• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇకపై తెలుగులోనూ బీటెక్ బోధన.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే మాతృభాషల్లో సాంకేతిక విద్య

By BBC News తెలుగు
|
కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

భారతీయ భాషల్లో సాంకేతిక విద్యను అందించాలన్న నూతన జాతీయ విద్యా విధానం -2020 లక్ష్యానికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం (2021-22) నుంచే ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతి ఇవ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించిందని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

అన్ని బ్రాంచీల్లో కాకుండా సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఈసీఈ, సీఎస్‌ఈ తదితర సంప్రదాయ ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లో మాత్రమే మాతృ భాషలో బీటెక్‌ను బోధించేందుకు అనుమతులు ఇవ్వనుంది.

అదీ నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌(ఎన్‌బీఏ) గుర్తింపు ఉన్న బ్రాంచీలకు మాత్రం అని నిబంధన విధించింది. ఏ బ్రాంచీకి ఎన్‌బీఏ ఉంటే అందులో ఒక సెక్షన్‌ ఇస్తారు. సాధారణంగా ఒక సెక్షన్‌ అంటే 60 సీట్లు కాగా...సగం సెక్షన్‌ 30 సీట్లు కూడా ఇస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఈసీఈని కూడా సంప్రదాయ బ్రాంచీగానే పరిగణిస్తారు.

వచ్చే విద్యా సంవత్సరం(2021-22) వృత్తి విద్యా కళాశాలలకు అనుమతుల ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలపై హ్యాండ్‌బుక్‌ను ఏఐసీటీఈ మంగళవారం విడుదల చేసింది. కొత్త నిబంధనలపై అవగాహన పెంచేందుకు బుధవారం దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల యజమానులు, ఇతర ప్రతినిధులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించింది. నిబంధనల్లో మార్పులు, చేర్పులపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.

అనంతరం కళాశాలల ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఏఐసీటీఈ ఛైర్మన్‌ ఆచార్య సహస్రబుద్ధే సమాధానమిచ్చారు. సాధారణంగా ఏప్రిల్‌ 30వ తేదీ నాటికి అనుమతులు ఇవ్వాల్సి ఉన్నా... కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జూన్‌ 30వ తేదీ నాటికి ఇస్తామని, అందుకు సుప్రీంకోర్టు అనుమతి తీసుకుంటామన్నారు.

పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం) కోర్సును అందించే విద్యాసంస్థలకు ఆయా రాష్ట్ర విద్యాశాఖలు, విశ్వవిద్యాలయాలతో సంబంధం లేదని, ఏఐసీటీఈ అనుమతితో నడుస్తాయని చెప్పారు. అవి భవిష్యత్తులో మూతపడితే అందులో చదివిన విద్యార్థుల వివరాలు ఉండవని, అందుకే ఈనెలాఖరు నాటికి గత రెండేళ్ల వివరాలు తమకు పంపించాలని ఆదేశించారు. లేకుంటే ఈసారి వాటికి అనుమతులు ఇచ్చేది లేదని ఆయన తేల్చిచెప్పారని ఈ కథనంలో తెలిపారు.

వనస్థలిపురం మిస్సింగ్ కేసు మర్డర్ కేసుగా మారింది

వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గత నెలలో జరిగిన హత్య కేసులో భార్యే హంతకురాలని పోలీసులు తేల్చారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.

వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గగన్ అగర్వాల్(38) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే గగన్ అగర్వాల్ తప్పిపోయినట్టుగా ఎల్బీ నగర్‌లో మిస్సింగ్ కేసు నమోదైందని ఆయన తెలిపారు. ఈ కేసును వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు కేసును పోలీసులు ట్రాన్స్‌ఫర్ చేశారని ఆయన తెలిపారు. గగన్ అగర్వాల్ మిస్సింగ్‌పై పీఎస్‌లో గగన్ భార్య, మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారన్నారు. దర్యాప్తు చేసి అగర్వాల్ హత్యకు గురైనట్లు వనస్థలిపురం పోలీసులు తేల్చినట్లు ఆయన తెలిపారు.

