
Aam Aadmi Party: గుజరాత్లో కాంగ్రెస్‌ను అరవింద్ కేజ్రీవాల్ పార్టీ రీప్లేస్ చేయగలదా? బీజేపీ కోటను కూలగొట్టగలదా?

ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. దిల్లీ తరువాత పంజాబ్‌లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ, గుజరాత్‌లోనూ అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే గుజరాత్ మీద దృష్టి పెట్టారు. తరచూ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సోమవారం కూడా ఆయన గుజరాత్‌కు వెళ్లారు. అధికారంలో ఉన్న బీజేపీకి కంచుకోటగా భావించే మెహసాణాలో ర్యాలీ చేపట్టారు.
'బీజేపీకి విరుగుడు ఆమ్ ఆద్మీ పార్టీనే'
ర్యాలీ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ దాని సిస్టర్ పార్టీ కాంగ్రెస్‌తో గుజరాత్ ప్రజలు విసిగిపోయారని కేజ్రీవాల్ అన్నారు. పరివర్తన యాత్రలో భాగంగా వేల మంది గుజరాతీలతో తాను మాట్లాడానని వారంతా మార్పును కోరుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
'రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా దిల్లీలో మేం చేసిన మంచి పనుల గురించి చెప్పుకుంటున్నారు. బీజేపీ అంటేనే గుజరాత్ ప్రజలు భయపడుతున్నారు. కానీ ఇప్పుడు వారు భయపడాల్సిన అవసరం లేదు. గుజరాత్లో మార్పు రానుంది. బీజేపీకి ఉన్న ఒకే ఒక్క విరుగుడు ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. మాకు తప్ప మరెవరికీ బీజేపీ నేతలు భయపడరు.' అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
గుజరాత్‌లోని అన్ని సీట్లలో తాము పోటీ చేస్తామని కొద్ది రోజుల కిందటే వడోదర వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోదియా ప్రకటించి ఉన్నారు. 'ఇప్పటి వరకు గుజరాత్ ప్రజలకు చాయిస్ ఉండేది కాదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో వాళ్ల ముందు ఒక ఆప్షన్ ఉంది. ఇక ప్రజలే నిర్ణయించుకోవాలి.' అని ఆయన పిలుపునిచ్చారు.
పంజాబ్ తరువాత గుజరాత్ మీదే ఫోకస్
పంజాబ్‌లో అధికారం కైవసం చేసుకుని ఉత్సాహం మీద ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన ఫోకస్ గుజరాత్ మీద పెట్టింది. మే నెలలో రెండు సార్లు, జూన్ 6న మూడోసారి ఆయన గుజరాత్‌కు వెళ్లారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఏప్రిల్‌లో గుజరాత్లో పర్యటించారు.
2017 గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాడు ఒక్క సీటు కూడా గెలవలేక పోయింది. ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతామని ఆ పార్టీ చెబుతోంది. అయితే నాటికీ నేటికీ పరిస్థితులు మారినట్లుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పంజాబ్‌లో అడుగు పెట్టడం ద్వారా జాతీయస్థాయిలో తన ఇమేజ్ను ఆమ్ ఆద్మీ పార్టీ పెంచుకుంది. మరొకవైపు గుజరాత్ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ బలహీనపడుతూ వస్తోంది.
గత అయిదేళ్లలో కాంగ్రెస్ బలహీనపడిందా?
ఇక 2012 గుజరాత్ ఎన్నికలతో పోలిస్తే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ తన సీట్ల సంఖ్యను పెంచుకుంది. తొలిసారి బీజేపీ మెజారిటీ 100లోపుకు పడిపోయింది. ఆ ఎన్నికల్లో 182 సీట్లకు గాను బీజేపీ 99 సీట్లు సాధించగా కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుంది. 2012 ఎన్నికల్లో బీజేపీకి 115 సీట్లు రాగా కాంగ్రెస్‌కు 61 సీట్లు వచ్చాయి. కానీ గత అయిదేళ్లలో కాంగ్రెస్ పనితీరు అంత బాగా లేదని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రత్యమ్నాయం కోసం ప్రజలు చూస్తున్నారని చెబుతున్నారు.
2017 తరువాత వచ్చిన ఉపఎన్నికల్లో ఏడు సీట్లకు గాను బీజేపీ నాలుగు కాంగ్రెస్ మూడు గెలుచుకున్నాయి. కానీ 2020లో 8 సీట్లకు ఉపఎన్నికలుగా జరగ్గా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 111 స్థానాలున్నాయి.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. 2017 నుంచి 13 మంది మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ వీడారు. గుజరాత్ పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ ఇటీవలే బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ వర్సెస్ ఆప్
పోయిన ఏడాది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 27 సీట్లు సాధించింది. మొత్తం 120 సీట్లు ఉండగా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. ఆ తరువాత కూడా ఆ పార్టీ పనితీరు దిగజారుతూ వస్తోంది. మరి కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యమ్నాయంగా ఎదగగలదా?
కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దపెద్ద విజయాలు సాధిస్తుందంటూ ఇప్పుడే అంచనాలు వేయడం తొందరపాటవుతుందని సీనియర్ జర్నలిస్ట్ అజయ్ ఉమాత్ అంటున్నారు. కాకపోతే బీజేపీ ఓటు బ్యాంకును కొంత మేరకు కొల్లగొట్టగలిగే చిన్న అవకాశం అయితే ఆ పార్టీకి ఉందని ఆయన అంచనా వేస్తున్నారు.
'2017 ఎన్నికలు చూస్తే హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకుర్, జిగ్నేష్ మెవానీ రూపంలో కాంగ్రెస్ పార్టీకి యువనేతలు దొరికారు. అది పార్టీలోని యువకార్యకర్తల్లోనూ ఉత్సాహాన్ని నింపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సింది. కానీ చివరి పేజ్‌లో సూరత్‌లో మెజారిటీ సీట్లు సాధించడం ద్వారా బీజేపీ అధికారం చేపట్టగలిగింది. కానీ ఇప్పుడు యువనాయకులైన జిగ్నేష్ మెవానీ, హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకుర్ కాంగ్రెస్‌ను వదలి బయటకు వెళ్లారు. ఇప్పుడు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ఆ పార్టీ నింపాలి. ఆ ఉత్సాహాం లేకపోతే కాంగ్రెస్ మద్దతుదార్లు ప్రత్యమ్నాయం కోసం చూస్తారు. అప్పుడు వారికి ఆమ్ ఆద్మీ పార్టీ మంచి చాయిస్‌గా అనిపించొచ్చు.' అని సీనియర్ జర్నలిస్టు శరద్ గుప్తా విశ్లేషించారు.
'గుజరాత్లో కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేదు. కాబట్టి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక రాజకీయ శూన్యత కనిపిస్తోంది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్లో 27 సీట్లు సాధించడం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.' అని శరద్ గుప్తా చెప్పుకొచ్చారు.
'సూరత్ మున్సిపల్ కార్పొరేషన్లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో చాలా మంది బీజేపీలో చేరారు. మొత్తానికి గుజరాత్లో సంస్థాగతంగా ఆ పార్టీ బలంగా లేదు.' అని అజయ్ ఉమాత్ అంటున్నారు.
గుజరాత్లో మాస్ లీడర్ ఉన్నారా?
గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజల్లో బాగా గుర్తింపు ఉన్న నేతలు ఎవరూ లేరు. పెద్ద నాయకులు లేరు. పంజాబ్‌లో అయితే భగవంత్ మాన్ రూపంలో పెద్ద నాయకుడు దొరికారు. దిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కానీ గుజరాత్లో ఎవరూ లేరు.
బీజేపీ, కాంగ్రెస్ మాదిరిగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంస్థాగతమైన నిర్మాణం లేదు. కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఇంత తక్కువ సమయంలో కేడర్‌ను పెంచుకోవడం పార్టీ బలం పుంజుకోవడం సాధ్యం కాదని అజయ్ ఉమాత్ అంటున్నారు.
గుజరాత్లో గ్రామీణ దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్నారు. అదే పట్టణాల్లో అయితే బీజేపీ బలంగా కనిపిస్తోంది. అయితే అర్బన్ ప్రాంతాల్లో తమ ఓటు బ్యాంకుకు ఆమ్ ఆద్మీ పార్టీ కొంత డ్యామేజీ చేయొచ్చని బీజేపీ భావిస్తున్నట్లుగా శరద్ గుప్తా చెబుతున్నారు. అందుకే ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తరచూ గుజరాత్లో పర్యటిస్తున్నారని ఆయన చెబుతున్నారు. అయితే ఒక విషయం స్పష్టమని, గుజరాత్లో ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ అయితే ఉంటుందని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- 'నా భార్య నగ్న ఫోటోలు అప్పులు ఇచ్చే వారి దగ్గరకు ఎలా వెళ్లాయి’
- కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమన్న రాహుల్‌గాంధీ వాదనలో నిజమెంత
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లి ఏం చేయాలి? 'సూపర్ మామ్’గా ఉండటం కరెక్టేనా?
- హాజీ మస్తాన్ నుంచి కరీమ్ లాలా దాకా... ముంబయిలో ఒకప్పుడు డాన్లు ఎలా రాజ్యమేలారు?
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)