వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రాగన్ ‘దృతరాష్ట్ర కౌగిలి’, సమస్త రంగాల్లో చైనా కంపెనీల పట్టు, బ్యాన్ చేస్తే మనకే నష్టం!

125 కోట్ల మంది భారతీయులు చైనా వస్తువులను గనుక బహిష్కరిస్తే ఆ దేశ ఆర్థిక రంగం కుప్పకూలదా? ఆ విధంగా చైనాకు మనం బుద్ధి చెప్పవచ్చనేది కొందరి వాదన.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనాతో డోక్లామ్ వివాదం ఏర్పడగానే వాట్సప్ గ్రూపుల్లో ఓ సందేశం చక్కర్లు కొట్టింది. 125 కోట్ల మంది భారతీయులు చైనా వస్తువులను గనుక బహిష్కరిస్తే ఆ దేశ ఆర్థిక రంగం కుప్పకూలుతుందనేది దాని సారాంశం.

ఆ విధంగా చైనాకు మనం బుద్ధి చెప్పవచ్చనేది కొందరి వాదన. తన ఉత్పత్తులతో భారత ఆర్థిక రంగానికి ఇప్పటికే ముప్పుగా మారిన చైనా.. భవిష్యత్తులో భారత భద్రతకు సైతం ముప్పుగా మారుతుందన్న ఆగ్రహమే దీనికి కారణం.

ఈ నేపథ్యంలోనే.. దాదాపు 100 రకాల చైనా ఉత్పత్తులపై యాంటీ డంపింగ్‌ సుంకాలను విధించాలని ప్రభుత్వం కూడా ప్రతిపాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, అది అనుకున్నంత సులభం కాదని విశ్లేషకుల అంచనా. అలా చేస్తే చైనాకు జరిగే నష్టం కన్నా భారత్‌కు జరిగే నష్టమే ఎక్కువని వారు హెచ్చరిస్తున్నారు.

చాపకింద నీరులా ‘చైనా బజార్లు'..

చాపకింద నీరులా ‘చైనా బజార్లు'..

గత పుష్కరకాలంలో దేశంలోని ప్రతి పట్టణంలోనూ కనీసం ఒక చైనా బజార్‌ (దుకాణం) వెలిసింది. చైనా వస్తువులనగానే చాలా మందికి ఆ చైనాబజార్లలో చౌకగా లభించే ప్లాస్టిక్‌తో తయారైన రకరకాల వినియోగ వస్తువులు, బొమ్మలు, ఎల్రక్ట్రానిక్ ఆట వస్తువులు, ఎలక్ట్రిక్‌ పరికరాలు, పలు రకాల గృహ వినియోగ వస్తువులే గుర్తుకు వస్తాయి. అయితే, తొలినాళ్లలో ఈ ఉత్పత్తులతోనే భారత్‌లో అడుగుపెట్టిన చైనా గత రెండు దశాబ్దాల కాలంలో మాత్రం తన ఉత్పత్తుల శ్రేణిని అసాధారణంగా విస్తరించింది.

అన్ని రంగాలపై బిగుస్తున్న పట్టు...

అన్ని రంగాలపై బిగుస్తున్న పట్టు...

చైనా చాలా వేగంగా మన దేశ మార్కెట్ లో విస్తరించింది. హై ఎండ్‌ టెక్నాలజీ పరికరాలు, యంత్ర సామగ్రిపై దృష్టి సారించింది. ప్లాస్టిక్‌, విద్యుత్‌, టెలికంతో పాటు ఐటీ, హార్డ్‌వేర్‌, విద్యుత్‌, ఇన్‌ఫ్రా, ఫార్మా, ఆటో విడిభాగాలు, టైర్లు, రసాయనాలు, ఫర్నిచర్‌ తయారీ రంగాల్లో దూకుడు పెంచింది. కీలకమైన అనేక రంగాలపై నిశ్శబ్దంగా పట్టుబిగించింది. కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌, భారీ యంత్రపరికరాలు, నెట్‌వర్కింగ్‌ ఎక్విప్‌మెంట్‌.. ఇలాంటి అత్యంత కీలకమైన వస్తు శ్రేణి ప్రస్తుతం చైనా నుంచే దిగుమతి అవుతోంది.

కంపెనీల కొనుగోలుకూ ప్రయత్నాలు..

కంపెనీల కొనుగోలుకూ ప్రయత్నాలు..

