బాలీవుడ్ డ్రగ్స్ కేసు ... టాప్ ప్రొడ్యూసర్ భార్య అరెస్ట్ .. మరోమారు దీపికా మేనేజర్ విచారణ
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. సుశాంత్ కేసుతో బయటపడిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఎన్సీబీ ఈ కేసును మరింత లోతుగా విచారిస్తోంది ఇందులో భాగంగా పలువురిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు తాజాగా బాలీవుడ్ సినీ నిర్మాత ఫిరోజ్ నదియాడ్ వాలా భార్య షబానా సయీద్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయాన్ని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ధృవీకరించారు.

టాప్ ప్రొడ్యూసర్ ఫిరోజ్ నదియాడ్ వాలా ఇంట్లో ఎన్సీబీ తనిఖీలు .. గంజాయి స్వాధీనం
ఐదు రోజుల క్రితం అంధేరి వెస్ట్‌లో డ్రగ్స్ పెడ్లర్ వాహిద్ షేక్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఎన్సీబీ అధికారులు నిన్న జుహులోని నదియాడ్ వాలా ఇంటిపై దాడులు చేశారు . బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నదియాడ్ వాలా భార్య షబానా సయీద్ ఇంట్లో 10 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న తరువాత ఆమెను అరెస్టు చేసింది ఎన్సీబీ .
నవంబర్ 8 ఆదివారం డ్రగ్స్ కేసులో అరెస్టయిన తరువాత బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నదియాడ్ వాలా భార్య షబానా సయీద్ (ఎల్) ఎన్‌సిబి కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు.

నదియాడ్ వాలా భార్య షబానా సయీద్ అరెస్ట్
మాదకద్రవ్యాల మరియు సైకోట్రోపిక్ పదార్ధాల చట్టం క్రింద తాము ప్రొడ్యూసర్ నదియాడ్ వాలా భార్యను అరెస్టు చేసామని చెప్పిన ఎన్సీబీ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు . ఈ కేసులో ప్రొడ్యూసర్ ఫిరోజ్ ను కూడా విచారించనున్నామని చెప్తున్నారు.
బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారుల పేర్లు దర్యాప్తులో బయటపడ్డాయని , మొత్తం ఆపరేషన్‌లో మేము వారి వద్ద నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని ఎన్సీబీ అధికారులు చెప్తున్నారు.

డ్రగ్స్ పెడ్లర్ షేక్ ఖాతాదారులపై దర్యాప్తు.. పట్టుబడిన ప్రొడ్యూసర్ భార్య
అంధేరి వెస్ట్‌లో డ్రగ్స్ పెడ్లర్ వాహిద్ అబ్దుల్ ఖదీర్ షేక్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఏజెన్సీ ఆదివారం జుహులోని నదియాడ్ వాలా ఇంటిని శోధించింది. డ్రగ్స్ పెడ్లర్ షేక్ ఖాతాదారులపై దర్యాప్తు పోలీసులను షబానా సయీద్ వద్దకు తీసుకెళ్లింది.
ప్రొడ్యూసర్ ఫిరోజ్ భార్య షబానా సయీద్‌కు ఎన్డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద నోటీసు జారీ చేశారు. ఆమెకు సమన్లు జారీ చెయ్యటమే కాకుండా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి అరెస్టు చేసింది.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దర్యాప్తు ప్రారంభించినప్పటి నుండి మాదకద్రవ్యాల వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు ప్రారంభించింది.

దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ కు మరోమారు సమన్లు .. రేపు విచారణకు
సెప్టెంబర్ 8 న, రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌సిబి బాలీవుడ్ నటుడు రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. అదే విషయంలో దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్ మరియు సారా అలీ ఖాన్‌లను కూడా ప్రశ్నించింది. ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న దీపికా పదుకొనే మేనేజర్, కరిష్మా ప్రకాష్‌ను మరోసారి ఎన్‌సిబి విచారణ నిమిత్తం సమన్లు జారీ చేసింది. ఆమెను ఎన్సీపీ కార్యాలయానికి రావాలని నవంబర్ 10 న తన ప్రకటనను రికార్డ్ చెయ్యాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పేర్కొంది. దీంతో మరోమారు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ విచారణ ఎదుర్కోబోతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది