కంగనా టార్గెట్ గా .. జయా బచ్చన్ వ్యాఖ్యలకు అండగా .. శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు సినీ పరిశ్రమలో కీలక మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ వర్గాలు డ్రగ్స్ కు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా కూడా బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై రచ్చ కొనసాగుతుంది.
కంగనా రనౌత్ కు వై ప్లస్ కేటగిరీ భద్రతకు అయ్యే ఖర్చుపై రోజుకో చర్చ ...ఇంతకీ ఆ ఖర్చు ఎంతంటే !!

జయా బచ్చన్ వ్యాఖ్యలకు అండగా శివసేన నేత సంజయ్ రౌత్
నిన్నటికి నిన్న లోక్ సభ వేదికగా బిజెపి ఎంపీ రవి కిషన్ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై వ్యాఖ్యలు చేస్తే, ఈరోజు రాజ్యసభ వేదికగా సమాజ్వాదీ పార్టీ ఎంపీ, బాలీవుడ్ నటి జయాబచ్చన్ బిజెపి ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. జయా వ్యాఖ్యలపై కంగనా కౌంటర్ ఇస్తే శివసేన నేత, మొదటి నుంచీ ఈ వ్యవహారంలో కంగనారనౌత్ పై మండిపడుతున్న సంజయ్ రౌత్ జయాబచ్చన్ వ్యాఖ్యలను సమర్థించారు.
ఒకపక్క బిజెపి ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యలపై చెంపపెట్టులాగా జయాబచ్చన్ వ్యాఖ్యలు చేయగా, శివసేన నేత జయాబచ్చన్ ని సమర్థించడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

రాజ్య సభలో బీజేపీ ఎంపీ , కంగానాలపై పరోక్షంగా విరుచుకుపడిన జయా బచ్చన్
ఇదే సమయంలో కంగనా రనౌత్ ను టార్గెట్ చేసి సంజయ్ రౌత్ జయా బచ్చన్ కు మద్దతుగా నిలిచినట్టుగా కనిపిస్తుంది. రాజ్యసభలో డ్రగ్స్ వ్యవహారంపై మాట్లాడిన జయాబచ్చన్ డ్రగ్స్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని సినీ పరిశ్రమను తప్పుబట్టడం సరికాదు అని పేర్కొన్నారు. నేడు రాజ్య సభలో తన గళాన్ని గట్టిగా వినిపించిన జయా బచ్చన్ డ్రగ్స్ దందా పేరుతో సినీ పరిశ్రమను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు కావాలని పేర్కొన్న జయాబచ్చన్ ఎవరో కొందరు చేసిన తప్పుల కారణంగా మొత్తం సినీ పరిశ్రమపై నిందలు వేయడం మంచిది కాదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

జయా వ్యాఖ్యలకు కంగనా కౌంటర్ .. జయాకు అండగా సంజయ్ రౌత్
జయా బచ్చన్ వ్యాఖ్యలపై కంగనారనౌత్ తీవ్రంగా స్పందించారు. తన స్థానంలో జయాబచ్చన్ కుమార్తె శ్వేత, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్థానంలో జయా బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఉంటే ఆమె ఇదే విధంగా వ్యాఖ్యానిస్తారా అంటూ ప్రశ్నించారు . ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే శివసేన నేత సంజయ్ రౌత్ జయ బచ్చన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా పది లక్షల మందికి పైగా ఆధారపడి బతుకుతున్నారని, అలాంటి సినీ ఇండస్ట్రీని అప్రతిష్టపాలు చేసేలా కొందరు వ్యాఖ్యలు చేయడం జయా బచ్చన్ కు నచ్చలేదని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

జయా వ్యాఖ్యలలో విమర్శలు చేసేలా ఏముందని ప్రశ్న
తాజాగా జయాబచ్చన్ రాజ్యసభ లో ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పై శివసేన నేత సంజయ్ రౌత్ ఆమెకు అండగా నిలిచారు. బాలీవుడ్ లో అందరికీ డ్రగ్స్ తో లింకు ఉందని చెప్పడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. ఇక రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ కూడా ఇదే మాట ప్రస్తావించారని, ప్రస్తుతం బాలీవుడ్ కి అండగా నిలబడాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శించడానికి ఏముందని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. కంగనా రనౌత్ వ్యాఖ్యల నేపథ్యంలో పరోక్షంగా సంజయ్ రౌత్ జయా బచ్చన్ కు అండగా నిలిచారు.