అస్సాం-మిజోరాం సరిహద్దులో తీవ్ర ఘర్షణలు, విధ్వంసం: కేంద్రం ఎంట్రీ, అసలేం జరిగిందంటే.?
న్యూఢిల్లీ/గౌహతి: సరిహద్దు ఘర్షణలో పలువురు గాయపడటంపై కేంద్రం స్పందించింది. వెంటనే అస్సాం, మిజోరాం రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదివారం ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీసింది. మిజోరాంలోని కోలసిమ్ జిల్లాలోని ప్రాంతం, అస్సాంలోని కాచర్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల మధ్య ఘర్షణ జరిగిందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోని ఉందని ఇరు రాష్ట్రాల సీఎంలు కేంద్రానికి వివరించారు.
కేంద్రానికి అస్సాం, మిజోరాంల రిపోర్ట్
ఈ ఘర్షణలపై అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్.. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయానికి, హోంమంత్రి అమిత్ షాలకు వివరించారు. ఘర్షణల నేపథ్యంలో మిజోరాం ముఖ్యమంత్రి జోరంథంగకు కూడా ఫోన్ చేసి మాట్లాడారు సోనోవాల్. సరిహద్దులో ఘర్షణలను నివారించేందుకు కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. ఈ ఘర్షణలపై సంయుక్త ప్రకటన చేద్దామని తెలిపారు. ఈ మేరకు అస్సాం ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. మిజోరాం ముఖ్యమంత్రి జోరంథంగ కూడా ఘర్షణల నివారణకు సానుకూలంగా స్పందించారని, అంతర్రాష్టాల సరిహద్దులో శాంతి పరిస్థితులను నెలకొల్పేందుకు సహకరిస్తామని చెప్పారని అస్సాం ప్రభుత్వం తెలిపింది. ఇక మిజోరాం ప్రభుత్వం కూడా పరిస్థితిపై కేంద్రానికి వివరించింది.

సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు
ద్వైపాక్షిక, రెచ్చగొట్టే చర్యలు, అస్సాం ప్రభుత్వం చేసిన అతిక్రమణలపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చిస్తామని మిజోరాం ప్రభుత్వం తెలిపింది. కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా అధ్యక్షతన ఇరు రాష్ట్రాలు సోమవారం సమావేశమవుతాయని మిజోరాం హోంమంత్రి లాల్చమ్లియానా తెలిపారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారని వెల్లడించారు. అంతర్ రాష్ట్ర సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో సరిహద్దు గ్రామాలనైన వైరెంగ్టే, లైలాపూర్ గ్రామాల్లో ఇరు రాష్ట్రాలు భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణల కారణంగా మిజోరాంకు వెళ్లే నిత్యావసర సరుకుల వాహనాలు నిలిచిపోయాయి.

ఘర్షణలకు కోవిడ్ సెంటరే కారణమా? పెను విధ్వంసం
కాగా, అస్సాం, మిజోరాం రాష్ట్రాల మధ్య ఈ ఘర్షణలు శనివారం చోటు చేసుకున్నాయి. అస్సాం ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఆ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామంలో మిజోరాం అధికారులు కోవిడ్ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే ఈ ఘర్షణలకు కారణంగా తెలుస్తోంది. అయితే స్థానికుల కథనం మరోలా ఉంది. మిజోరాంకు చెందిన పలువురు యువకులు లైలాపూర్ గ్రామానికి వచ్చి ట్రక్ డ్రైవర్ పై దాడి చేశారని, అంతేగాక, 15 చిన్న దుకాణాలను, ఇళ్లకు నిప్పుపెట్టి కాల్చేశారని ఆరోపిస్తున్నారు. దీనికి స్థానికులు కూడా ప్రతీకారంగా దాడులు చేశారు.

అస్సాం సరిహద్దులోకి చొచ్చుకొచ్చిన మిజోరాం బలగాలు
రతబారి, పఠార్కండి ప్రాంతాల సరిహద్దు వివాదం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన భద్రతా బలగాలు కరీంగజ్ జిల్లాలో భారీగా మోహరించారు.
అంతేగాక, అస్సాం సరిహద్దులోకి మిజోరాం పోలీసులు ప్రవేశించారు. 1.5 కిలోమీటర్లమేర అస్సాం సరిహద్దులోకి చొచ్చుకొచ్చిన మిజోరాం పోలీసులు చెక్ గేట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. ఇక కరీంగంజ్‌లో 2.5 కిలోమీటర్ల మేర లోపలికి ప్రవేశించారు, దీంతో మా బలగాలు కూడా భారీగా మోహరించాల్సి వచ్చిందని దక్షిన అస్సాం రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దిలీప్ కుమార్ డే వెల్లడించారు.
త్రిపురతోనూ మిజోరాం వివాదం.. ఆలయ నిర్మాణమే కారణమా?
ఇదే సమయంలో త్రిపుర-మిజోరాం సరిహద్దులో కూడా గత కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. మిజోరాం మామిట్ జిల్లాలోని అధికారుల కథనం ప్రకారం.. త్రిపురలోని ఒక స్థానిక సంస్థ ఈ ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించటానికి ప్రతిపాదించినందున ఫుల్డుంగ్సే, జాంపూయి, జోమువాంట్లాంగ్ గ్రామాలలో పెద్ద సమావేశాలను నిషేధించారు. మిజోరాం హోం సెక్రటరీ లాల్బియక్షంగి తన త్రిపుర కౌంటర్ పార్ట్ బేరున్ కుమార్ సాహుకు లేఖ రాశారు. మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సర్వే ఆఫ్ ఇండియా ఈ విషయంలో జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించాలని కోరారు.