వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కాల్ మీ ఎనీ టైం’ అనే మెసేజ్ నిండా ముంచింది, అకౌంట్లోని రూ. 24 లక్షలు మాయం చేసింది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బాధితుడు, ప్రతీకాత్మక చిత్రం

"మీరు ఒంటరితనంతో సతమతమవుతున్నారా? అయితే, ఈ లింక్‌పై క్లిక్ చేయండి. మీతో మాట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం" అంటూ మొబైల్ ఫోన్లకు సందేశాలు వస్తుంటాయి. కొన్ని వెబ్‌సైట్‌లలోనూ ఇలాంటి ప్రకటనలు కనిపిస్తుంటాయి.

ఆ లింక్‌పై క్లిక్ చేసి మాట్లాడాలనే ఉత్సాహం చూపించారా మీ ఒంటరితనం పోవడం పక్కన పెట్టి, మీ మానసిక ప్రశాంతత, విలువైన సమయంతో పాటూ లక్షల కొద్దీ డబ్బులు కూడా పోయే ప్రమాదం ఉంది.

విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

విశాఖపట్నానికి చెందిన 24 ఏళ్ల కిరణ్ (పేరు మార్చాం) ఇలాంటి వలయంలోనే ఇరుక్కుని వందలు, వేలు కాదు, ఏకంగా 24 లక్షల రూపాయిలు పోగొట్టుకున్నారు. ఇక తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

అసలేం జరిగింది?

న్యూడ్ కాల్స్ రికార్డ్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కి పాల్పడే ఒక ముఠాను విశాఖపట్నంసైబర్ క్రైమ్ పోలీసులు ఆగస్టు 10న అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.

ఈ కేసు వివరాలను విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రవికిశోర్ బీబీసీకి వివరించారు.

''విశాఖపట్నానికి చెందిన కిరణ్‌కు (పేరు మార్చాం) ఒక రోజు "మీరు ఒంటరిగా ఉన్నారా? కాల్ మీ ఎనీ టైమ్. నా పేరు శ్రుతి" అంటూ మొబైల్ లో ఒక మెసేజ్ వచ్చింది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన కిరణ్‌ను ఆ మెసేజ్ ఆకర్షించింది. కాల్ చేసి మాట్లాడాలని అనుకున్నారు. ఇదంతా నవంబరు 2020లో జరిగింది.

ఒక వైపు లాక్ డౌన్, మరో వైపు వర్క్ ఫ్రమ్ హోం కావడంతో కిరణ్ ఆ మెసేజ్‌ పంపించిన వ్యక్తితో మాట్లాడాలనుకుని ఆసక్తి చూపారు.

దాంతో, చొరవ తీసుకుని ఆ మెసేజ్ లో ఉన్న ఫోన్ నంబరుకు కాల్ చేశారు. కిరణ్, ఆ అమ్మాయి మధ్య సంభాషణలు వారం నుంచి పది రోజుల వరకు కొనసాగాయి.

ఈ సంభాషణలు, చాటింగ్ జరుగుతున్న సమయంలో కిరణ్‌కు సంబంధించిన వివరాలన్నీ ఆ అమ్మాయి మాటల్లో తెలుసుకున్నారు.

ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరగడంతో కొన్ని రోజుల తర్వాత ఆమె వీడియో కాల్‌లో నగ్నంగా కనిపించే అమ్మాయిలతో మాట్లాడాలనుకుంటున్నారా" అని కిరణ్‌ను అడిగారు.

అందుకు కిరణ్ ఓకే అనడంతో కొంత డబ్బును చెల్లించమని అడిగారు. అందుకు అంగీకరించిన కిరణ్, అర్ధ నగ్నంగా ఉండే వీడియో కాల్ కోసం 500 రూపాయిలు, నగ్నంగా ఉండే వీడియో కాల్ కోసం 2000 రూపాయిలు చెల్లించారు.

కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయిని కూడా నగ్నంగా కాల్‌లో మాట్లాడాలని అవతలి వ్యక్తులు కోరారు.

సైబర్ నేరాలు, ప్రతీకాత్మక చిత్రం

కిరణ్ అందుకు అంగీకరించడంతో వారి మధ్య న్యూడ్ వీడియో కాల్స్ నడిచాయి. వాటిని అవతలి వ్యక్తులు రికార్డ్ చేశారు.

అప్పటి నుంచి డబ్బు పంపమంటూ కిరణ్‌ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు.

కోరినంత డబ్బు చెల్లించకపోతే కిరణ్ నగ్నంగా ఉన్న వీడియోలను, చాట్ చేసిన స్క్రీన్ షాట్‌లను అతని కుటుంబం, స్నేహితులకు షేర్ చేస్తామని బెదిరించారు.

ఇదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనీ భయపెట్టారు.

దాంతో, ఆ అబ్బాయి పరువు పోతుందేమోనని భయపడి రూ. 24 లక్షలు వారికి చెల్లించారు.

ఇక తన దగ్గర డబ్బులు లేకపోవడంతో చివరకు జులై 16న పోలీసులను ఆశ్రయించారు.

సైబర్ క్రైం పోలీసులు ఆ అబ్బాయి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన అకౌంట్ వివరాలు, మొబైల్ డేటా ద్వారా ఈ కేసును ఛేదించి ఆగస్టు 10న నిందితులను పట్టుకున్నారు’’ అని రవికిశోర్ తెలిపారు.

ఈ నెల 10న పోలీసులు ముఠాకు చెందిన మహిళ, నెట్ వర్క్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.

