కరోనా కంటే 70%డేంజర్ బర్డ్ ఫ్లూ -మనుషులకు సోకితే చావు ఖాయం -అసలేంటీ H5N1 -చికెన్ తింటే అంతేనా?
కరోనా విలయతాండవానికి విరుగుడుగా వివిధ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో 2020తోనే వైరస్ పీడ విరగడైపోయిందని అంతా భావించారు. కొత్త ఏడాది తొలి నెలలోనే మాస్ వ్యాక్సినేషన్ కు సిద్ధమవుతోన్న భారత్లో మళ్లీ అందరినీ భయపెడుతూ బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. బర్డ్ ఫ్లూ వల్ల జీవ వైవిధ్యానికి, పౌల్ట్రీ రంగానికి దెబ్బపడుతుందే తప్ప మనుషుల ఆరోగ్యాలపై నేరుగా పెద్ద ప్రభావం ఉండబోదని ప్రభుత్వాలు, దీన్ని డీల్ చేయడంలో అనుభవమున్న సంస్థలు చెబుతున్నాయి. నిజంగా మనుషుల పాలిట బర్డ్ ఫ్లూ ఎంత ప్రమాదకరం? దాని ఇతర వివరాల్లోకి వెళితే..

వేగంగా విస్తరిస్తోంది..
జనవరి తొలి వారానికే లక్షల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడటంతో భారత్ లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి మొదలైనట్లు ప్రభుత్వాలు ప్రకటించాయి. బుధవారం తాజా సమాచారం వెల్లడయ్యే సమయానికి ఢిల్లీ, మహారాష్ట్రల్లో సైతం వైరస్ వ్యాప్తి నిర్ధారణ అయింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలో కేసులు వెలుగులోకి రాగా బర్డ్ ఫ్లూ బాధిత రాష్ట్రాల అంకె 9కి పెరిగింది. ఛత్తీస్ గఢ్, జమ్మూకాశ్మీర్ లోనూ బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకు అన్ని కలిపి నాలుగు లక్షలకుపైగా పక్షులు చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా,

బర్డ్ ఫ్లూ అంటే?
బర్డ్ ఫ్లూ అనేది పక్షుల్లో కనిపించే ఒక రకం వైరల్ వ్యాధి. పెంపుడు పక్షులైన కోళ్లు, బాతులు వంటి జాతుల్లో ఒకదాని నుంచి మరోదానికి వేగంగా విస్తరిస్తుంది. ఇది పక్షుల నుంచి మనుషులకు కూడా విస్తరిస్తుంది. అరుదుగా జంతువుల నుంచి కూడా వ్యాపిస్తుంది. దేశంలో 12కు పైగా బర్డ్ ఫ్లూ రకాలను గుర్తించారు. అందులో H5N1, H7N9, H5N6, H5N8లాంటివి ముఖ్యమైనవి. ప్రపంచంలో ఎక్కువగా H5N1, H7N9, H5N6 బర్డ్ ఫ్లూలతోనే మరణించారు. 1997లో మొదటిసారిగా బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడింది. H5N8 రకం బర్డ్ ఫ్లూ వైరస్ ఇప్పటివరకు మనుషుల్లో కనిపించలేదు. అయితే..

