లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్: ఉద్యోగాలకు లంచంగా భూములు, బెయిల్ వచ్చిన కోద్ది రోజులకే సీబీఐ కేసు
న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరోసారి చిక్కుల్లో పడ్డారు. తాజాగా, ఆయనపై అవినీతి కేసు నమోదైంది. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై లాలూపై ఈ కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
ఈ కేసులో ఇప్పటికే కేసు నమోదు చేసిన సీబీఐ.. శుక్రవారం దర్యాప్తు ప్రారంభించింది. లాలూతోపాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తెలు మీసా భారతి, హేమల, పలువురు అభ్యర్థులపైనా కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఢిల్లీ, పాట్నా, గోపాల్‌గంజ్‌లోని లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలతోపాటు పలు కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుపుతున్నారు సీబీఐ అధికారులు.

2004-2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. ఇందులో కొన్ని అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన క్రమంలో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
Central Bureau of Investigation registers a fresh case of corruption against RJD Chief Lalu Yadav and his daughter. Raids are underway at 17 locations in Delhi and Bihar related to Lalu Yadav: Sources
— ANI (@ANI) May 20, 2022
(Visuals from Patna, Bihar) pic.twitter.com/qiil99Lpau
కాగా, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లాలూపై కేసులు నమోదు చేస్తుందని ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు. జైలు నుంచి వచ్చిన కొద్ది రోజులకే మరో కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే అవినీతి కేసు నమోదు కావడం గమనార్హం. దాణా కుంభకోణానికి సంబంధించి పలు కేసుల్లో లాలూ దోషిగా తేలడంతో రాంచీ కోర్టు ఆయనకు 14ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, రూ. 139 కోట్ల దొరండ ట్రెజరీ స్కాం కేసులో 73 లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.