ఢిల్లీలో బుల్డోజర్ కూల్చివేతల పర్వం-ఈసారి న్యూఫ్రెండ్స్ కాలనీ, మంగోల్ పురిలో
ఢిల్లీలో బుల్డోజర్లతో అక్రమ కట్టడాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. గతంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగిన ప్రాంతాల్లో ఒక్కొక్కటిగా మున్సిపల్ అధికారులు పోలీసులు, పారామిలటరీ బలగాల సాయంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇవాళ న్యూఫ్రెండ్స్ కాలనీ, మంగోల్ పురి ప్రాంతాల్లో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది.
తాజాగా ఢిల్లీలోని షహీన్ బాగ్ ప్రాంతంలో కూల్చివేతలకు వెళ్లిన బుల్డోజర్లను స్ధానికులు అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో స్ధానికులు నిరసనకు దిగడంతో బుల్డోజర్లు వెనక్కి మళ్లాయి.దీనిపై సుప్రీంకోర్టులోనూ సీపీఎం పిటిషన్ దాఖలు చేసింది. అయితే పార్టీ తరఫున పిటిషన్ వేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాన్ని పక్కనబెట్టింది. అయితే ఇవాళ మరోసారి ఇతరప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు బుల్డోజర్లు పంపారు. దీనిపైనా స్ధానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా స్ధానిక ఆప్, కాంగ్రెస్ నేతలు బుల్డోజర్లను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగోల్ పురిలో స్ధానిక ఆప్ ఎమ్మెల్యే ముకేష్ అహ్లావత్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసినప్పుడు, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎందుకు బుల్డోజర్లను ఉపయోగించి అసౌకర్యాన్ని కలిగిస్తోందని ఆప్ ఎమ్మెల్యే ముకేష్ అహ్లావత్ ప్రశ్నించారు. అధికారుల చర్యల్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వాటిని వెంటనే ఆపాలన్నారు. అసలు ఆయా స్ధలాలు అక్రమ కట్టడాలని వారు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆక్రమణల నిరోధక డ్రైవ్ జరుగుతోందని, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి జెసిబిలను ఉపయోగించాల్సిన అవసరం ఏమిటని అడిగారని పోలీసులు తెలిపారు. డ్రైవ్ అపకుండా చూసేందుకు తాము ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు విపరించారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (SDMC) కొన్ని సంవత్సరాల క్రితం సీఏఏ వ్యతిరేక ప్రకంపనలకు కేంద్రంగా ఉన్న ప్రాంతంలో ఆక్రమణ నిరోధక డ్రైవ్‌తో ముందుకు సాగడంతో బుల్డోజర్లు నిన్న షాహీన్ బాగ్‌కు వచ్చాయి. అక్కడి స్ధానికులు, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నినాదాలతో కూల్చివేత డ్రైవ్ అడ్డుకోవడంతో బుల్డోజర్లు వెనుదిరిగాయి.