చైనా తన వద్ద భారీ మొత్తంలో ఉన్న ఫారెక్స్‌ నిల్వల కారణంగా.. కీలక రంగాల్లో మన దేశంలోని పలు కంపెనీల కొనుగోలుకు కూడా ప్రయత్నిస్తోంది. వందల కోట్ల డాలర్ల పెట్టుబడితో భారత్‌లో కీలక విభాగాల్లో కంపెనీలను టేకోవర్‌ చేసేందుకు చైనా దిగ్గజాలు వేచిచూస్తున్నాయి. రియల్టీ రంగంలో చైనా కంపెనీలు పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్నాయి. అలాగే హైదరాబాద్‌ ఫార్మా సంస్థ గ్లాండ్‌ ఫార్మాను 8,450 కోట్ల రూపాయలతో చేజిక్కించుకోవడానికి పావులు కదుపుతోంది.

స్టార్టప్ కంపెనీల్లోనూ పెట్టుబడులు...

స్టార్టప్ కంపెనీల్లోనూ పెట్టుబడులు...

మన దేశంలోని స్టార్టప్‌ కంపెనీల్లోనూ చైనా పెట్టుబడులు పెరుగుతున్నాయి. దేశీయంగా అవ్యవస్థీకృత రంగంలో, చిన్నతరహా పరిశ్రమల రంగంలో ఉన్న అనేక రకాల ఉత్పత్తులు చైనా దెబ్బకు బలయ్యాయి. ఈ ఉత్పత్తులను నమ్ముకొన్న కంపెనీలు మూతబడ్డాయి. వేల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అయినా మన ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఇన్నాళ్లూ ఇబ్బడిముబ్బడిగా చైనా ఉత్పత్తులు దేశీయ మార్కెట్‌ను ముంచెత్తుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించాయి. విద్యుత్‌ ప్రాజెక్టులు చేపట్టిన పలు ప్రైవేట్‌ సంస్థలు చౌకగా లభిస్తున్నందున చైనా ఉత్పత్తులకు పెద్దపీట వేశాయి. టెలికం రంగంలోనూ అదే పరిస్థితి. ఫార్మాలో చైనా దెబ్బతో బల్క్‌డ్రగ్స్‌ కంపెనీలు మూతపడే పరిస్థితి.

ఎగుమతులు తక్కువ.. దిగుమతులు ఎక్కువ..

ఎగుమతులు తక్కువ.. దిగుమతులు ఎక్కువ..

విదేశీ వాణిజ్యంలో మిగులు, తరుగు చూస్తుంటారు. ఫలానా ఏడాదిలో ఒక దేశానికి మనం ఎంత విలువైన సరుకును విక్రయించాం.. అదే ఏడాది సదరు దేశం నుంచి ఎంత విలువైన సరుకును కొనుగోలుచేశామన్న అంశంపై మిగులు/తరుగు ఆధారపడి ఉంటుంది. చైనా వెల్లడించిన వివరాల ప్రకా రం.. భారత్‌-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం 2016లో 7,080 కోట్ల డాలర్లు (రూ.4.60 లక్షల కోట్లు). 2016లో చైనా మనకు విక్రయించిన వస్తువుల విలువ 5,833 కోట్ల డాలర్లు కాగా, మనం చైనాకు ఎగమతి చేసిన సరుకుల విలువ 1,176 కోట్ల డాలర్లే. ఒకరకంగా ఇది ఏకపక్ష వాణిజ్యమే. కొన్నేళ్లుగా చైనాకు మనఎగుమతులు తగ్గిపోతున్నాయి. 2015తో పోలిస్తే 2016లో ఇది 12% తగ్గింది. మూడేళ్లలో లోటును తగ్గించుకునే విధంగా ఉభయ దేశాల మధ్య నాలుగేళ్ల క్రితమే ఒప్పందం కుదిరినా లోటు మాత్రం పెరుగుతూనే ఉంది. చైనాకు భారత్‌ ఎగుమతుల మొత్తం 2005 నుంచి 1,000 కోట్ల డాలర్లే.

టెలికంలో 50 శాతం వాటా!

టెలికంలో 50 శాతం వాటా!

టెలికం రంగంలో దాదాపు చైనా కంపెనీల పెత్తనమే నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో పూర్తిగా చైనాదే హవాగా ఉంది. 1000 కోట్ల డాలర్ల విలువైన స్మార్ట్‌ ఫోన్ల మార్కెట్లో షామీ, లెనోవో, ఒప్పో, వివో, జియోనీ... వంటి చైనా కంపెనీల వాటా 50 శాతం ఉంటుంది. ఇది కాకుండా టెలికం కంపెనీలకు అవసరమైన యంత్ర సామగ్రి కూడా చైనా నుంచే వచ్చిపడుతోంది. దేశీయ పరిశ్రమకు ఏమాత్రం రక్షణ కల్పించకుండా ఎడా పెడా చైనా దిగుమతులను అనుమతించడం వల్ల దేశీయ పరిశ్రమ ఘోరంగా దెబ్బతిన్నట్టుగా టెలికం వర్గాలు చెబుతున్నాయి.

