నెల కిందట అదృశ్యం..మృతదేహాలుగా కనిపించిన ప్రేమికులు: అటవీ ప్రాంతంలో చెట్టుకు..!
బెంగళూరు: బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నెలరోజుల కిందట అదృశ్యమైన ప్రేమికులు మృతదేహాలుగా కనిపించారు. వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తల లేని స్థితిలో వారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వారాల కిందట ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని, అందువల్లే మృతదేహాలు కుళ్లిన స్థితిలో లభ్యమైనట్లు తెలిపారు.

కేరళకు చెందిన ప్రేమికులు..
బెంగళూరు శివార్లలోని హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను అభిజిత్ మోహన్, శ్రీలక్ష్మిగా గుర్తించారు. వారిద్దరూ మలయాళీలు. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన అభిజిత్ మోహన్, శ్రీలక్ష్మి సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. వారిద్దరూ ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేస్తున్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి వారు కనిపించట్లేదు. రెండు రోజుల పాటు గాలించిన తరువాత కూడా వారి ఆచూకీ కనిపించకపోవడంతో పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Mahesh Babu: ఇలాంటి ఘాతుకాల్లో మరణశిక్ష పడాల్సిందే: మహేష్ బాబు డిమాండ్: కేంద్రానికి, కేటీఆర్ కు..!

అటవీ ప్రాంతంలో.. కుళ్లిన స్థితిలో..
కేసు నమోదు చేసుకున్న పరప్పన అగ్రహార పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే.. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల మడివాళ సమీపంలోని అటవీ ప్రాంతంలో వారి మృతదేహాలు కుళ్లి పోయిన స్థితిలో కనిపించాయి. మృతదేహాలు ఉన్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో హెబ్బగోడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు మృతదేహాలకు తలలు లేవు. అక్కడే చెట్టుకు ఉరి వేసుకుని, బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు.

తల లేని మృతదేహాలు..
జనసంచారం ఏ మాత్రం ఉండని అటవీ ప్రాంతంలో వారు ఆత్మహత్యకు పాల్పడటం వల్ల చాలాకాలం పాటు మృతదేహాలను ఎవరూ గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకుని చాలా రోజులు కావడం వల్ల మృతదేహాలు కుళ్లిపోయి, ఉరి తాడు నుంచి తల, శరీరం వేరు అయి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం ఈ కేసును పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ కు బదలాయించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

పెళ్లికి అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్యగా నిర్ధారణ..
పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం వల్లే మనస్తాపానికి గురైన అభిజిత్ మోహన్, శ్రీలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పరప్పన అగ్రహార పోలీసులు చెప్పారు. ఎవరైనా వారిద్దరినీ హత్య చేసి ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడం వల్ల హత్య జరిగిందనడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు.