స్కూల్స్ ప్రారంభంపై రాష్ట్రాల తలోమాట- తల్లితండ్రుల అభిప్రాయం తీసుకోవాలన్న కేంద్రం...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై తీవ్ర చర్చ సాగుతున్న వేళ కేంద్రం రాష్ట్రాలకు కీలక సూచన చేసింది. కరోనా పరిస్ధితుల్లో స్కూళ్లను తిరిగి ప్రారంభించాలనే డిమాండ్లు ఓవైపు.. వద్దంటూ మరోవైపు వాదోపవాదనలు కొనసాగుతుండటంతో ఈ విషయంలో తల్లితండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్ పంపింది.
స్కూళ్ల రీ ఓపెనింగ్ తో పాటు వాటిని తెరిచాక ఏర్పాట్లు ఎలా ఉండాలో కూడా తల్లితండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలని కేంద్రం తాజా సర్క్యులర్ లో సూచించింది. ఇందులో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో ఏ నెల నుంచి స్కూళ్లు ప్రారంభించాలనుకుంటున్నారో తెలపాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ప్రభుత్వ ఆలోచనతోపాటు తల్లితండ్రుల అభిప్రాయాలను కూడా తీసుకుని వీటిని ఇవాళ సాయంత్రం లోగా పంపాలని సూచించింది.

ఇప్పటికే పలు రాష్ట్రాలు స్కూళ్లను తిరిగి ప్రారంబించేందుకు గడువులు నిర్ణయిస్తున్నాయి. అయితే ఇవేవీ ఒకే విధంగా లేవు.
అసోంలో జూలై 31 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తుండగా.. ఢిల్లీ, బీహార్, హర్యానా, చంఢీఘర్ ఆగస్టు నుంచి ప్రారంభించాలని కోరుకుంటున్నాయి. ఏపీ, కర్నాటక, కేరళ, లడఖ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్ధాన్, ఒడిశా సెప్టెంబర్ నుంచి స్కూళ్లను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నామని చెబుతున్నాయి. మిగతా రాష్ట్రాలు ఎప్పటి నుంచి స్కూళ్లు ప్రారంభించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ వ్యవహారంలో కేంద్రం నిర్ణయం కీలకంగా మారింది. ఇప్పటికే సీబీఎస్ఈ చదువులకు 9 నుంచి 12 తరగతుల విద్యార్ధులకు సిలబస్ 30 శాతం తగ్గించాలని నిర్ణయించింది.