10మంది మృతి: ఢిల్లీ విమాన ఘటనపై మోడీ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బీఎస్ఎఫ్ చార్టర్ విమానం మంగళవారం ఉదయం కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న పది మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ అధికారులు ధ్రువీకరించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరు పైలెట్, మరొకరు కోపైలెట్ కాగా మిగిలిన వారిలో ముగ్గురు బీఎస్ఎఫ్ అధికారులు విమాన సిబ్బంది, మిగితావారు సాంకేతిక నిపుణులు ఉన్నారు.
ఈ ప్రమాదంపై ఆరా తీసిన కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సంఘటనా స్థలానికి బయల్దేరారు. ఢిల్లీ విమానాశ్రాయానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారకా సెక్టార్ 8లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు స్థానికులకు కూడా గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో నలుగురు మృతేదేహాలను గుర్తించారు.

మంగళవారం ఉదయం 9.50గంటల ప్రాంతంలో తమకు దిగేందుకు అనుమతివ్వాలంటూ విమాన సిబ్బంది కోరారని, ఆ వెంటనే కొద్ది సేపటికే తమతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఓ ఇంటిన గోడను రాసుకుంటూ పక్కనే ఉన్న పొలాల్లో ఈ విమానం కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
విమానం కూలిన చోట రైల్వే లైన్ కూడా ఉంది. గోడను ఢీకొట్టిన విమానం అనంతరం ఓ సెఫ్టిక్ ట్యాంకులోకి పడిపోయింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఘటన స్థలి వద్దకు వచ్చి ఆప్రాంతాన్ని పరిశీలించారు. సాంకేతిక నిపుణులను ఢిల్లీ నుంచి రాంచీ తీసుకెళ్తుండగా సాంకేతిక లోపం కారణంగా విమానం ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఢిల్లీ టు రాంచీ వెళ్లే ఈ బీఎస్ఎఫ్ విమానాన్ని సూపర్ కింగ్ ప్లేన్గా పిలుస్తారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. విమానం కూలిన సమాచారాన్ని అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. చార్టర్ విమానం కూలిన ప్రదేశానికి 15 ఫైరింజన్లు చేరుకున్నాయి.
విషయం తెలిసిన బీఎస్ఎఫ్ అధికారులు, ఢిల్లీ పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను ద్వారకాలోని ఆసుపత్రులకు చేర్పించారు. విమానం కూలిన సమయంలో సుమారు 10 మంది బీఎస్ఎఫ్ జవాన్లు అధికారులు తెలిపారు.
బీఎస్ఎఫ్ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బీఎస్ఎఫ్ చార్టర్ విమానం కూలిపోయిన ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బీఎస్ఎఫ్ చార్టర్ విమాన ప్రమాద ఘటన బాధాకరమని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Pained by the loss of lives in the BSF plane crash in Delhi. My thoughts are with the families of the deceased.
— Narendra Modi (@narendramodi) December 22, 2015