమర్చేలా కరీంనగర్‌ మునిసిపాలిటీ 2019లో నిబంధన తెచ్చిందని ఈ నివేదిక పేర్కొంది.

2050 వరకు శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని దానితో సమానం చేయాలని దిల్లీ, కోల్‌కతా, చెన్నై లక్ష్యాలుగా పెట్టుకున్నాయని ఈ నివేదిక తెలిపినట్లు నమస్తే తెలంగాణ పత్రిక కథనం పేర్కొంది.

టోల్‌ప్లాజా

ఏడాదిలోగా టోల్‌ బూత్‌ల తొలగింపు- కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన

దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను ఏడాదిలోగా పూర్తిగా తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభలో వెల్లడించినట్లు సాక్షి పత్రిక ఒక కథనంలో తెలిపింది.

టోల్‌ ప్లాజాల స్థానంలో పూర్తి జీపీఎస్ ఆధారిత టోల్‌ సేకరణను తీసుకొస్తున్నట్లు మంత్రి చెప్పారని ఈ కథనం వెల్లడించింది.

ఎంట్రీ పాయింట్‌, ఎగ్జిట్‌ పాయింట్ల ఆధారంగా ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్‌ చెల్లించాల్సి ఉంటుందని, టోల్‌ చెల్లించడానికి రహదారిపై ఎక్కడా ఆగాల్సిన పని లేకుండా సులభతరం చేస్తున్నట్లు మంత్రి లోక్‌సభకు వెల్లడించారు.

"ఇకపై జీపీఎప్‌ ఆధారంగా టోల్‌ వసూళ్లు చేపట్టనున్నాం. వాహనానికి ఉన్న జీపీఎస్‌ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం'' అని గడ్కరీ వివరించారు.

93శాతం మంది వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్‌ ఉపయోగిస్తున్నారని, 7శాతం మంది ఇంకా తీసుకోలేదని, వాహనాల్లోఫాస్ట్‌ట్యాగ్‌లు అమర్చకపోతే టోల్ దొంగతనం, జీఎస్టీ ఎగవేత కేసులు పెట్టనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారని సాక్షి కథనం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bleeding from the eye during menstruation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X