వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ 2021-22: పెట్రోలు మీద రూ. 2.50, డీజిల్ మీద రూ. 4 అగ్రికల్చర్ సెస్.. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో 10 ముఖ్యాంశాలు...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నిర్మలా సీతారామన్

కరోనావైరస్ మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పథంలోకి తీసుకురావటం లక్ష్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సోమవారం నాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

మునుపెన్నడూ లేనటువంటి అసాధారణ పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. దాదాపు 1 గంటా 49 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు.

2021 బడ్జెట్‌కు ఆరు అంశాలు మూలస్తంభాలుగా ఉన్నాయని చెప్పారు. వైద్యం, మంచి ఆరోగ్యం; భౌతిక, ఆర్థిక పెట్టుబడి, మౌలిక సదుపాయాలు; ఆకాంక్షాయుత భారతదేశపు సమ్మిళత అభివృద్ధి; మానవ పెట్టుబడిని పునరుత్తేజం చేయటం; వినూత్న ఆవిష్కరణలు, పరిశోధన – అభివృద్ధి; కనీస ప్రభుత్వం – గరిష్ట పాలన ఆ ఆరు అంశాలుగా వివరించారు.

కోవిడ్ మీద ఏడాదిగా కొనసాగుతున్న పోరాటం నేపథ్యంలో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచటం కోసం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకూ ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో మే నెలలో ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు పలు ప్రాజెక్టులను ప్రకటించారు.

పన్నుల విషయంలో భారీ మార్పులు, ప్రకటనలు ఏమీ చేయలేదు. ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులేమీ చేయలేదు. అయితే.. పెన్షన్లు, వడ్డీ మాత్రమే ఆదాయంగా ఉన్న 75 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇక ఆదాయ పన్ను రిటర్నులు ధాఖలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటానికి కట్టుబడి ఉన్నామని, అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటినీ అందించటానికి చర్యలు చేపడతామని ప్రకటించారు.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పది ముఖ్యాంశాలివీ...

#గమ్యం: నీట్ రాయకపోయినా వైద్యరంగంలో అవకాశాలు ఉంటాయా?

1. వైద్య వ్యవస్థల బలోపేతం... కోవిడ్ మీద పోరాటం

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం 2,23,846 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఆర్థికమంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా వ్యాక్సీన్ కోసం 35 వేల కోట్ల రూపాయలు అందించామని, అవసరమైతే ఇక ముందు కూడా నిధులు అందిస్తామని చెప్పారు.

2020లో ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ పథకాలు వాటికవే ఐదు మినీ బడ్జెట్‌లుగా నిర్మలా అభివర్ణించారు. దేశంలో వైద్య వ్యవస్థల బలోపేతానికి కొత్తగా ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన ప్రారంభిస్తామని, ఇందుకోసం ఆరేళ్లలో రూ. 64,180 కోట్లు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

కోవిడ్ వ్యాక్సీన్ గురించి మాట్లాడిన నిర్మలా సీతారామన్ భారత ప్రభుత్వం కేవలం భారత పౌరులకే కాదు, మరో వంద దేశాల ప్రజలకు కోవిడ్-19 నుంచి ఉపశమనం అందిస్తోందని చెప్పారు. ''భారత్ దగ్గర ప్రస్తుతం రెండు వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో భారత పౌరులకు సురక్షా కవచం అందించడం ప్రారంభించాం. దానితోపాటూ వందకు పైగా దేశాలకు కూడా కోవిడ్ 19 నుంచి రక్షణ అందించడం ప్రారంభించాం. త్వరలోనే మిగతా వ్యాక్సీన్లు కూడా అందుబాటులోకి వస్తాయని తెలియడం ఉపశమనం కలిగిస్తోంది’’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.

2. బీమా రంగంలో ఎఫ్‌డీఐ 74 శాతానికి పెంపు... ఎల్ఐసీ ఐపీఓ

ఎల్ఐసీ ఈ ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)తో వస్తుందని ఆర్థికమంత్రి ప్రకటించారు.

అలాగే బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితిని ప్రస్తుతమున్న 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతామని, ఇందుకోసం బీమా చట్టానికి సవరణ చేస్తామని తెలిపారు.

కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి అని నిర్మలా పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తవుతుందని చెప్పారు.

2021 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 1.75 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థికమంత్రి చెప్పారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 20,000 కోట్లు నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని.. ఈ బ్యాంకులు నియంత్రణ నిబంధనలను అనుగుణంగా సాగటానికి ఈ నిధులు అవసరమవుతాయని మంత్రి చెప్పారు.

ఐదొందల నోట్లు

3. ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు లేవు.. 75 ఏళ్లు దాటిన వృద్ధులకు మినహాయింపు

ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 2014లో 3.31 కోట్లుగా ఉంటే 2020 నాటికి 6.48 కోట్లకు పెరిగినట్లు తెలిపారు.