ఈ కేసులో గగన్ అగర్వాల్ రెండో భార్య నౌసియా బేగం పోలీసులను మొదట తప్పుదోవ పట్టించిందన్నారు. గగన్ అగర్వాల్ భార్య నౌసియా బేగం‌పై అనుమానంతో దర్యాప్తు చేశామని ఆయన పేర్కొన్నారు. అగర్వాల్‌ను తానే కత్తితో హత్య చేసి ఇంటి వెనుకాల పూడ్చి పెట్టినట్టు విచారణలో నౌసియా బేగం ఒప్పుకుందని ఏసీపీ తెలిపారు. దీంతో ఇంట్లో ఉన్న అగర్వాల్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు. నౌసియా బేగానికి గతంలో జరిగిన మొదటి పెళ్లితో ఆమెకు నలుగురు కూతుర్లు ఉన్నారన్నారు.

రెండేళ్ల క్రితమే మొదటి భార్యకు గగన్ అగర్వాల్ విడాకులు ఇచ్చాడు. గత జూన్‌లో నౌసిన్ బేగం((మరియాద)ను గగన్ అగర్వాల్ వివాహం చేసుకున్నాడని ఏసీపీ తెలిపారు. మొదటి భర్తతో నౌసిన్ విడిపోయాక గగన్ అగర్వాల్, నౌసియా బేగం ఇద్దరు ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత మన్సురాబాద్‌లోని అగర్వాల్ ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటున్నారని ఆయన తెలిపారు.

నౌసిన్ కూతుర్లపై తన భర్త గగన్ అగర్వాల్ ప్రవర్తన సరిగ్గా లేక పోవడంతో హత్య చేసినట్లు ఆమె చెపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు. పోలీసుల అదుపులో రెండవ భార్య నౌసిన్ బేగం ఉందన్నారు. ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారో వారందరినీ అరెస్టు చేస్తామని ఏసీపీ పురుషోత్తం రెడ్డి ప్రకటించారని ఈ వార్తలో రాశారు.

విశాఖ ఉక్కుపై ఆందోళన

ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తాం .. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని 11వ తేదీ నుండి మరింత ఉధృతం చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కోాకన్వీనర్‌ గంధం వెంకటరావు తెలిపినట్లు ప్రజాశక్తి కథనంలో పేర్కొన్నారు.

పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 27వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం నాటి దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ ఇంజినీరింగ్‌ షాప్స్‌ కార్మికులు కూర్చున్నారు. ఈ దీక్షలను వెంకటరావు ప్రారంభించి మాట్లాడారు. ఉక్కు ఉద్యమానికి యువ ఉద్యోగుల మద్దతు రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరిగితే కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వారి భవితవ్యం ఏం కావాలని ప్రశ్నించారు. రాబోయే కాలంలో అన్ని సంఘాలను కలుపుకొని దేశ వ్యాప్త ఉద్యమంగా మలుస్తామని తెలిపారు. జూనియర్‌ ఉద్యోగులు మాట్లాడుతూ ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తమను రోడ్డుపాలు చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. తామంతా ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపిన తెలంగాణ మంత్రి కె.తారక రామారావు (కెటిఆర్‌)కు విశాఖ ఉక్కు పరిరరక్షణ పోరాట కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.

ఈ మేరకు ఉక్కు నగరంలోని సిఐటియు కార్యాలయంలో బుధవారం కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరాం, కోాకన్వీనర్లు గంధం వెంకట్రావు, కె.సత్యనారాయణ సమావేశమై మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతు కూడగడుతున్నట్లు చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్థిష్టమైన ప్రణాళికతో పోరాటాన్ని ముందుకు తీసుకువెళుతోందని తెలిపారని ఈ వార్తలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Btech lessons to be taught in telugu from next academic year
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X