ఈ నెట్ వర్క్‌ను కృష్ణ జిల్లాకు చెందిన షేక్ రహీం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో టెలీ కాలర్స్ గా పని చేసిన అనుభవం ఉన్న అమ్మాయిలతో ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెట్‌వర్క్‌లో మొత్తం 28 మంది పని చేస్తున్నట్లు చెప్పారు.

అయితే, ఈ అమ్మాయిలంతా వీడియో కాల్స్ చేస్తున్నారా లేదా అనేది తెలియదని చెప్పారు.

నిందితుల నుంచి ప్రస్తుతం రూ. 3.5 లక్షలు, 5 ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సోషల్ నెట్‌వర్క్

దేశవ్యాప్తంగా ఇలాంటి దందాలు పెరుగుతున్నాయి

2019లో దేశవ్యాప్తంగా మొత్తం 44,546 సైబర్ నేరాలు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి.

2018తో పోల్చితే 2019లో ఇలాంటి నేరాలు 70 శాతం పెరిగాయి.

2019లో నమోదైన సైబర్ క్రైం కేసులలో 60.4 శాతం మోసానికి సంబంధించినవి కాగా 5.1 శాతం కేసులు లైంగిక వేధింపులకు, 4.2 శాతం పరువుకు సంబంధించినవి ఉన్నాయి.

2019లో ఆంధ్రప్రదేశ్‌లో 25 బ్లాక్ మెయిలింగ్‌కు సంబంధించిన కేసులు నమోదు కాగా, తెలంగాణాలో 11 నమోదయ్యాయి.

బాధితుడు, ప్రతీకాత్మక చిత్రం

మూడేళ్లుగా ఎక్కువయ్యాయి

ఫోన్ కాల్స్, మెసేజీల ద్వారా జరిగే నేరాలు గత మూడేళ్లుగా బాగా పెరిగాయని నిపుణులు అంటున్నారు.

ఈ నేరాలు జరిగే తీరును సైబర్ నిపుణులు శ్రీధర్ నల్లమోతు బీబీసీకి వివరించారు.

సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ డాటాబేస్ ద్వారా ముందుగా కొన్ని ఫోన్ నంబర్లను సేకరించి ర్యాండమ్‌గా సందేశాలు పంపిస్తూ ఉంటారు.

అవతలి వ్యక్తి స్పందించిన వెంటనే చాట్ చేయడం మొదలుపెడతారు. ఈ చాట్ మొదట్లో చిలిపి సంభాషణలుగా మొదలై, క్రమేపీ న్యూడ్ కాల్స్ వరకూ వెళ్తుందని వివరించారు.

చాట్ చేసిన సంభాషణలను స్క్రీన్ షాట్ తీయడం, వెబ్ కామ్ ద్వారా న్యూడ్ కాల్స్ రికార్డు చేయడం లాంటివి చేస్తారని చెప్పారు.

ఇక రికార్డింగ్ చేతికి రాగానే డబ్బు పంపమని అడుగుతూ బ్లాక్ మెయిలింగ్ మొదలు పెడతారని వివరించారు.

మొబైల్ ఫోన్

ఇలాంటి మోసాల నుంచి రక్షణ ఎలా?

సైబర్ నేరాలకు అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా గురవుతూ ఉంటారని, వీటి నుంచి తప్పించుకునేందుకు కొన్ని జాగ్రత్తలను శ్రీధర్ సూచించారు.

అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్ రిసీవ్ చేసుకోవడం గానీ, లేదా కొత్త వ్యక్తులకు వీడియో కాల్స్ చేయడం గాని, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.

"కాల్ మీ ఎనీ టైమ్", "అర్ యూ లోన్లీ", "యూ వన్ ది లాటరీ" లాంటి సందేశాలు చూసి ఆకర్షితులు కాకూడదు.

"ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో స్నేహితుల జాబితాను ఇతరులకు కనిపించేలా ఉంచొద్దు. దీంతో, నేరస్థులు మీ స్నేహితుల వివరాలను తెలుసుకోలేరు" అని చెప్పారు.

"ఇలాంటి బెదిరింపులు వచ్చినప్పుడు ముందుగా ఇంట్లో వాళ్ళతో కానీ, స్నేహితులతో కానీ చర్చించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడం చేయాలి కానీ, మోసగాళ్ల ఒత్తిళ్లకు లొంగకూడదు" అని సూచించారు.

బెదిరింపులకు గురవుతున్న సమయంలో ఒక వారం 10 రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కూడా మంచిది అని అన్నారు. మోసగాళ్లు ఎక్కువ కాలం ఒకే వ్యక్తి వెంట పడలేరని అన్నారు.

ఫోన్

నగ్న వీడియో కాల్స్ విషయంలో బ్లాక్ మెయిల్‌కి గురయిన 34 సంవత్సరాల వ్యక్తి నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా జూన్ 2021లో పుణె పోలీసులు ఒక మహిళపై కేసు నమోదు చేసినట్లు 'హిందూస్తాన్ టైమ్స్’ పత్రిక పేర్కొంది.

రాజస్థాన్ లో సుమారు 100 మంది ముఠాకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను మే 2021లో అరెస్టు చేశారు.

ఇందులో నిందితులు మహిళల్లా మాట్లాడుతూ అవతలి వ్యక్తి న్యూడ్ వీడియోలను సేకరించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ కి పాల్పడుతూ ఉంటారు. ఇందుకోసం నిందితులు తమ ప్రొఫైల్స్‌లో మహిళల ఫోటోలను పెట్టుకుంటారని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
"Call me Any time " message has looted Rs.24 lakhs from account
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X