సీడీఎస్ బిపిన్ రావత్ మరణం ప్రతి దేశ భక్తుడికీ తీరని లోటు: ప్రధాని మోడీ ఉద్వేగం
బలరామ్‌పూర్: తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం దేశానికి, ప్రతి దేభ భక్తుడికీ తీరని లోటని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. యూపీలో బలరాంపూర్‌లో నిర్మించిన సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును శనివారం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన సైనికులకు మరోసారి సంతాపం తెలియజేశారు.
దేశ తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా రావత్ ధైర్యసాహసాలను కొనియాడారు. రావత్ చేసిన సేవలకు ఈ దేశమే సాక్షిగా నిలుస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. మిలిటరీలో ఉన్నంత కాలం మాత్రమే ఒక సైనికుడు.. సైనికుడిగా ఉంటాడనుకుంటే పొరపాటని.. తన జీవితకాలమంతా అతడు యోధుడిగానే ఉంటాడని ప్రధాని మోడీ చెప్పారు.

ప్రతి క్షణం క్రమశిక్షణతో జీవిస్తూ.. దేశాన్ని సగర్వంగా నిలిపేందుకు కృషి చేస్తాడు. రావత్ ఎక్కడున్నా.. సరికొత్త తీర్మానాలతో భారత్ ముందుకెళ్లే ప్రక్రియను చూస్తారు. భారత్ ఇంత దు:ఖంలో ఉన్నప్పటికీ.. మన వేగం, అభివృద్ధి ఆగదని, నిలిచిపోదని అన్నారు. భారతీయులంతా కలిసి పనిచేసి, ఇంటా బయటా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటారని మోడీ ఉద్వేగంగా మాట్లాడారు.
తమిళనాడు బుధవారం జరిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌ని కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారని మోడీ తెలిపారు. ఆయన కుటుంబానికి దేశం అండగా ఉంటుందని చెప్పారు. కాగా, హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులతోపాటు మరో 11 మంది సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగువాడైన లాన్స్ నాయక్ సాయితేజ కూడా ఉన్నారు. ఆయన పార్థీవదేహం ప్రస్తుతం బెంగళూరులో ఉంది. ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లాలోని సాయితేజ స్వగ్రామానికి చేరుకోనుంది.
కాగా, తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ. 50 లక్షల సాయం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. జగన్ సర్కార్ రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించగా, ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ సాయితేజ కుటుంబానికి అందించారు. వారిని పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి.. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.