Budget 2021లో కరోనా మోత బరువు: సెస్ విధింపు?: పెట్రో ఉత్పత్తులపైనా: మోడీ సర్కార్ కఠిన నిర్ణయం
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా దేశాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోబోతోన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి నెలల తరబడి లాక్‌డౌన్‌ను అమలు చేయడం వల్ల నష్టపోయిన ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 20 లక్షల కోట్ల రూపాయలతో కూడిన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం వంటి కొన్ని ఉపశమన చర్యలకు సంబంధించిన రెవెన్యూ లోటును రాబట్టుకోవడానికి సెస్ విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.

కరోనా సెస్ లేదా సర్ఛార్జ్
కరోనా వైరస్ మిగిల్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి వచ్చే బడ్జెట్లో కరోనా సెస్ లేదా సర్‌ఛార్జ్‌ను విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా కొన్ని వరుస భేటీలను కూడా నిర్వహించినట్లు సమాచారం. సెస్ రూపం ఎలా ఉండాలి? ఎంత శాతాన్ని అమల్లోకి తీసుకుని రావాలి? ఏఏ వర్గాలకు చెందిన ప్రజలకు దీన్ని వడ్డించాలనే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోన్న చర్చలు ఓ కొలిక్కి వచ్చిందని అంటున్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనల్లో వాటిని చేర్చుతారని చెబుతున్నారు.

కేబినెట్ ఆమోదం..
బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించేబోయే మంత్రివర్గ సమావేశంలో కరోనా సెస్ లేదా కోవిడ్ సర్ఛార్జ్ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని, త్వరలోనే దీనికి తుది రూపాన్ని ఇస్తుందని చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయంపై ఇది పూర్తిగా ఆధారపడి ఉండొచ్చని, కేబినెట్ ఆమోదిస్తే.. కరోనా వైరస్ సెస్ ప్రతిపాదనలను బడ్జెట్లో చేర్చుతారని అంటున్నారు. దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి మాత్రం మంత్రివర్గమే.

ప్రాథమిక చర్చలు సైతం.
వార్షిక బడ్జెట్లో కరోనా సెస్‌ను విధించే అంశంపై ప్రాథమిక చర్చించినట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ అధికార వర్గాలను ఉటంకిస్తూ జాతీయ స్థాయి బిజినెస్ వెబ్సైట్ ఒకటి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సెస్ పర్సెంటేజ్ ఎంత ఉండాలనే అంశంపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. అత్యధికంగా పన్ను చెల్లింపుదారులపైనే ఈ సెస్ భారాన్ని మోపే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, స్వల్ప ఆదాయం ఉన్న వారిని మినహాయింపు ఇవ్వాలనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేసినట్లు ఈ కథనం స్పష్టం చేసింది.

పెట్రో ఉత్పత్తులపైనా
వార్షిక్ బడ్జెట్ ప్రతిపాదనల్లో మాత్రమే కాకుండా.. అదనంగా పెట్రోలియం ఉత్పత్తులపైన కూడా ఈ సెస్ లేదా సర్ఛార్జిని విధించే అవకాశాలు లేకపోలేదని ఆ బిజినెస్ వెబ్సైట్ అంచనా వేసింది. పెట్రోల్, డీజిల్ లేదా కస్టమ్స్ డ్యూటీలపై ఈ సెస్ విధించాలనే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారుల నుంచి విశ్వసనీయ సమాచారం అందినట్లు తెలిపింది. కరోనా వైరస్ వ్యాక్సినేషన్‌కు అయ్యే ఖర్చు, వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి, హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం, రవాణా వంటి రంగాలపై చేస్తోన్న ఖర్చును సెస్ రూపంలో రాబట్టుకోవాలనే అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం నెలకొందని స్పష్టం చేసింది.