లంచం తీసుకుని చైనీయులకు వీసాలు: కార్తి చిదంబరంపై కేసు, ఇల్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ నాయకుడు కార్తీ చిదంబరం 50 లక్షల రూపాయల లంచానికి బదులుగా తల్వాండి సబో పవర్ లిమిటెడ్ ప్రాజెక్ట్ కోసం చైనా కార్మికులకు వీసాలు కల్పించడంలో ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పలుమార్లు సోదాలు నిర్వహిస్తోందని ఆయన కార్యాలయం ఏఎన్ఐకి తెలిపింది.
తమ ఇంట్లో సీబీఐ రికార్డు స్థాయిలో సోదాలు చేసి ఉంటుందని కార్తీ చిదంబరం విమర్శించారు. కాగా, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కార్తీ చిదంబరం రూ. 50 లక్షలు తీసుకుని 250 మంది చైనా దేశస్తులకు వీసా సదుపాయం కల్పించారని ఆరోపణలున్నాయి. దీంతో సీబీఐ ఆయనపై కొత్త కేసులు నమోదు చేసింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం కార్తీకి చెందిన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. చెన్నై సహా ముంబై, కర్ణాటక, పంజాబ్, ఒడిశా, ఢిల్లీలోని 9 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు చేసింది సీబీఐ. కార్తి తండ్రి చిదంబరం నివాసంలోనూ సోదాలు చేపట్టినట్లు సమాచారం. అయితే, ఈ తనిఖీలపై కార్తి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. సీబీఐ ఎన్నిసార్లు ఇలాంటి సోదాలు చేసిందో లెక్క మర్చిపోయా.. బహుశా రికార్డు స్థాయిలో ఉంటుందని కార్తీ చిదంబరం పేర్కొన్నారు.
I have lost count, how many times has it been? Must be a record.
— Karti P Chidambaram (@KartiPC) May 17, 2022
కాగా, చిదంబరంతోపాటు కార్తి పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా అనుమతులు, ఎయిర్ సెల్ డీల్ విషయాల్లో మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో సీబీఐ, ఈడీ కార్తిపై పలు కేసులు నమోదు చేశాయి. కార్తి తండ్రి చిదంబరం కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఈ అవకతవకలు చోటు చేసుకున్నాయి. 2018లో ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ కార్తీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నెల రోజుల తర్వాత ఆయన బెయిల్పై వచ్చారు. చివరకు సత్యమే గెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు కార్తి చిదంబరం.