Burevi Cyclone:అరుదైన తుఫాను, 48 గంటలుగా సముద్రంలోనే..దిశ మార్చుకుంటే ఏపీకి ముప్పే..!
బురేవి తుఫాను దక్షిణ తమిళనాడును వణికిస్తోంది. నివర్ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి పూర్తిగా కోలుకోకముందే బురేవీ రూపంలో తుఫాను ఆ రాష్ట్రాన్ని కబళిస్తోంది. దక్షిణ తమిళనాడు జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. అనేక ప్రాంతాలు భారీ వర్షాల ధాటికి జలమయమయ్యాయి.24 గంటలుగా సముద్రంలో స్థిరంగా తిష్టవేసి ఉంది బురేవీ తుఫాను.

గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద తిష్ట
బురేవీ తుఫాను తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రంలో స్థిరంగా కదలకుండా బురేవి తుఫాను ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో 12 గంటల పాటు ఈ తుఫాను స్థిరంగా కొనసాగుతుందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులు కడలూరు, అరియలూరు, నాగపట్నం, రామనాథపురం జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుందని చెప్పారు. నేడు రేపు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే బురేవీ తుఫాను ధాటికి తమిళనాడులో 12 మంది మృతి చెందినట్లు సమాచారం.

చెన్నై పుదుచ్చేరి వైపు...
బురేవీ తుఫాను ధాటికి చిదంబరంలోని నటరాజస్వామి ఆలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా వర్షపు నీరు ఆలయంలోకి వచ్చిన దాఖలాలు లేవని అక్కడి అర్చకులు చెబుతున్నారు. గత కొన్ని గంటలుగా ఒకే చోటు తిష్ట వేసి ఉన్న బురేవీ తుఫాను దిశ మార్చుకుని చెన్నై పుదుచ్చేరి వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక దిశ మారితే ఏపీపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. తమిళనాడులో నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.

అరుదైన తుఫాను
బురేవీ తుఫాను చాలా అరుదైన తుఫానుగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుఫాను ముందుకు సాగేందుకు అనువైన వాతవారణం లేదని చెబుతున్నారు. అరేబియా సముద్రం మీదుగా వీస్తున్న బలమైన గాలులతో బురేవీ తుఫాను కొన్ని గంటలుగా స్థిరంగా అక్కడే తిష్టవేసి ఉందని నిపుణులు చెబుతున్నారు. మూడు మహాసముద్రాలు కలిసే చోట తుఫాను తీరం దాటడం అనేది ఇదివరకు ఎప్పుడు జరగలేదని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అరేబియా, హిందూ మహాసముద్రం మీదుగా వీస్తున్న బలమైన గాలులతో దిశ మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చిత్తూరు జిల్లాపై ప్రభావం
ఇక బురేవీ తుఫాను ఎఫెక్ట్ చిత్తూరు జిల్లాలో కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.శ్రీకాళహస్తి-పిచ్చాటూరు రోడ్డుపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగలాపురం మండలంలో పంటపొలాలు నీటమునిగాయి. కాళంగి జలాశయానికి ఇన్‌ఫ్లో కారణంగా 10 గేట్లు ఎత్తివేయడం జరిగింది. దీంతో నీరు మొత్తం లోతట్టు ప్రాంతాలకు ప్రవహిస్తోంది. ఇక తుఫాను ఎఫెక్ట్‌తో గొడ్డేరు, రాళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పీవీ పురం, నాగలాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.