నితిన్ గడ్కరీ సంచలనం: కాంగ్రెస్ స్థానాన్ని చిన్న పార్టీలు భర్తీ చేయడం మంచిది కాదు..
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అదీ ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గురించి కామెంట్ చేశారు. ముంబయిలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ బలహీనపడడం మంచిది కాదన్నారు. అంతేకాదు ఆ పార్టీ స్థానాన్ని ప్రాంతీయ పార్టీలు భర్తీ చేయడం శుభ పరిణామం కాదన్నారు. ప్రజాస్వామ్యానికి అధికార పక్షం ఎంత ముఖ్యమో, బలమైన ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని గడ్కరీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవం సాధించి, జాతీయస్థాయిలో క్రియాశీలకంగా మారాలని అభిలషించారు.

కాంగ్రెస్ పుంజుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని గడ్కరీ పేర్కొన్నారు. ఈ కామెంట్స్ కలకలం రేపాయి. అధికార బీజేపీ నుంచి.. కీలక నేత ఇలా కామెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్కరీ అలా కామెంట్ చేశారో లేదో.. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. గడ్కరీ మాటలు తమకు ఆమోదయోగ్యమేనని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ అన్నారు. విపక్షాలను అణచివేసేందుకు బీజేపీ చేస్తున్న రాజకీయాలపై గడ్కరీ ప్రధాని మోడీతో మాట్లాడగలరా? అని సావంత్ ప్రశ్నించారు.
గత ఎనిమిదేళ్లుగా ఇతర పార్టీలను వేధించడం కోసం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నది ఎవరు? అని నిలదీశారు. బీజేపీ కాదా అని అడిగారు. ఇవన్నీ అందరికీ తెలుసు అని చెప్పారు. తమ పార్టీ, విపక్ష ప్రస్తావన తీసినందును వీటిపై కామెంట్ చేస్తున్నామని తెలిపారు. పై విషయాలన్నీ ప్రధాని మోడీతో గడ్కరీ మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. దీంతో దేశానికి మేలు చేసిన వారవుతారని సావంత్ హితవు పలికారు. లేదంటే నియంత పోకడలతో నడుస్తోందని.. దీంతో ఎదురే లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం.. కొన్నిసార్లు అంతర్జాతీయ సమాజం ముందు చిన్నపోవడం జరుగుతుందన్నారు.