ఫార్మాలో మనమే నెంబర్ 1.. కానీ...

ఫార్మాలో మనమే నెంబర్ 1.. కానీ...

అనేక ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచానికి చైనా గ్లోబల్‌ ఫ్యాక్టరీ కావచ్చు. అయితే ప్రాణరక్షణ ఔషధాల తయారీలో మాత్రం భారత్‌దే తిరుగులేని స్థానం. అమెరికా సహా యావత్‌ ప్రపంచానికి అత్యంత కీలకమైన జనరిక్‌ ఔషధాలను భారతీయ సంస్థలు చౌకగా సరఫరా చేస్తున్నాయి. అమెరికా, యూరప్‌, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల్లో మన మందులకు గిరాకీ, ఆదరణ ఎక్కువ. చౌకగా నాణ్యమైన ఔషధాలను అందిస్తాయని భారతీయ కంపెనీలకు పేరు. ప్రపంచానికి ఇలా కారు చౌకగా జనరిక్‌ ఔషధాలను అందిస్తున్నామని చెప్పుకుంటున్న దేశీయ ఫార్మా రంగం ఇందుకు అవసరమైన బల్క్‌డ్రగ్స్‌ కోసం మాత్రం మళ్లీ చైనాపైనే ఆధారపడుతోంది.

65 శాతం బల్క్ డ్రగ్స్ చైనా నుంచే...

65 శాతం బల్క్ డ్రగ్స్ చైనా నుంచే...

దేశంలోని ఫార్మా రంగంలో మాత్రలు, సిరప్స్‌, క్యాప్సూల్స్‌.. ఏవి తయారుచేయాలన్నా ఏపీఐలు, ఇంటర్‌మీడియెట్స్‌ కావాల్సిందే. యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రీడియెంట్స్‌, ఇంటర్‌మీడియెట్స్‌ చైనా నుంచే కుప్పతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఒక అంచనా ప్రకారం ఈ రంగంలో 65 శాతం మేర మన అవసరాలను చైనానే తీరుస్తోంది. చైనా దెబ్బకు పుష్కరకాలంలో దేశీయ బల్క్‌ డ్రగ్‌ రంగం కుప్పకూలింది. ఒకవేళ బల్క్ డ్రగ్స్ సరఫరాను చైనా గనుక ఆపేస్తే దేశీయ ఫార్మా సంక్షోభంలో పడుతుంది. అత్యంత కీలకమైన పెన్సిలిన్‌ కోసం కూడా భారత్‌ పూర్తిగా చైనాపైనే ఆధారపడుతోంది. భారత్‌కు ఎడాపెడా బల్క్‌డ్రగ్స్‌ సప్లయ్‌ చేస్తున్న చైనా మన తుది ఉత్పత్తులను కొనుగోలు చేసే విషయంలో మాత్రం సవాలక్ష ఆటంకాలతో అడ్డుకుంటోంది.

దేశభద్రతకూ ముప్పే...

దేశభద్రతకూ ముప్పే...

విద్యుత్‌, టెలికం వంటి రంగాల్లో స్వదేశీ సంస్థలనే ప్రోత్సహించాలి. విదేశీ సంస్థలకు అవకాశం ఇవ్వడం వల్లదేశ భద్రతకు సంబంధించిన ముప్పు కోరి తెచ్చుకున్నట్టే. కానీ, దేశవ్యాప్తంగా కనీసం 20 నగరాల్లో పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌కు అవసరమైన పరికరాలను చైనా దిగ్గజ సంస్థలు... హర్బిన్‌ ఎలక్ట్రిక్‌, డాంగ్‌టాంగ్‌ ఎలక్ట్రానిక్స్‌, షాంగై ఎలక్ట్రిక్‌, సిఫాంగ్‌ ఆటోమేషన్‌ వంటివి సరఫరా చేశాయి. కొన్ని నగరాల్లో ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌ను చైనా కంపెనీలే నిర్వహిస్తున్నాయి. కీలకమైన విద్యుత్‌ రంగంలో చైనా కంపెనీల ఆగమనాన్ని నిరోధించేందుకు భారతీయ సంస్థలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 2012-16 మధ్య ఏర్పాటైన విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యంలో 30 శాతం చైనా దిగుమతే అని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. సోలార్‌ రంగంలోనే ఐదేళ్లలో చైనాకు భారత్‌ ఇచ్చే వ్యాపారం విలువ 4000 కోట్ల డాలర్లు ఉంటుంది.