సీనియర్ సిటిజన్లపై టాక్స్ కంప్లయన్స్ భారం తగ్గించాలని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. కేవలం పెన్షన్, వడ్డీ మాత్రమే ఆదాయంగా ఉన్న 75 సంవత్సరాలు, అంతకుమించిన వయసు గల వారికి ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయటం నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు లిటిగేషన్‌ను తగ్గించటానికి వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. సామర్థ్యం, పారదర్శకత ఉండేలా చూడటానికి దీనిని ఫేస్‌లెస్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. పన్ను చెల్లించే ఆదాయం రూ. 50 లక్షల వరకూ ఉన్నవారు ఎవరైనా, వివాదాస్పద ఆదాయం రూ. 10 లక్షల వరకూ ఉన్నవారు ఉన్నవారు ఎవరైనా ఈ కమిటీని ఆశ్రయించవచ్చునని చెప్పారు.

మహిళా రైతులు

4. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం.. పెట్రోల్, డీజిల్ మీద అగ్రి సెస్

ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని భావిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ''2013-14లో ధాన్యం కొనుగోళ్లపై 63,000 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. దానిని 1.45 లక్షల కోట్లకు పెంచాం. ఈ ఏడాది ఆ మొత్తం 72,000 కోట్లకు చేరుతుంది. దీనివల్ల గత ఏడాది 1.2 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ ఏడాది దీనివల్ల 1.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది అన్నారు.

గోధుమలపై ప్రభుత్వం 2013-14లో 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2019లో అది 63 వేల కోట్ల రూపాయలైతే, ఇప్పుడు అది 75 వేల కోట్ల రూపాయలకు చేరింది. 2020-21లో 43 లక్షల మంది రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

పెట్రోలు మీద రూ. 2.50, డీజిల్ మీద రూ. 4 చొప్పున అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. అయితే పెట్రోల్, డీజిల్‌ల మీద బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గిస్తున్నామని.. అందువల్ల అగ్రి సెస్సు విధించినా వినియోగదారుల మీద భారం పడదని సీతారామన్ చెప్పారు.

అలాగే.. మద్యం ఉత్పత్తుల మీద 100 శాతం, ముడి పామాయిల్ మీద 17.5 శాతం, సోయాబీన్, పొద్దు తిరుగుడు ముడి నూనె మీద 20 శాతం, యాపిల్ పండ్ల మీద 35 శాతం, బంగారం, వెండి మీద 2.5 శాతం చొప్పున అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

5. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత.. కనీస వేతనాలు

సామాజిక భద్రత ప్రయోజనాలను ప్లాట్‌ఫామ్ కార్మికులకు కూడా విస్తరిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అన్ని తరగతుల కార్మికులకూ కనీస వేతనాలు వర్తిస్తాయని ప్రకటించారు. మహిళలు అన్ని కేటగిరీల్లోనూ పనిచేసేందుకు, తగినంత భద్రతతో రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేయటానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

అసంఘటిత రంగ కార్మిక శక్తి కోసం రోజువారీ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు తదితరుల సమాచారాన్ని సేకరించటానికి ఒక పోర్టల్ ప్రారంభిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇది వలస కూలీల కోసం ఆరోగ్యం, గృహనిర్మాణం, నైపుణ్యం, బీమా, రుణం, ఆహార పథకాలను రూపొందించటానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఉద్యోగి

6. తయారీ రంగం.. మౌలిక వసతులకు ప్రాధాన్యం...

ఐదు ట్రిలియన్ల ఆర్థికవ్యవస్థను సాధించాలంటే తయారీ రంగం రెండంకెల వృద్ధితో పురోగమించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. తయారీ రంగానికి ఐదేళ్లలో రూ. 1.97 ట్రిలియన్ కేటాయించనున్నట్లు చెప్పారు.

మౌలిక వసతుల సదుపాయాలను బలోపేతం చేయటం లక్ష్యంగా 2021-22 సంవత్సరంలో పెట్టుబడి వ్యయాన్ని రూ. 5.54 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి వ్యయం కన్నా సుమారు 34 శాతం అధికం.

నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కోసం మూడు దశలను ప్రతిపాదించారు: సంస్థాగత నిర్మాణాలను సృష్టించటం, ఆస్తులను నిధులుగా మార్చుకోవటం, రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌లలోయ కాపెక్స్ వాటాను పెంచటం.

డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కు రూ. 20,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఇది మూడేళ్లలో ఐదు లక్షల కోట్ల పోర్ట్‌ఫోలియోను సాధించటం లక్ష్యంగా పెట్టుకుంటుందని చెప్పారు.

