• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒక్క యాడ్... పెను దుమారం... ఓవైపు 'లవ్ జిహాద్' విమర్శలు.. మరోవైపు 'మత సామరస్య' ప్రశంసలు..

|

ప్రముఖ జ్యువెలరీ కంపెనీ తనిష్క్ తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసిన ఓ టెలివిజన్ యాడ్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇది లవ్ జిహాద్‌ను ప్రోత్సహించడమేనని ఓ వర్గం తిట్టిపోస్తుండగా... మత సామరస్యాన్ని చాటి చెప్పిన ఆ వీడియోలో తప్పేముందని మరో వర్గం ప్రశ్నిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ కావడంతో తనిష్క్ ఆ యాడ్‌ను ఉపసంహరించుకుంది. తనిష్క్‌కి చెందిన అన్ని అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి ఆ వీడియోను తొలగించింది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది...

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది...


తనిష్క్ తమ లేటెస్ట్ బ్రాండ్ ప్రమోషన్‌కు 'ఏకత్వం' అని పేరు పెట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 9న 45 సెకన్ల నిడివి గల ఓ టెలివిజన్ యాడ్‌ను విడుదల చేసింది. ఆ యాడ్‌లో ఓ ముస్లిం కుటుంబం తమ హిందూ కోడలికి ఘనంగా శీమంతం చేసేందుకు హిందూ సాంప్రదాయ పద్దతిలో అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీంతో ఆ కోడలు ఆశ్చర్యంతో... మీరు ఇలాంటి సంప్రాదాయాలను పాటిస్తారా? అని అడుగుతుంది. అందుకు ఆమె అత్త బదులిస్తూ... ఆడబిడ్డను సంతోష పెట్టడం ప్రతీ ఇంటి సాంప్రదాయమే కదా అని నవ్వుతూ బదులిస్తుంది. ఈ వీడియోకి తనిష్క్‌ యూట్యూబ్‌లో ఇచ్చిన వివరణ ఇలా ఉంది. 'తనను సొంతబిడ్డలాగా ఆదరించే కుటుంబంలోకి ఆమె కోడలిగా వెళ్లింది. కేవలం ఆమె కోసమే వాళ్లు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈ వేడుక నిర్వహించారు. ఇది రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక' అని తనిష్క్ పేర్కొంది.

హిందూ కోడలే ఎందుకు..?

ఈ వీడియోపై ఒక వర్గం నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. 'ఎందుకని ముస్లిం కుటుంబంలో హిందూ కోడలిని చూపిస్తూ... దాన్నేదో గొప్పగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు...? దానికి బదులు ఓ హిందూ కుటుంబంలో ముస్లిం కోడలిని చూపించవచ్చుగా...? ఇదంతా చూస్తుంటే మీరు లవ్ జిహాద్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది..' అని ఓ నెటిజన్ తనిష్క్ సంస్థపై మండిపడ్డాడు. మరో నెటిజన్..'సోకాల్డ్ సెక్యులరిజం పేరుతో ఒక మతానికి సంబంధించిన మనోభావాలను గాయపరిచేలా యాడ్‌ను రూపొందించడమేంటి. ఉద్దేశపూర్వకంగా చేసినా... కాకతాళీయంగా జరిగిపోయినా... దీనికి కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే... వీడియోను తొలగించాల్సిందే..' అని డిమాండ్ చేశారు.

వీడియోని సమర్థించిన శశి థరూర్..


కొంతమంది నెటిజన్లు తనిష్క్ ఉద్యోగులను సైతం సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ వారిపై కూడా అసభ్యకర పదజాలంతో దూషణలకు దిగారు. #boycotttanishqjewelery పేరుతో హాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో తనిష్క్ ఆ వీడియోను అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించింది. మరోవైపు ఈ వీడియోలో అసలు తప్పేముందని మరో వర్గం వాదిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ దీనిపై ట్విట్టర్‌లో స్పందిస్తూ... ' సో.. హిందూ-ముస్లిం ఐక్యతను అందంగా చూపించిన ఆ యాడ్‌ను హిందూ ఛాందసవాదులు తొలగించమంటున్నారు. హిందూ-ముస్లిం ఏకత్వం వాళ్లను అంతగా చికాకు పెడితే... ప్రపంచంలో ఎన్నో ఏళ్లుగా హిందూ-ముస్లిం ఐక్యతకు చిహ్నంగా ఉన్న భారత్‌ను మాత్రం ఎందుకు బాయ్‌కాట్ చేయరు..?' అని శశి థరూర్ ఎద్దేవా చేశారు.

విమర్శలు.. ప్రశంసలు...

విమర్శలు.. ప్రశంసలు...


ఓ వర్గం ఈ యాడ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే... మరో వర్గం మాత్రం మత సామరస్యాన్ని అందంగా చూపించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి యాడ్‌ను తొలగించాల్సిన పరిస్థితి రావడం విచారకరం అని వాపోతున్నారు. 'ప్రస్తుతం కోవిడ్ 19 అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని మనమంతా భావిస్తున్నాం... కానీ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన వీడియోను సైతం తొలగించాల్సిన పరిస్థితులను చూస్తున్నాం...' అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.

English summary
A day after receiving severe backlash on social media for an advertisement featuring a Hindu-Muslim marriage, Tata Group’s Tanishq Jewellery has pulled down the controversial advertisement from its YouTube page.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X