దూసుకొస్తున్న డ్రాగన్.. బొక్కబోర్లా భారత్...

దూసుకొస్తున్న డ్రాగన్.. బొక్కబోర్లా భారత్...

మన మార్కెట్లోకి డ్రాగన్‌ దూసుకొస్తున్నంత వేగంగా చైనా మార్కెట్లోకి మనం వెళ్లలేకపోతున్నాం. ఇందుకు ఆ దేశం సృష్టిస్తున్న అవాంతరాలే కారణమన్న ఆరోపణలున్నాయి. మార్కెట్‌ యాక్సెస్‌లో చైనాపై మన కంపెనీల ఆరోపణలను ప్రభుత్వమే సీరియస్ గా పట్టించుకోలేదన్న అసంతృప్తి పరిశ్రమవర్గాల్లో ఉంది. మన సరుకులు, సర్వీసులు వారి మార్కెట్లోకి స్వేచ్ఛగా ప్రవేశించే వెసులుబాటు లేకుండా చేయడం, మన మార్కెట్లోకి మాత్రం దర్జాగా దూసుకొచ్చేయడం వల్ల ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనాది పైచేయిగా ఉంటోంది.

బహిష్కరిస్తే మనకే నష్టం...

బహిష్కరిస్తే మనకే నష్టం...

చైనా వస్తువులను బహిష్కరించినా మరో దేశం నుంచి వాటిని మనం కొనుగోలు చేసే పరిస్థితీ లేదు. ఎందుకంటే ప్రపంచంలోని అనేక దేశాలు ఈ రకమైన ఉత్పత్తుల కోసం చైనాపైనే ఆధారపడుతున్నాయి. మరో దేశమేదైనా ఉత్పత్తి చేసినా, చైనా ధర కంటే అనేక రెట్లు ఎక్కువ ధరకు మాత్రమే విక్రయిస్తున్నాయి. అధిక ఉత్పత్తి సామర్ధ్యం, చౌక లేబర్‌.. అంతర్జాతీయ మార్కెట్లో చైనాను ఎదురులేకుండా నిలబెడుతున్నాయి.

ముల్లు, అరిటాకు సామెతే...

ముల్లు, అరిటాకు సామెతే...

ఆయా వస్తువులు మనం చైనా నుంచి కొనకపోయినా, చైనా మనకు అమ్మకపోయినా మనమే నష్టపోయే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఎందుకంటే చైనా మొత్తం ఎగుమతుల్లో భారత్‌ వాటా 2 శాతం లోపే ఉంది. కాబట్టి మన బహిష్కరణ వల్ల చైనా ఆర్థిక రంగంపై పడే దెబ్బ స్వల్పమే. ఒకవేళ అలా జరిగినా ఆ లోటును పూడ్చుకోవడం చైనాకు పెద్ద కష్టం కాదు. అదే సమయంలో భారత్‌ ఎగుమతుల్లో చైనా మార్కెట్‌ విలువ 5%. పంతానికి పోయి చైనా కూడా భారత్‌ ఉత్పత్తులపై ‘దృష్టి' సారిస్తే.. మన ఎగుమతులు దెబ్బతింటాయి. దీనిని పూడ్చుకోవడానికి భారత్‌ తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.

డ్రాగన్ ఉక్కు కౌగిలి నుంచి బయటపడడం ఎలా?

డ్రాగన్ ఉక్కు కౌగిలి నుంచి బయటపడడం ఎలా?

ప్రస్తుత పరిస్థితిని ఒక్కమాటలో చెప్పాలంటే.. ధృతరాష్ట్ర కౌగిలి లాంటి డ్రాగన్‌ ఉక్కు కౌగిట్లో భారత ఉత్పత్తి రంగం బందీగా ఉంది. దేశీయ ఉత్పత్తిపై దృష్టి సారించి ఆ కౌగిలి నుంచి మనకు నష్టం కలగకుండా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా తప్పించుకునే ప్రయత్నం చేయాలి. అనవసర భావోద్వేగాలకు పోతే మనకే నష్టం.

English summary
Within a year, it is second time erupt the buzz on the social media to boycott Chinese products in India. Many Indians believes that trade is one of the best weapons to combat instead of the military with China. These Indians have a daydream thoughts that India is the only largest market which China have and if we boycott Chinese products, China will be stuck into the Crisis. Meanwhile, production in India will boost and employment will create which eventually leads India towards the prosperity. But the crunch is that it is not as simple as look like. Although the voice of India has been wildfire about the banning Chinese goods, the government attitude has been passive for certain reasons. If we look at the current scenario, it is not a sensible decision to boycott Chinese products for India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X