70 శాతం మరణాల రేటు
భూమ్మీదికి బర్డ్ ఫ్లూ పుట్టుకొచ్చి 24 ఏళ్లవుతోంది. 1997 నుంచి ఇప్పుడు(2021) వరకు.. పక్షుల్లో ఉద్భవించిన బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషుల్లో తీవ్రంగా వ్యాప్తి చెందిన దాఖలాలు లేవు. అయితే, సదరు వైరస్ మనుషులకు సోకితే మాత్రం చావు దాదాపు ఖాయమైనట్లే. గడిచిన 24 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా కేవలం 353 మంది మనుషులు మాత్రమే బర్డ్ ఫ్లూ బారినపడ్డారు.. కానీ అందులో ఏకంగా 221 మంది మృత్యువాతపడ్డారు. మహమ్మారి(పాండమిక్)గా గుర్తింపు పొందిన కరోనా వైరస్ వల్ల మనుషుల్లో మరణాల రేటు 3.5శాతంలోపే ఉండగా, బర్డ్ ఫ్లూ వల్ల మనుషుల మరణాల రేటు మాత్రం 70 శాతం వరకు ఉంది. గొప్ప ఊరట కలిగించే విషయం ఏమిటంటే, ఈ బర్డ్ ఫ్లూ.. మనుషుల నుంచి మనుషులకు సోకినట్టు ఇప్పటివరకూ ఎక్కడా రికార్డుల్లేవు. మరి,

పక్షుల్లో, మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలివే..
వలస లేదా పెంపుడు పక్షుల సోంగ, పెంట, మాంసం ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన పక్షి ఈకలు చెల్లా చెదురుగా ఉంటాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. వ్యాధి ఎక్కువ అయితే, ఆ పక్షి వివిధ శరీర భాగాలు దెబ్బతిని చనిపోతుంది. అదే బర్డ్ ఫ్లూ బారిన పడిన మనుషుల్లోతే.. దగ్గు, ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడం, 100 డిగ్రీలకు పైగా జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, జలుబు, గొంతు నొప్పి, ముక్కు నుంచి రక్తస్రావం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితోపాటు కొందరిలో వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. కొందరి కళ్లకు ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. పై వాటిలో ఏదైనా సమస్య వస్తే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే..

చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా?
బర్డ్ ఫ్లూ వ్యాప్తి తెరపైకొచ్చిన ప్రతిసారి.. చికెన్ తింటే అది సోకుతుందనే ప్రచారం జరగడం సాధారణంగా మారింది. నిజానికి బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు, బాతులు, పావురాలు లాంటి పక్షులతో సన్నిహితంగా మెలిగిన వారికి ఈ బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఎక్కువగా ఉంది. బర్డ్ ఫ్లూ విస్తరణ సమయంలో ముఖ్యంగా కోళ్ల ఫారాల్లో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలి. పావురాలకు ఆహారం వేసేవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్నందున గుడ్లు, చికెన్ బాగా ఉడికించిన తర్వాత తీసుకుంటే మంచిది.

బర్డ్ ఫ్లూ నివారణ.. పచ్చి గుడ్లు తినొద్దు
భూమిపై జీవవైవిధ్యాన్ని దెబ్బ తీయడంతోపాటు పౌల్ట్రీ రంగాన్ని ఆర్థికంగా దెబ్బతీసే ఈ బర్డ్ ఫ్లూను నివారించాలంటే అన్నిటికంటే ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలి. కోళ్ల ఫారాలకు, ఓపెన్ మార్కెట్లకు మధ్య దూరం ఎక్కువ ఉండాలి. పౌల్ట్రీ నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని బాగా ఉడికించకుండా తినకూడదు. బర్డ్ ఫ్లూ ప్రభావం పూర్తిగా తగ్గేవరకు పచ్చి గుడ్లు తినడం మానేస్తే మంచిది. ఆరోగ్యంగా ఉన్న కోడి వల్ల బర్ద్ ఫ్లూ వచ్చే అవకాశం లేదు. అయితే, బర్డ్ ఫ్లూ ఆ చికెన్ లో ఉన్నదీ, లేనిదీ మనకు తెలీదు కాబట్టి.. చికెన్ కచ్చితంగా బాగా వేడి వద్ద అంటే 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి తినాలి. సరిగ్గా ఉడకని చికెన్ తినడం వలన బర్ద్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుంది.
కూతురి అక్రమ సంబంధంపై తండ్రి ఫైర్ -అత్తింట్లో ప్రియుడితో పట్టుబడ్డ యువతి -చివరికి భారీ ట్విస్ట్