ఈ బడ్జెట్‌లో భారతీయ రైల్వేలకు రూ. 1.1 లక్షల కోట్లు కేటాయించారు. అందులో 1.07 కోట్లు పెట్టుబడి వ్యయమని చెప్పారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా అభివృద్ధి కోసం రూ. 18,000 కోట్లు కేటాయిస్తామన్నారు.

కొత్తగా ఏడు పోర్టు ప్రాజెక్టులు పీపీఏ పద్ధతిలో రూ. 2,000 కోట్లకు పైగా వ్యయం చేస్తామని.. ఈ పోర్టులను ప్రైవేటు భాగస్వాముల నిర్వహించే అవకాశం ఉందని నిర్మలా తెలిపారు.

మూడేళ్లలో ఏడు టెక్స్‌ టైల్ పార్కుల ఏర్పాటు చేస్తామన్నారు.

7. స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం.. టాక్స్ హాలిడే మరో ఏడాది పెంపు

స్టార్టప్ కంపెనీలకు టాక్స్ హాలిడేను మరో ఏడాది – 2022 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.

స్టార్టప్ కంపెనీలు కేపిటల్ గెయిన్స్ మినహాయింపు మరో ఏడాది పెరుగుతుంది.

అలాగే.. స్టార్టప్‌లకు సాయం చేయడం కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊరట కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సంస్థలు పెయిడప్ కేపిటల్, టర్నోవర్ మీద ఎటువంటి పరిమితులూ లేకుండా వృద్ధి చెందటానికి దోహదపడుతుంది.

చిన్న సంస్థల పెయిడప్ కేపిటల్‌ను రూ. 50 లక్షల నుంచి రూ. 2.50 కోట్లకు పెంచారు.

8. రాష్ట్రాలకు 'రెవెన్యూ లోటు గ్రాంటు’ కింద రూ. 1.18 లక్షల కోట్లు

దేశంలోని 17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంటు కింద రూ. 1.8 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం పన్నుల్లో 41 శాతం వాటాను రాష్ట్రాలు పొందుతాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఇక ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు జరుగనున్న బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఈ బడ్జెట్‌లో భారీ హైవే ప్రాజెక్టులను ప్రకటించారు.

పశ్చిమబెంగాల్‌లో హైవేల నిర్మాణం కోసం రూ. 25,000 కోట్లు, అస్సాంలో హైవేల ప్రాజెక్టులకు రూ. 34,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే.. తమిళనాడులో 3,500 కిలోమీటర్ల హైవేలకు రూ. 1.03 లక్షల కోట్లు, కేరళలో 1,100 కిలోమీటర్ల హైవేలకు రూ. 65,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు.

2000, 500ల నోట్లు

9. 2020-21లో ద్రవ్యలోటు 9.5 శాతం.. 21-22లో 6.8 శాతం

2020-21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 9.5 శాతంగా అంచనా వేసినట్లు ఆర్థికమంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు నెలల కోసం ''ఇంకా 80,000 కోట్లు అవసరం. ఈ నిధులను ఈ రెండు నెలల్లో మార్కెట్ నుంచి సేకరిస్తాం’’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఇక రాబోయే (2021-22) ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 6.8 శాతంగా ఉంటుందన్నారు.

2025-26 ఆర్థిక సంవత్సరం కల్లా ఈ ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతానికి తగ్గిస్తామని పేర్కొన్నారు.

10. బడ్జెట్‌లో ఇతర ముఖ్యమైన ప్రకటనలు ఇవీ...

మిషన్ పోషణ్ 2.0: పోషన్ అభియాన్, న్యూట్రిషన్ పథకాలను కలుపుతూ మిషన్ పోషణ్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆర్థికమంత్రి తెలిపారు. పోషకాలు, పంపిణీ, ఫలితాలను బలోపేతం చేస్తుందని చెప్పారు.

కొత్తగా 100 సైనిక్ స్కూళ్ల ఏర్పాటు: ఎన్‌జీఓలు, ప్రైవేటు స్కూళ్లు, రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. భారత ఉన్నత విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయటానికి ఈ ఏడాది చట్టం చేస్తామని తెలిపారు.

డిజిటల్ జనాభా లెక్కల సేకరణకు రూ. 3,768 కోట్లు: రాబోయే జనాభా లెక్కల సేకరణ భారతదేశ చరిత్లరో తొలి డిజిటల్ జనాభా లెక్కల సేకరణ అవుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ భారీ కార్యకరమంలో కోసం 2021-22 సంవత్సరంలో రూ.. 3,768 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

ఉజ్వల పథకాన్ని మరో కోటి మంది లబ్ధిదారులకు విస్తరణ

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు.. మరో 100 నగరాలకు కూడా గ్యాస్ పైప్‌ లైన్ల విస్తరణ

వాయు కాలుష్యంతో పోరాడటానికి 42 పట్టణ ప్రాంతాలకు రూ. 2,217 కోట్లు కేటాయింపు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
10 highlights in Nirmala sitharaman budget
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X